తాళ్లరేవు: టాయిలెట్‌కు వెళతానన్నందుకు నాలుగేళ్ల బాలుడిని అంగన్‌వాడీ ఆయా తీవ్రంగా గాయపరచింది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని జి.వేమవరం గ్రామానికి చెందిన నాలుగేళ్ల దాసరి జస్విత్ గగన్ స్వరూప్ స్థానిక 30వ నెంబరు అంగన్‌వాడీ కేంద్రంలో ప్రీస్కూల్‌లో చదువుతున్నాడు. టాయిలెట్‌కు వెళతానని అంగన్‌వాడీ ఆయా రాయుడు వెంకటలక్ష్మిని అడిగాడు. ఆమె వద్దన్నా వినకుండా వెళ్తున్న చిన్నారిని చేతిలో ఉన్న పలకతో తలపై గట్టిగా కొట్టింది. దీంతో బాలునికి తీవ్రగాయమై రక్తస్రావమైంది. హుటాహటిన ఆస్పత్రికి తీసుకువెళ్లగా కుట్లువేశారు. ఆయాపై చర్యలు తీసుకోవాలని బాలుడి తండ్రి వెంకటరమణ ఈ మేరకు ఐసీడీఎస్ సీడీపీఓ శ్రీదేవికి ఫిర్యాదు చేశారు. అలాగే ఆయాపై చర్యలకు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సీడీపీఓ శ్రీదేవి విలేకర్లకు తెలిపారు. ఇలా ఉండగా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యుడు మందాల గంగ సూర్యనారాయణ ప్రాంతంలోనే బాలునిపై దాడి జరగడం గమనార్హం.
పలకతో కొట్టడంతో తలకు తీవ్ర గాయం
సీడీపీఓకు ఫిర్యాదు చేసిన బాలుడి తండ్రి


