వేతన యాతన ఎన్నాళ్లు? | - | Sakshi
Sakshi News home page

వేతన యాతన ఎన్నాళ్లు?

Apr 19 2026 7:41 AM | Updated on Apr 19 2026 7:41 AM

రత్నగిరిపై పారిశుధ్య సిబ్బంది అవస్థలు

మంత్రి ఆనం, కలెక్టర్‌, ఆశాఖ కమిషనర్‌

ఆదేశాలు సైతం బేఖాతరు

అన్నవరం: రత్నగిరిపై పారిశుధ్య కార్మికుల వేతన వెతలు ఇంకా కొలిక్కి రాలేదు. పద్మావతి సంస్థ కాంట్రాక్టు నిర్వహణ పనిచేస్తున్న 413 మందికి ఫిబ్రవరి, మార్చి నెలల వేతనాలు నేటికీ పడకపోవడం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఈ సమస్యపై ఈ నెల 11వ తేదీన ‘సత్యదేవా సాపాట్లు కనవా’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఆ తరువాతి రోజు దేవస్థానానికి వచ్చిన దేవదాయ, ధర్మదాయ శాఖమంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆ కథనంపై స్పందిస్తూ సత్వరం వారి వేతనాలు ఇవ్వాలని ఆదేశించారు. అలాగే కలెక్టర్‌ సైతం స్పందించి సిబ్బంది వేతనాల విషయమై ఆరా తీశారు. ఇది జరిగి ఐదు రోజులైనా ఆలయ అధికారులలో స్పందన లేదు. ఈ పరిస్థితుల్లో ఆ సిబ్బంది కుటుంబాల సాగుబడికి నానా అవస్థలు పడుతున్నారు. శానిటరీ సంస్థ ఖర్చులన్నీ పోను సిబ్బందికి చెల్లించాల్సినది నెలకు రూ.50 లక్షలు. రెండు నెలలకు కలిపి రూ.కోటి చెల్లించాల్సి ఉంటుంది. ఈ వేతన బకాయిలు సత్వరం చెల్లించాలని మంత్రి సమక్షంలోనే దేవదాయ శాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ స్వయంగా ఆదేశించినా అధికారులలో చలనం లేకపోవడం గమనార్హం.

సిబ్బంది సంఖ్యపై సందిగ్ధం

అసలు పద్మావతి సంస్థ కింద దేవస్థానంలో 413 మంది పనిచేస్తున్నారా? ఎక్కడ ఎంతమంది పనిచేస్తున్నారన్న వివరాలు సరిగా లేవన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ విషయమై ఆడిట్‌ అధికారులను ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. కాగా దేవస్థానంలో కేవలం 350 మంది మాత్రమే పని చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపైనా అధికారులు ఆరా తీయాల్సి ఉంది.

సీఎంకు సన్నిహితుడని చర్యలకు వెనుకంజ

దేవస్థానంలో శానిటరీ పనులు దక్కించుకున్న పద్మావతి సంస్థ అధిపత భాస్కరనాయుడు సీఎం చంద్రబాబుకు సన్నిహితుడన్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే కొండపై పారిశుధ్య నిర్వహణ బాగోకపోయినా, సకాలంలో వేతనాలు చెల్లించకపోయినా ఎవరూ ఆయనను ప్రశ్నించలేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement