రహదారిణం | - | Sakshi
Sakshi News home page

రహదారిణం

Apr 19 2026 7:41 AM | Updated on Apr 19 2026 7:41 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: సెల్ఫ్‌ ఇంజినీరింగ్‌ రోడ్డు.. ఈ మాట కాస్త వింతగానే అనిపించక మానదు. నిపుణులైన ఆర్‌అండ్‌బీ అధికారులను పక్కను పెట్టి.. ప్రజాప్రతినిధులే దగ్గరుండి పర్యవేక్షిస్తూ నిర్మిస్తున్న రోడ్డు ఇది. మండల కేంద్రమైన కడియం నుంచి వీరవరం మీదుగా వెదురుమూడి వెళ్లే ఈ రోడ్డును రూ.6.12 కోట్ల అంచనాతో నిర్మిస్తున్నారు. ఆక్రమణల తొలగింపు మొదలుకుని అన్నింటిలోనూ అధికారులకంటే ప్రజాప్రతినిధుల ప్రమేయమే ఈ రోడ్డు నిర్మాణంలో ఎక్కువగా ఉంటోందని స్థానికులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ రోడ్డును 60 అడుగుల వెడల్పున సెంట్రల్‌ లైటింగ్‌, ఇరువైపులా డ్రైన్లు, ఫుట్‌పాత్‌లతో నిర్మించాలంటూ రాజమండ్రి రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కానీ, ఏం జరిగిందో ఏమో కానీ.. కొన్నిచోట్ల 48, మరికొన్నిచోట్ల 50, ఇంకొన్నిచోట్ల 60 అడుగుల వెడల్పున ఈ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇలా ఒక్కోచోట ఒక్కో వెడల్పున ఈ రోడ్డును ఎందుకు నిర్మిస్తున్నారన్న ప్రశ్నకు అధికారుల నుంచి సరైన సమాధానం రావడం లేదు.

నాణ్యత ఊసే లేదు

ఎంతో హడావుడిగా చేపట్టిన ఈ రోడ్డు నిర్మాణంలో నాణ్యతను సైతం పక్కన పెట్టేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. తారు రోడ్డు పై పొరను 50 మిల్లీమీటర్ల మందాన తొలగించి, ఆ మేరకు కొత్త మెటీరియల్‌తో రోడ్డును పటిష్టంగా నిర్మించాలని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నాయి. కానీ, దీనికి విరుద్ధంగా పాత తారు రోడ్డును తవ్వేసి, తిరిగి దానినే రోలింగ్‌ చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నిత్యం ఈ పనులను మాత్రమే పర్యవేక్షిస్తున్న ప్రజాప్రతినిధులకు ఈ విషయం కనిపించలేదా? లేక చూసీ చూడటనట్లు వదిలేశారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మండల వ్యాప్తంగా నర్సరీలు విస్తారంగా ఉన్నాయి. మొక్కల ఎగుమతులు, దిగుమతుల నిమిత్తం 35 టన్నుల లారీలు సైతం ఈ రోడ్లపై రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటి ఒత్తిడిని సైతం తట్టుకునే విధంగా నిర్మించకపోవడంతో నెలల వ్యవధిలోనే రోడ్లు ధ్వంసమైపోతున్నాయి. కడియం – వెదురుమూడి రోడ్డును కూడా అధిక లోడును తట్టుకునేలా నిర్మించకపోతే త్వరలోనే ఇది కూడా శిథిలమవక తప్పదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

‘ప్రస్తుతం నిర్మిస్తున్నంత మేర మాత్రమే ఈ రోడ్డుపై ఆక్రమణలను తొలగించామని, ఆ తరువాత డ్రైనేజీలు, ఇతర ఏర్పాట్లు కావాలంటే ఆయా శాఖలు చూసుకుంటాయని ఓ ఆర్‌అండ్‌బీ అధికారి చెప్పారు. తన పేరు మాత్రం బయటకు చెప్పొద్దని చివరిగా హామీ కూడా తీసుకున్నారు. దీనిని బట్టి వీరిపై అధికారులపై స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. నిత్యం వేలాది వాహనాలు తిరిగే ఈ రోడ్డులో ఎటువంటి ఇంజినీరింగ్‌ లోపం తలెత్తినా అది ప్రజలకు ప్రమాదకరంగా మారుతుంది. ఈ విషయాన్ని విస్మరించి, తాత్కాలిక ప్రయోజనాల కోసం ఇష్టారీతిన రోడ్లను నిర్మించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమేనని నిపుణులు చెబుతున్నారు.

ఇష్టానుసారం కడియం –

వెదురుమూడి రోడ్డు నిర్మాణం

రూ.6.12 కోట్ల అంచనాతో పనులు

అడుగడుగునా ప్రజాప్రతినిధుల పెత్తనం

నిబంధనలకు తూట్లు

మిన్నకుండిపోతున్న అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement