ఇచ్చిన హామీలే ‘రిపీట్‌’ | - | Sakshi
Sakshi News home page

ఇచ్చిన హామీలే ‘రిపీట్‌’

Apr 19 2026 7:41 AM | Updated on Apr 19 2026 7:41 AM

నిధుల కేటాయింపు ఊసే లేదు

సీఎం తీరుపై విస్తుపోయిన ప్రజలు

ఆయన ప్రసంగిస్తూండగానే తిరుగుముఖం

మొక్కుబడిగా చంద్రబాబు

నిడదవోలు పర్యటన

నిడదవోలు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిడదవోలులో శనివారం నిర్వహించిన సభకు ప్రజల నుంచి ఆశించిన స్పందన కరవైంది. సీఎం ప్రసంగిస్తూండగానే సభకు వచ్చిన వారు సభ నుంచి జారుకోవడం కనిపించింది. దీంతో, ఖాళీ కుర్చీలకే ఆయన ప్రసంగం పరిమితమైంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై ఈ సభలో చంద్రబాబు ప్రకటిస్తారని పట్టణ వాసులు వేయి కళ్లతో ఎదురు చూశారు. నియోజకవర్గంపై వరాల జల్లు కురిపిస్తారని ఆశించారు. కానీ, వచ్చారు.. వెళ్లారు.. అన్న రీతిలోనే సీఎం పర్యటన ముగిసింది. అధికారం చేపట్టాక నిడదవోలు నియోజకవర్గానికి ఏం చేశారు.. రానున్న రోజుల్లో ఏం చేస్తామనే విషయాలను చెప్పకుండా.. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రతిపక్షాలు అడ్డుకోవడంపై విమర్శలకే చంద్రబాబు తన ప్రసంగాన్ని పరిమితం చేశారు. ఆయన ఊకదంపుడు ఉసన్యాసం భరించలేక సభకు వచ్చినవారు తమ కాళ్లకు పని చెప్పారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం మధ్యాహ్నం 12.35 గంటలకు నిడదవోలుకు వచ్చిన చంద్రబాబు.. సాయంత్రం వరకూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సభా వేదిక సమీపాన జనసేన నేతలు ఏర్పాటు చేసిన భోజనాల శిబిరం వద్దకు జనం చేరుకోగా.. సీఎం ప్రసంగం పూర్తి కాకుండా భోజనాలు ప్రారంభించేది లేదని అక్కడి నేతలు చెప్పారు. దీంతో, జనం మండుటెండలో ఇబ్బందులు పడుతూ నిరీక్షించాల్సి వచ్చింది.

ఎన్నికల హామీలే మళ్లీ..

సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో నిడదవోలు వచ్చిన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, కందుల దుర్గేష్‌లు అనేక హామీలు ఇచ్చారు. కూటమి అధికారం చేపట్టి రెండేళ్లయినప్పటికీ వాటిని అమలు చేయలేదు. సీఎం హోదాలో తొలిసారి నిడదవోలు పర్యటనకు వచ్చిన చంద్రబాబు.. వరాల జల్లు కురిపిస్తారని నియోజకవర్గ ప్రజలు ఆశగా ఎదురు చూశారు. నిధుల కేటాయింపు మాట దేవుడెరుగు.. గత హామీలనే చంద్రబాబు మళ్లీ ఈ సభలో కూడా ఇవ్వడం గమనార్హం. దీంతో, విస్తుపోవడం జనం వంతయింది. పట్టణంలోని తీరు గూడెంలో ఉన్న టిడ్కో ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని, 100 పడకలకు ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి, మండలంలో కంసాలిపాలెం – మాధవరం వంతెన, చినకాశిరేవు వంతెన, పట్టణంలో ఇండోర్‌ స్టేడియం నిర్మాణం, ఆర్టీసీ బస్టాండ్‌ అభివృద్ధి, ఎర్రకాలువ గండ్ల పూడ్చివేత, నిడదవోలు – యర్నగూడెం రహదారి మరమ్మతులు, ఉండ్రాజవరం మండలం వడ్లూరు కాలువపై వంతెన నిర్మాణం.. ఇలా గతంలో ఇచ్చిన హామీలనే మరోసారి సీఎం వల్లె వేశారు. కీలకమైన హామీల అమలుకు సంబంధించి నిధుల కేటాయింపుపై ఆయన పెదవి విప్పలేదు. చంద్రబాబు హామీలను నమ్మలేమని, వచ్చారు.. ఏదో చెప్పి వెళ్లారు.. అంటూ ప్రజలు బహిరంగంగానే పెదవి విరవడం గమనార్హం.

చంద్రబాబు మాట్లాడుతూండగానే

సభా ప్రాంగణం నుంచి వెళ్లిపోతున్న ప్రజలు

చంద్రబాబు ప్రసంగ సమయంలో

ఖాళీగా ఉన్న ప్రజావేదిక

Advertisement
 
Advertisement
Advertisement