వాడపల్లికి పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

వాడపల్లికి పోటెత్తిన భక్తులు

Apr 19 2026 7:41 AM | Updated on Apr 19 2026 7:41 AM

ఆత్రేయపురం: వాడపల్లి వెంకటేశ్వరుని దర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు కాలినడకన సైతం స్వామివారి దర్శనానికి వచ్చారు. ఏడు శనివారాల వ్రతంలో భాగంగా వచ్చిన భక్తులతో ఆలయం కిక్కిరిసిపోయింది. భారీ సంఖ్యలో వాహనాల రాకతో ట్రాఫిక్‌ అంతరాయాలు ఏర్పాడ్డాయి. సుప్రభాత సేవ, తొలి హారతి, నిరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాల భోగం వంటి కార్యక్రమాలను భక్తులు తిలకించారు. విశేషాలంకరణలో ఉన్న స్వామివారితో పాటు, ఆవరణలో క్షేత్రపాలకులు, అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి వారిని భక్తులు దర్శించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి ఉచిత అన్న ప్రసాదం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వేసవి తీవ్రత దృష్ట్యా చలివేంద్రాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్‌ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ చైర్మన్‌ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు, ఆలయ సిబ్బంది సేవా కార్యక్రమాలలో సహకరించారు.

ఐదు ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సులపై కేసులు

రావులపాలెం: నిబంధనలు పాటించని ఐదు ప్రైవేటు ట్రావెల్‌ బస్సులపై కేసు నమోదు చేసి రూ.13,400 అపరాధ రుసుము విధించినట్టు జిల్లా రవాణా అధికారి డి.శ్రీనివాసరావు శనివారం తెలిపారు. మండలంలోని ఈతకోట టోల్‌ ప్లాజా వద్ద రవాణాశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీటీఓ హెచ్చరించారు. ప్రతీ బస్సులోను అగ్ని ప్రమాద రక్షణ పరికరాలు, అలాగే అత్యవసర ద్వారం తదితర నిబంధనలు కచ్చితంగా ఉండాలన్నారు. అలా లేని బస్సుల ఫిట్‌నెస్‌ రద్దు చేస్తామన్నారు. అలాగే డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడితే డ్రైవర్లకు జైలు శిక్ష తప్పదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement