● బాలవరంలో మహిళల ఆందోళన
● ఆరు నెలలుగా ఇక్కట్లు
పడుతున్నామని ఆవేదన
● ట్యాంక్ వాచర్‌ను
తొలగించాలని డిమాండ్
రంగంపేట: తాగడానికి గుక్కెడు నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రంగంపేట మండలం జి.దొంతమూరు శివారు బాలవరంలో పలువురు మహిళలు, గ్రామస్తులు శనివారం రాత్రి ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి, తమ సమస్య తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. తమ కాలనీకి ఆరు నెలలుగా తాగునీరు రావడం లేదని, పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. స్థానిక రక్షిత మంచినీటి పథకం నుంచి సరఫరా అవుతున్న నీరు కలుషితమవుతోందన్నారు. ఈ నీరు సరఫరా అవుతున్న పైపులైను పక్కనే మురుగు కాలువ ఉందని, అక్కడ పైప్‌లైన్ వాల్వ్ పాడైపోవడంతో తాగునీటిలో మురుగునీరు కలిసిపోతోందని చెప్పారు. పైపులైనుకు మరమ్మతులు చేపట్టి తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీ సిబ్బందికి చెప్పినా ఫలితం లేదని ధ్వజమెత్తారు. ఈ విషయమై పంచాయతీ ట్యాంక్ వాచర్‌ను అడగగా.. ‘నీరు అలాగే వస్తుంది. మీ దిక్కున్నచోట చెప్పుకోండి’ అని అతడు నిర్లక్ష్యంగా జవాబు చెప్పడమే కాకుండా స్ధానికులను, మహిళలను బూతులు తిడుతున్నాడని మండిపడ్డారు. అతడిని తక్షణమే పంచాయతీ ట్యాంక్ వాచర్‌ను విధుల నుంచి తొలగించాలని గ్రామస్తులు, మహిళలు డిమాండ్ చేశారు. అప్పటి వరకూ ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు. బాలవరం గ్రామస్తుల ఆందోళనకు వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సంఘీభావం తెలిపారు. గ్రామస్తుల ఆందోళన విషయం తెలిసిన వెంటనే ఆయన బాలవరం చేరుకుని, గ్రామస్తులను విషయం అడిగి తెలుసుకున్నారు.
ఎమ్మెల్యే వివక్ష
ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, బాలవరం గ్రామంపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. పంచాయతీలో రూ.1.30 కోట్ల వరకూ నిధులున్నాయని, గ్రామ సర్పంచ్ వైఎస్సార్ సీపీకి చెందిన వారని, దీంతో, అభివృద్ధి పనులు చేయనీయకుండా ఆయనను ఎమ్మెల్యే అడ్డుకుంటున్నారని అన్నారు. రూ.25 వేల పంచాయతీ నిధులు ఖర్చు చేస్తే బాలవరంలో ఈ సమస్య వచ్చేది కాదని చెప్పారు. కలుషిత నీరు తాగడంతో గ్రామస్తులకు వాంతులవుతున్నాయని, శ్రీకాకుళంలో మాదిరిగా ఇక్కడ కూడా కలుషిత నీటితో ప్రజలు మరణిస్తే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత బాలవరంలో ఏ పనులూ చేయడం లేదని, గ్రామంలోని ఎస్సీలందరూ వైఎస్సార్ సీపీ మద్దతుదారులనే దుగ్ధతోనే ఎమ్మెల్యే వివక్ష చూపుతున్నారని డాక్టర్ సూర్యనారాయణరెడ్డి విమర్శించారు.


