విద్యుత్‌ స్తంభం పైనుంచి పడి ఎలక్ట్రీషియన్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ స్తంభం పైనుంచి పడి ఎలక్ట్రీషియన్‌ మృతి

Apr 18 2026 8:05 AM | Updated on Apr 18 2026 8:05 AM

అయినవిల్లి: మండలంలోని వీరవల్లిపాలేనికి చెందిన ఓ వ్యక్తి విద్యుత్‌ బల్బులు మారుస్తుండగా 11 కేవీ విద్యుత్‌ తీగలు తగిలి పైనుంచి పడి మృతి చెందాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ హరిబాబు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు మండలం వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్‌ ఉండ్రాజవరపు శ్రీను (54) శుక్రవారం పంచాయతీ విద్యుత్‌ స్తంభం ఎక్కి వీధి దీపాలు మారుస్తున్నాడు. ఈ క్రమంలో 11 కేవీ విద్యుత్‌ తీగ తగిలి షాక్‌కు గురై కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీనుకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అతని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు హెచ్‌సీ తెలిపారు. పంచాయతీ సిబ్బంది, విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం వల్లే తన భర్త మృతి చెందాడని ఆమెతో పాటు, బంధువులు సీఐటీయూ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ వద్ద ఆందోళన చేశారు. బాధిత కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఇంటిని తడుపుతూ షాక్‌కు గురై..

సామర్లకోట: స్థానిక కోట బజార్‌ ప్రాంతానికి చెందిన మోర్త శ్రీను (40) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. శుక్రవారం ఉదయం జి.రాగంపేట రోడ్డులోని ఈటీసీ లే అవుట్‌లో పేద ప్రజలకు ఇచ్చిన స్థలంలో నిర్మిస్తున్న ఇంటిని తడుపుతుండగా విద్యుత్‌ షాక్‌కు గురై పడిపోయాడు. స్థానికులు సమీపంలోని సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతికి కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో

సల్ఫర్‌ లారీ దగ్ధం

రూ.52 లక్షల ఆస్తి నష్టం

ఏలేశ్వరం: మండలంలోని యర్రవరం సమీపంలోని జాతీయరహదారిపై శుక్రవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సల్ఫర్‌లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం కాగా సుమారు రూ.52 లక్షల విలువైన ఆస్తి నష్టం సంభవించింది. వివరాల్లోకి వెళితే విశాఖ నుంచి మహారాష్ట్రకు 30 టన్నుల సల్ఫర్‌ లోడుతో వెళ్తున్న లారీని రాజమహేంద్రవరం నుంచి కత్తిపూడి వైపు వెళుతున్న వేన్‌ అదుపు తప్పి డివైడర్‌ దాటి మరీ వచ్చి ఢీకొట్టింది. దీంతో సల్ఫర్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి లారీ పూర్తిగా దగ్ధమైంది. ప్రత్తిపాడు, జగ్గంపేట అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన లారీ డ్రైవర్లు లాల్‌రామ్‌, రూప్‌సింగ్‌, శంఖవరం మండలం కత్తిపూడికి చెందిన వేన్‌ డ్రైవర్‌ కుర్రే సురేష్‌, సహయకుడు కొయ్య గోవిందు తృటిలో తప్పించుకోగా స్వల్ప గాయాలయ్యాయి. తెలవారుజాము కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

చోరీ కేసులో

ముగ్గురికి జైలు, జరిమానా

కాకినాడ లీగల్‌: ఎవరూ లేని సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి కత్తులతో మహిళను బెదిరించి, ఆమె నుంచి నాలుగు బంగారు గాజులతో పాటు రూ.15 లక్షల చోరీ చేసిన కేసులో ముగ్గురికి జైలు, జరిమానా విధిస్తూ కాకినాడ మూడో అదనపు జిల్లా జడ్జి జి.ఆనంది శుక్రవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం కాకినాడ రమణయ్యపేటలో నివసిసున్న సత్తి కమల ఇంటిలో ఒంటరిగా ఉండడాన్ని గమనించి 2016 మార్చి 16న పెద్దాపురం మండలం, గోరింట గ్రామానికి చెందిన పిడుగు శ్రీనివాస్‌ తమ్మారావు, గంటా వీర్రాజు, కాకినాడ సూర్యనారాయణపురానికి చెందిన సయ్యద్‌ సుభాని ఇంట్లో ప్రవేశించి ఆమెను చంపేస్తామని భయపెట్టి గాజులతో పాటు రూ.15లక్షల నగదు చోరీ చేశారు. వారు ఈ పనిలో ఉండగా మరో ఇద్దరు బయట కాపలా ఉన్నారు. వారిలో ఒకరు సామర్లకోట పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న హోమ్‌ గార్డ్‌ దాసరి సతీష్‌కుమార్‌, మరొకరు కాకినాడ చెందిన మోస తోమా ఉన్నారు. బాధితురాలు కమల ఫిర్యాదు మేరకు నిందితులపై నేరం రుజువు కావడంతో శ్రీనివాస్‌ తమ్మారావు, వీర్రాజుకు ఒక్కొక్కరికి ఐదేళ్లు జైలు శిక్ష, రూ.5 వేలు చొప్పున జరిమానా, సుభానికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.2వేలు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. హోమ్‌గార్డ్‌ దాసరి సతీష్‌ కుమార్‌పై సరైన సాక్షాధారాలు లేకపోవడంతో అతనిపై కేసు కొట్టివేశారు. మోస తోమా మృతి చెందడంతో అతడి పేరును కేసు నుంచి తొలగించారు.

Advertisement
 
Advertisement
Advertisement