రాజమహేంద్రవరం రూరల్: చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చేసిన చట్టానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంగాడ సత్యప్రియ అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం అడుగులు వేయడం అభినందనీయమన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో 50 శాతం మహిళా రిజర్వేషన్లను స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు చేసిన ఘనత గత ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. తన క్యాబినెట్‌లో ఒక ఉపముఖ్యమంత్రి పదవితో పాటు నలుగురు మహిళలకు స్థానం కల్పించారన్నారు. హోం, వైద్యం, మహిళాశిశు సంక్షేమం వంటి కీలకశాఖలను మహిళలకు అప్పగించారన్నారు.
గుండెపోటుతో ఖైదీ మృతి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న రాజస్థాన్‌కు చెందిన అవాసింగ్ (42) శుక్రవారం మృతి చెందాడు. అతను గంజాయి కేసులో మార్చి 5న సెంట్రల్ జైలుకు వచ్చాడు. 10 రోజులుగా గుండెల్లో నొప్పి వస్తుండడంతో జైలు అధికారులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి స్వతంత్ర ఆసుపత్రికి తరలించి చికిత్సలందించారు. అయితే వైద్యులు అతనిని వైజాగ్ తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. దీంతో జైలు అధికారులు అవాసింగ్‌ను వైజాగ్ తీసుకెళ్లేందుకు అనుమతి కోరారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతి రాకపోవడంతో జైలు ఆసుపత్రిలోనే ఉంచి చికిత్సలందిస్తున్నారు. హఠాత్తుగా అవాసింగ్ పరిస్థితి విషమించడంతో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. జైలు అధికారులు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వేసవికి ప్రత్యేక రైళ్లు
రాజమహేంద్రవరం సిటీ: జిల్లా మీదుగా వేసవి సెలవుల్లో రైళ్లనునడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ అధికారులు ప్రకటించారు. ఎస్‌ఎంవీటీ బెంగళూరు–బలురఘట్(06551) సమ్మర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 17, 24 తేదీల్లో బలురఘట్– ఎస్‌ఎంవీటీ బెంగళూరు(06552) స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 20, 27వ తేదీల్లో రాకపోకలు సాగించనుంది. చర్లపల్లి – సంత్రగచ్చి (07675), సంత్రగచ్చి– చర్లపల్లి (07676)సమ్మర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 18,19 తేదీలలో నడవనుంది. చర్లపల్లి–ఖరగ్‌పూర్(07673), ఖరగ్‌పూర్ – చర్లపల్లి (07674) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 23, 24 తేదీలలో నడుస్తాయి. సంత్రగచ్చి– చైన్నె బీచ్ (06074) వీక్లీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఈ నెల 19 తేదీన సంత్రగచ్చిలో బయల్దేరనుంది. సహర్స జంక్షన్ – యశ్వంత్‌పూర్ జంక్షన్ (05551) యశ్వంత్‌పూర్ జంక్షన్– సహర్స జంక్షన్ (05552) రైళ్లు ఈ నెల 19, 26, మే 3వ తేదీల్లో రాకపోకలు సాగించనున్నాయి. అలిపుర్ దౌర్ – హుబ్బళ్లి (07324) స్పెషల్ ఎక్స్ ప్రెస్ ఈ నెల 19వ తేదీన నడవనుంది. చర్లపల్లి –సంత్రగచ్చి (07677) ఈ నెల 21వ తేదీన జిల్లా మీదుగా నడవనుంది. సంత్రగచ్చి– హైదరాబాద్(07678) రైలు ఈ నెల 22వ తేదీన నడవనుంది. కాకినాడ టౌన్ –హిషార్ (07717) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 21న నడవనున్నదని తెలిపారు.


