మంత్రి సుభాష్‌ మాట నీటిమూట | - | Sakshi
Sakshi News home page

మంత్రి సుభాష్‌ మాట నీటిమూట

Apr 18 2026 8:23 AM | Updated on Apr 18 2026 8:23 AM

కపిలేశ్వరపురం: స్వాతంత్య్రానికి ముందు వలసపాలనలో బ్రిటిష్‌ పాలకులు దోపిడీదారులే అయినప్పటికీ భారత చేనేత నైపుణ్యాన్ని ప్రశంసించారు. కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం చేనేత వృత్తిని, కార్మికులను విస్మరిస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను అటకెక్కించడమే కాక కనీస చేయూతను సైతం చేనేతకు ఇవ్వని పరిస్థితి. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కంటే రూ.వెయ్యి ఎక్కువ వేసి ఏడాదికి రూ.25 వేలు సాయమందిస్తానంటూ సార్వత్రిక ఎన్నికల సమయంలో చేనేత కార్మికులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. 22 నెలల ఆయన పాలనాకాలంలో ఆ హామీ గాలికి కొట్టుకుపోయింది. అదే ఒరవడిని అందిపుచ్చుకున్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌. చేనేతకు ప్రసిద్ధి చెందిన అంగర గ్రామంలోని శ్రీగణపతి చేనేత పారిశ్రామికుల సంఘానికి రావాల్సిన ఆప్కో, ప్రభుత్వ బకాయిలను 2025 అక్టోబర్‌ నెలాఖరులోగా జమ చేయిస్తానంటూ మంత్రి సుభాష్‌ హామీ ఇచ్చారు. ఆరు నెలలు గడిచినా ఆ హామీ అమలు కాలేదు.

మంత్రి సుభాష్‌ హామీ నేపథ్యమిదీ...

2025 సెప్టెంబర్‌ 28న మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం అంగరలోని శ్రీగణపతి చేనేత పారిశ్రామికుల సహకార సంఘం కార్మికులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. తమ సంఘానికి రావాల్సిన ఆప్కో, ప్రభుత్వ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. దీక్షలు ప్రారంభించిన నాటికి అంగర చేనేత సంఘానికి రావాల్సిన వివిధ రకాల బకాయిలు రూ.3.85 కోట్లు ఉన్నాయి. వాటిని చెల్లించాలంటూ 2025 సెప్టెంబర్‌ 27న అంగర గ్రామంలో భారీ నిరసన ర్యాలీ చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో 28 నుంచి సహకార సంఘం ఎదుట నిరసన దీక్షలు ప్రారంభించారు. 14 రోజులపాటు సాగిన దీక్షలకు ఉమ్మడి జిల్లాలోని చేనేత కార్మికుల నుంచి స్పందన లభించింది. వైఎస్సార్‌ సీపీ నాయకులు, సీఐటీయూ తదితర ప్రజా సంఘాల నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. దీక్ష చేస్తున్న విషయం తెలుసుకున్న ఇతర జిల్లాల చేనేత సహకార సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఎదురవుతుందన్న విషయాన్ని అధికార పార్టీ నేతలు గుర్తించారు. జిల్లాకు చెందిన కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అక్టోబర్‌ 11న స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి సహకార సంఘం వద్దకు వచ్చి చర్చలు జరిపారు. అక్టోబర్‌ నెలాఖరు నాటికి బకాయిలు చెల్లించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలా హామీ ఇచ్చి నేటికి ఆరు నెలలు పూర్తయినా అమలు కాలేదు.

వైఎస్‌ జగన్‌ పాలనను

గుర్తు చేసుకుంటున్న నేతన్నలు

గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో నేతన్న నేస్తం పేరుతో ఆదుకున్న రోజులను చేనేత కార్మికులు గుర్తు చేసుకుంటున్నారు. జిల్లాలో 916 చేనేత కుటుంబాలకు నేతన్న నేస్తం పేరుతో ఏడాదికి రూ.24వేలు ఆర్థిక సాయాన్ని క్రమం తప్పకుండా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించింది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు.

బకాయిలు జమ చేయిస్తానంటూ

నేతన్నలకు హామీ

ఆరు నెలలుగా అమలు కాని వైనం

కాకినాడలో రిలే దీక్షలు చేస్తున్న నేతన్నలు

పట్టించుకోని కూటమి నాయకులు

శిబిరం వైపు కన్నెత్తి చూడని కూటమి నాయకులు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు విసిగి పోయి కాకినాడ కేంద్రంగా ఈ నెల 13 నుంచి ఆత్మగౌరవ దీక్షల పేరుతో రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. తొలిరోజు అంగర చేనేత సహకార సంఘం సభ్యులు దీక్షలో కూర్చున్నారు. ఐదు రోజులుగా సాగుతున్న దీక్షలు అధికార పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. అలాగని మరోసారి హామీ ఇస్తే నమ్మే పరిస్థితిలో చేనేత కార్మికులు లేరు. అంగరలో స్వయంగా మంత్రి సుభాష్‌ ఇచ్చిన హామీ గాలికి కొట్టుకుపోయింది. చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరిలో ఈ ఏడాది ఫిబ్రవరి 22న 16 భాగస్వామ్య సంఘాలతో కలిసి చేనేత గర్జన పేరుతో భారీ నిరసన ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. ఆ సందర్భంగా సంఘాల నాయకులు చేసిన డిమాండ్లను ప్రభుత్వం ఖాతరు చేయలేదు. ఇలాంటి అనుభవాల నేపథ్యంలో తమ సంఘాలకు రావాల్సిన బకాయిలను జమ చేయడం తప్ప మరే మాటా వినేది లేదని నాయకులు స్పష్టం చేస్తున్నారు. దీంతో నిరసనను నిలిపివేయాలని కార్మికులపై అధికార పార్టీ నేతలు ఒత్తిడులు తెస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వానికి బకాయిలు చెల్లించే ఉద్దేశం ఉన్నట్టు కనిపించడం లేదు. కాకినాడలోని దీక్షా శిబిరం వైపు కీలక కూటమి నాయకులు కానీ, మంత్రులు కానీ కన్నెత్తి చూడకపోవడమే ఇందుకు నిదర్శనమని చేనేత కార్మికులు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement