● పేద మహిళకు జనసేన నాయకుడి
బెదిరింపు
● సీపీఐ నాయకులను ఆశ్రయించిన
బాధిత కుటుంబం
● నేడు పాడాలో ఫిర్యాదు చేయనున్న
బాధితులు
పిఠాపురం: ఇంటికి శ్లాబ్ వేయాలంటే తమకు లంచం ఇవ్వాలని పేద మహిళను స్థానిక జనసేన నాయకుడు బెదిరించిన ఘటన స్థానిక జగ్గయ్యచెరువులో చోటుచేసుకుంది. బాధితుల నుంచి స్థానిక సీపీఐ నాయకులు సాకా రామకృష్ణ, దళిత నాయకులు ఖండవిల్లి సుబ్బారావు తదితరులు సమాచారం సేకరించారు. ఈ మేరకు ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
పేద మహిళ అయిన కఠారి సత్యవతికి జగ్గయ్యచెరువు కాలనీలో రెండు సెంట్ల స్థలం ఉందని, ఆ స్థలంలో ఇల్లు నిర్మించుకుంటుండగా స్థానిక జనసేన నాయకులు వచ్చి నిర్మాణాన్ని అడ్డుకున్నారని తెలిపారు. రూ.60 వేలు లంచం ఇస్తేనే ఇంటి నిర్మాణం ముందుకు సాగుతుందని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇంటికి శ్లాబ్ వేసేందుకు ఆదివారం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని, స్థానిక జనసేన నాయకులు వచ్చి లంచం డిమాండ్ చేయడంతో ఆ మొత్తం ఇచ్చే స్తోమత లేక ఇంటి నిర్మాణం నిలిచిపోందన్నారు. పనులు నిలిచిపోవడంతో బాధితురాలికి రూ.20వేలు నష్టం వాటిల్లిందన్నారు. బాధితురాలికి అధికారులు న్యాయం చేయాలని, న్యాయం జరగకపోతే ఆమె తరఫున సీపీఐ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు.


