ఆ మంటల్లో టీడీపీ దహించుకుపోవడం ఖాయం | - | Sakshi
Sakshi News home page

ఆ మంటల్లో టీడీపీ దహించుకుపోవడం ఖాయం

Apr 19 2026 7:41 AM | Updated on Apr 19 2026 7:41 AM

వైఎస్సార్‌ సీపీ నేత జక్కంపూడి రాజా

గుంటూరులో మాజీ మంత్రి అంబటి

రాంబాబు దీక్షకు సంఘీభావం

రాజమహేంద్రవరం సిటీ: రామాయణంలో హనుమంతుడి తోకకు నిప్పు పెడితే లంకా దహనం జరిగినట్టుగానే.. నేడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి నిప్పు పెట్టడం ద్వారా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ దహనం కావడం ఖాయమని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా హెచ్చరించారు. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం చేపట్టిన నిరాహార దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ వివరాలను ఆయన ఇక్కడ ఒక ప్రకటనలో తెలిపారు. అంబటి దీక్షలో రాజా మాట్లాడుతూ, గతంలో పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న వంగవీటి మోహన్‌ రంగాను అత్యంత ఘోరంగా నరికి చంపారని అన్నారు. కాపులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని గొంతెత్తి ప్రశ్నించిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని, ఆయన కుటుంబ సభ్యులను ఏవిధంగా ఈడ్చుకెళ్లి కేసులు పెట్టారో చూశామన్నారు. ఈ ఘోరాలకు ప్రతిఫలంగా టీడీపీ రెండుసార్లు అధికారం కోల్పోయిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై 8 – 9 గంటల పాటు దాడి చేసి, నిప్పు పెట్టి చంద్రబాబు మరో ఘోర తప్పిదం చేశారని, ఫలితంగా 2029 ఎన్నికల్లో ఆయన మరోసారి అధికారం కోల్పోవడం ఖాయమనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని రాజా హెచ్చరించారు. పవిత్ర తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాలపై మాట్లాడిందుకు అంబటి రాంబాబుపై కేసులు పెట్టి, జైలుకు పంపారని అన్నారు. సీబీఐ కోర్టుకు నివేదించిన అంశంపై అంబటి మాట్లాడితే ప్రభుత్వ పెద్దలకు బాధనిపించిందన్నారు. అంబటి ఇంటిపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోకుండా విడిచిపెట్టారని, తిరిగి బాధితుల పైనే కేసు నమోదు చేసి, రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. ఖాకీ చొక్కాల ముసుగులో చాలామంది పోలీసులు టీడీపీ అభిమానుల్లా పని చేస్తున్నారన్నారు. వీరు రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని హెచ్చరించారు. చంద్రబాబు, లోకేష్‌ వద్ద మార్కులు కొట్టేద్దామనే ఉద్దేశంతో వారి డైరెక్షన్‌లో స్థానిక ఎమ్మెల్యే ఈ దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం దుర్మార్గమని రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల హామీలు అమలు చేయకుండా కేవలం వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై కేసులు బనాయించి, కక్ష సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న, నాయకులపై వేలెత్తి చూపిస్తున్న సామాన్య కార్యకర్తలపై ప్రతి రోజూ వందలు, వేలకొద్దీ కేసులు నమోదు చేస్తున్నారని అన్నారు. నెల్లూరులో ప్రసన్న కుమార్‌ రెడ్డి, ధర్మవరంలో పెద్దారెడ్డి, గుంటూరులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇళ్లపై దాడులు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం చేసిన తప్పులను ప్రశ్నిస్తూంటే ప్రజల్లో ఎక్కడ చులకన అవుతామోననే భయంతోనే కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. దీనికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని జక్కంపూడి రాజా హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement