భారీ మొత్తంలో బంగారం, వెండి ఆభరణాల స్వాధీనం
కాకినాడ క్రైం: ఇళ్ల తాళాలు పగలగొట్టి సొత్తు దోచుకుంటున్న ముగ్గురిని, నకిలీ తాళాలతో బైక్ చోరీలు చేసే ఇద్దరిని జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బిందు మాధవ్ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కాకినాడ ఏటిమొగకు చెందిన 32 ఏళ్ల రేకాడి వెంకటేశ్వర్లు నగరంతో పాటు శ్రీకాకుళంలో 30కి పైగా దొంగతనాలు చేశాడు. ఇతడి నుంచి 117 గ్రాముల బంగారు, 629 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.1.95 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అతడిని కోరంగి ఎస్సై సత్యనారాయణ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. అలాగే అతడికి సహకరించిన ఇద్దరు మైనర్లను వన్ టౌన్, టూ టౌన్ పోలీసులు అరెస్టు చేసినట్టు ఎస్పీ తెలిపారు. స్థానిక జె.రామారావు పేటకు చెందిన వనమాడి జానకిరామ్, మాడుగుల మండలం సత్యవరం గ్రామానికి చెందిన రేఖా సతీష్‌లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. ఈ చోరీలో మరో నేరస్తుడు కాకినాడ గాటి సెంటర్‌కు చెందిన తోట శివశంకర్ పరారీలో ఉన్నాడన్నారు. సామర్లకోట–కాకినాడ రహదారిలో సామర్లకోట సీఐ కృష్ణభగవాన్ బృందం ముద్దాయిలను పట్టుకుందని తెలిపారు. వీరి నుంచి రూ.5 లక్షల విలువైన ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఐదుగురిని అరెస్టు చేయడం ద్వారా కాకినాడ జిల్లాలో కాకినాడ వన్ టౌన్, టూ టౌన్, రూరల్‌లో కోరింగ, సామర్లకోట పరిధిలో జరిగిన 10 కేసులను ఛేదించి, సుమారు రూ.26 లక్షల విలువైన ఆభరణాలు, వస్తువులు రికవరీ చేసినట్టు ఎస్పీ తెలిపారు.
అన్నవరం ట్రస్ట్ బోర్డుకు నలుగురు ప్రత్యేక ఆహ్వానితులు
అన్నవరం: రత్నగిరి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశాలకు నలుగురు ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ దేవదాయ, ధర్మదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ ఎం.హరి జవహర్‌లాల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. వేముల పల్లి కాంతారావు (కత్తిపూడి), గంగి గోవిందరాజు (పిఠాపురం), ఇమ్మిడిశెట్టి వేంకట రమణ (కాకినాడ), బి.సురేంద్రనాథ్‌రెడ్డి ( ఉదయగిరి–నెల్లూరు) లను ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించారు. వీరితో బాటు ఆలయ ప్రధానార్చకుడిని కో–ఆప్షన్ సభ్యునిగా నియమిస్తారు.


