● భార్యకు తీవ్ర గాయాలు
● బైక్‌ను కారు ఢీకొని ఘటన
గోకవరం: రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితుల్లో ఆ భార్యాభర్తలు ఓ హోటల్‌లో పనిచేస్తూ పూట గడుపుకొనే వారిని విధి వెక్కిరించి విడదీసింది. పని ముగించుకుని బైక్‌పై ఇంటికి వెళ్తున్న క్రమంలో కారు రూపంలో మృత్యువు భర్తను తీసుకుపోగా భార్య తీవ్ర గాయాలపాలైంది. మండలంలోని పెంటపల్లికి చెందిన ములికి వెంకన్న (59), భార్య నాగమణి గోకవరంలో పోస్టాఫీసు సమీపంలోని ఓ హోట్‌లో పని చేస్తున్నారు. ఉదయమే వచ్చి రాత్రి పనులయ్యాక ఇంటికి వెళ్తుంటారు. ఈ క్రమంలో గురువారం అర్థరాత్రి బైక్‌పై తమ గ్రామానికి వెళ్తుండగా గోకవరం శివారు హాట్‌స్పాట్ హోటల్ వద్ద మలుపులో ఎదురుగా వస్తున్న కారు వీరి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భర్త వెంకన్న, భార్య నాగమణి లను రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వెంకన్న మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై నాగమణి, ఇతర సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రమాదానికి కారణమైన కారుని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విషాదంలో కుటుంబం
వెంకన్న, నాగమణి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె భువనేశ్వరికి వివాహమై ఒక పాప, రెండు నెలల మగ శిశువు ఉన్నారు. రెండో కుమార్తె పుణ్యవతి దివ్యాంగురాలు. ఆమె రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. తండ్రి మృతి, తల్లి ఆస్పత్రి పాలవడంతో కుమార్తెలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వారి రోదనలు స్థానికులను కలచివేశాయి.


