● నేటి నుంచి 24వ తేదీ వరకు నిర్వహణ
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఐ.పోలవరం: నిత్యకల్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల భద్రకాళి సమేత వీరేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నుంచి 24వ తేదీ శుక్రవారం వరకూ ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. స్వామివారికి బ్రహ్మాది దేవతల ద్వారా ఆది దంపతుల సమక్షంలో కై లాశంలో వైశాఖ శుద్ధ పంచమినాడు కల్యాణం జరిగిందని పురాణాల ద్వారా తెలస్తోంది. ఆ ప్రాతిపదికన నిత్యకల్యాణ మూర్తికి శాశ్వత ప్రాతిపదికగా పాంచాహ్నిక దీక్షతో శైవాగమ పండిత ప్రముఖుడు యనమండ్ర సత్య సీతారామశర్మ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఐదు రోజుల పాటు జరుగనున్నాయి. 20న గణపతి పూజ, పంచగవ్యారాధన, దీక్షా ధారణ, అభిషేకాలు, నూతన వధూవరులను చేయడం, ధ్వజారోహణ, సాయంత్రం ‘భద్ర’పీఠంపై గ్రామోత్సవం నిర్వహించనున్నారు. 21న లక్ష్మి గణపతి హోమం, ప్రధాన కలశారాధన, వాస్తు పూజ, సాయంత్రం ‘చంద్రప్రభ’ వాహనంపై ఊరేగింపు, ఆలయ ద్వాదశ ప్రదక్షిణ, స్వామి వారికి అమ్మవారికి బ్రహ్మోత్సవ కల్యాణం, 22న పంచవింశతి కలశస్థాపన పూర్వక అభిషేకం, సరస్వతీ హోమం, రుద్రహోమం, సాయంత్రం ‘సూర్యప్రభ’ వాహనంపై గ్రామోత్సవం, 23న గవ్యాంతం, చండీహోమం, సాయంత్రం ‘నంది వాహనం’పై గ్రామోత్సవం, 24న పూర్ణాహుతి, వసంతోత్సవం, వృద్ధ గౌతమిలో త్రిశూల స్నానం, స్వామి, అమ్మవారిని రథంపై ఊరేగింపు, పుష్పోత్సవం, పవళింపు సేవ, నిర్వహించ నున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, ఈఓ వి.సత్యనారాయణ తెలిపారు.


