రాజమహేంద్రవరం సిటీ: మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావడం దేశంలో చరిత్రాత్మకమని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం వైఎస్సార్ సీపీ సిటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ముందుకు 2023లోనే వచ్చిందన్నారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు తీసుకురావడాన్ని వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి గతంలోనే స్వాగతించారన్నారు. ఆయన 33 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు అందించడమే కాకుండా ఇళ్లు కట్టించే ప్రయత్నం చేశారన్నారు. వైఎస్సార్ చేయూత ద్వారా 45 ఏళ్లు దాటిన మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున ఖాతాల్లో వేశారని చెప్పారు. ఈ పథకం ద్వారా 50 లక్షల మంది లబ్ధి పొందారన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ, సున్నా వడ్డీ రుణాలు, అమ్మఒడి ద్వారా రూ.వేల కోట్లు మహిళల ఖాతాలకు జమ చేశారన్నారు. వివిధ పదవుల్లో 50 శాతం అవకాశాలు కల్పించారని చెప్పారు.
చంద్రబాబు మహిళలకు చేసిందేమీ లేదు
చంద్రబాబు ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడుస్తున్నా మహిళలకు చేసిందేమీ లేదని చెప్పారు. తల్లికి వందనం పేరు చెప్పి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కోతపెట్టి వారి ఖాతాల్లో రూ.7 వేలు, రూ.9 వేలు మాత్రమే వేశారని విమర్శించారు. ఈ పథకాన్ని ఒక ఏడాది పూర్తిగా ఎత్తేశారన్నారు. టిడ్కో ఇళ్లను రెండేళ్లవుతున్నా పూర్తి చేయలేదన్నారు. జగనన్న కాలనీలలో ఇళ్లను పూర్తిచేయకుండా గాలికొదిలేశారని చెప్పారు. తమ ప్రభుత్వంలో వేలాది మంది మహిళలకు ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశామన్నారు. తమ ప్రభుత్వం వస్తే 3 సెంట్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు.. రెండేళ్లు గడుస్తున్నా పట్టించుకోవడం లేదన్నారు. రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ అభివృద్ధికి భారత్ అమృత్ పథకంలో నిధులు మంజూరు చేయించామని, దీని అభివృద్ధిని బాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
ఫ్లై ఓవర్‌లను పట్టించుకోలేదు
బొమ్మూరు, దివాన్ చెరువు సహా నాలుగు ఫ్లైఓవర్ బ్రిడ్జిలతో పాటు ఔటర్ రింగ్ రోడ్డును కూడా మంజూరు చేయించామని, వాటిని బాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. మోరంపూడి ఫ్లైఓవర్ వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఫ్లెక్సీలు పెట్టుకోవడం తప్ప సర్వీసు రోడ్డు వేయించలేకపోయారన్నారు. ఇసుక, మద్యం, కబ్జాలతో దోచుకోవడం తప్ప అభివృద్ధిపై దృష్టి లేదన్నారు. రాష్ట్ర కార్యదర్శి వాశంశెట్టి గంగాధరరావు, జిల్లా ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ వెంకటరావు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ భరత్‌రామ్


