కడియం: రాష్ట్రంలో ఇంకా 20 శాతం మంది ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎరియర్లు అందలేదని, వాటిని వారికి వెంటనే చెల్లించాలని ఎమ్మెల్సీ గోపిమూర్తి డిమాండ్ చేశారు. మండలంలోని పలు పాఠశాలలను ఆయన శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు తమకు 2018 నాటి డీఏ ఎరియర్లు రాలేదని, మండలంలో దాదాపు 120 మందికి రూ.1.30 కోట్ల మేర నిలిచిపోయాయని చెప్పారు. ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ఉందని ఆయనన్నారు. ఆయా ఉపాధ్యాయుల ఖాతాల్లో బకాయిలు జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం.. నెలలు గడుస్తున్నా ఈ సమస్యను పరిష్కరించకపోవడం దారుణమని అన్నారు. ఈ విషయాన్ని మరోసారి అధికారుల దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గించాలని, పదో తరగతి వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా సెలవు దినాలు, ఆదివారాల్లో పని చేసిన ఉపాధ్యాయులకు సీసీఎల్స్ మంజూరు చేయాలని, 12వ పీఆర్‌సీ కమిషన్ వేసి, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని గోపిమూర్తి డిమాండ్ చేశారు. ఆయన వెంట యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈవీవీఎస్‌ఆర్ ప్రసాద్, కె.రమేష్‌బాబు తదితరులున్నారు.
రత్నగిరిపై భక్తుల రద్దీ
అన్నవరం: వేలాదిగా వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిటకిటలాడింది. సత్యదేవుని సన్నిధికి రాష్ట్రం నలుమూలల నుంచీ భక్తులు తరలి రావడంతో ఉదయం నుంచి రాత్రి వరకూ కూడా రద్దీ కొనసాగింది. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సత్యదేవుని వ్రతాలు 1,500 జరిగాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. సర్కులర్ మండపం వద్ద సుమారు 5 వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోదనం పంపిణీ చేశారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగనుంది. సుమారు 40 వేల మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తొలి తిరుపతి కిటకిట
సామర్లకోట: తొలి తిరుపతిగా ప్రసిద్ధికెక్కిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో వెలసిన శ్రీదేవి, భూదేవి సమేత శృంగార వల్లభ స్వామి ఆలయం ఽశనివారం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. సుమారు 15 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.1,63,500, అన్నదాన విరాళాలు రూ.65,516, కేశఖండన ద్వారా రూ.5,520, లడ్డూ ప్రసాదం విక్రయాల ద్వారా రూ.20,235, ఇతరత్రా కలిపి రూ.2,54,871 ఆదాయం వచ్చిందని వివరించారు. సుమారు 2,500 మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారన్నారు. ఆలయం వద్ద వాహనాల పార్కింగ్‌కు పంచాయతీ ఆశీలు వసూలు చేయడం సర్వత్రా విమర్శలకు దారి తీసింది.


