భక్తులు జారి పడేలా పుష్కర ఘాట్‌లో అమర్చిన నునుపైన టైల్స్
● ప్రమాదకర రీతిలో పుష్కర ఘాట్
ఆధునీకరణ పనులు
● జోథ్‌పూర్ నుంచి తెచ్చిన
నునుపు టైల్స్ అమరిక
● వాటిపై జారి పడుతున్న భక్తులు
● పుష్కరాల్లో ఎక్కువ మంది
ఇక్కడికే వచ్చే చాన్స్
● అదే జరిగితే అధిక సంఖ్యలో ప్రమాదానికి గురయ్యే అవకాశం
సాక్షి, రాజమహేంద్రవరం: పావన గోదావరి పుష్కరాల అభివృద్ధి పనుల తీరు.. పుణ్యానికి పోతే పాపం ఎదురైందన్నట్టుగా సాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చే రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ ఆధునీకరణ పనులు ఈ విమర్శలు నిజమేననిపించేలా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై ఏడో తేదీ వరకూ గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. ఆలోగా అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపించినా ప్రభుత్వం ఇంకా నిధులు విడుదల చేసిన దాఖలాల్లేవు. దీంతో, అధికారులు ఉన్న అరకొర నిధులతోనే పనులు చేస్తున్నారు. అవి కూడా సరైన ముందుచూపు లేకుండా చేపడుతూండటంతో ప్రమాదకరంగా మారుతున్నాయి. అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా రూ.94 కోట్ల పర్యాటక శాఖ నిధులతో నగరంలోని పుష్కర ఘాట్, గౌతమీ ఘాట్‌ల అభివృద్ధి, గోదావరి మాత విగ్రహావిష్కరణ, హేవలాక్ బ్రిడ్జి ఆధునీకరణ పనులు చేపడుతున్నారు. పనులు ప్రారంభించి ఏడాదవుతున్నా నత్తకు మేనత్తను తలపిస్తున్నాయి. రెండు రోజులు చేయడం.. నెల రోజుల పాటు ఆపేయడంతో ఎప్పటికి పూర్తవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది.
‘లుక్’ పేరుతో ముప్పు తెచ్చేలా..
ముఖ్యంగా పుష్కర ఘాట్ ఆధునీకరణ పనులు భక్తులు, యాత్రికులకు ప్రమాదకరంగా మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్కర ఘాట్‌లో ఇప్పటి వరకూ జారుడు స్వభావం లేని టైల్స్ ఉండేవి. బాగానే ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వ ప్రచారార్భాటం కోసం వాటిని పూర్తిగా తొలగించి, రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన టైల్స్ అమరుస్తున్నారు. వీటిని నాలుగు రోజులు అమర్చడం.. తిరిగి తొలగించడం.. మళ్లీ అమర్చడం.. ఫలితంగా పనులు నత్తనడకన సాగుతున్నాయి. మరోవైపు అక్కడక్కడ టైల్స్ అమర్చకుండా వదిలేశారు. ఘాట్ మొత్తం ఇదే తంతు సాగుతోంది. తద్వారా ఘాట్‌కు ప్రత్యేకమైన లుక్ వస్తుందని అధికారులు చెబుతున్నారు. వారి మాటలు బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు సమస్య తలెత్తుతోంది. కొత్తగా తెచ్చిన టైల్స్ చాలా నునుపుగా, అడుగు వేస్తే జారి పడేలా ఉన్నాయి. వీటిని కొన్నిచోట్ల అమర్చగా.. గోదావరిలో స్నానాలు ఆచరించి వస్తున్న భక్తులు వాటిపై నడుస్తూ జర్రున జారి పడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో జారి పడుతూ గాయాలపాలవుతున్నారు. పుష్కర ఘాట్‌లో స్నానాలకు ప్రతి రోజూ వివిధ ప్రాంతాల నుంచి వందలాదిగా భక్తులు వస్తూంటారు. పండగ సమయాల్లో రద్దీ మరింతగా ఉంటుంది. వీరిలో వృద్ధులు, చిన్నారులు సైతం ఉంటారు. ఘాట్‌లో స్నానం ఆచరించే చోట నునుపుగా ఉన్న టైల్స్ వేయడంతో వారు జారి పడుతున్నారు. పుష్కర ఘాట్ వద్ద నిత్యం నీరుంటుంది. సాధారణ రాళ్లే నాచు పట్టే అవకాశం ఉంది. అటువంటిది నునుపైన టైల్స్‌పై నాచు పడితే పరిస్థితి ఎలా ఉంటుందో ఇక చెప్పనవసరమే లేదు. గోదావరి పుష్కరాలకు సుమారు 7 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుందన్నది అధికారుల అంచనా. నగరంలో స్నానాలు చేసేందుకు మరిన్ని ఘాట్‌లు ఉన్నప్పటికీ.. ఎక్కువ శాతం మంది పుష్కర ఘాట్‌కే వస్తూంటారు. ఆ సమయంలో ఒక్కరు జారినా.. వారితో పాటే పదుల సంఖ్యలో భక్తులు జారి పడి పెద్ద ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. కొత్తవి అమరుస్తున్నామని చూపించుకునేందుకు భక్తులను ప్రమాదంలోకి నెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు, కాంట్రాక్టర్లు పట్టించకోకపోగా.. టైల్స్‌పై గాడి కొడతామంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఒకవేళ గాడి కొట్టినా జారకుండా ఉంటాయా అనే ప్రశ్న తలెత్తుతోంది.
కలెక్టర్ హెచ్చరించినా..
నునుపైన టైల్స్ కారణంగా భక్తులు జారి పడుతున్న విషయం ఇప్పటికే కలెక్టర్ దృష్టికి వెళ్లినట్లు సమాచారం. ఈ విషయాన్ని నిపుణులు సైతం పరిశీలించి, ఈ టైల్స్‌ను తొలగించాలని సూచించినట్లు సమాచారం. ఒకవేళ ఈ టైల్స్‌ను తొలగిస్తే ఇప్పటి వరకూ పెట్టిన ఖర్చు గోదాట్లో కలసినట్లే. దీంతో, ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఈ టైల్స్‌ను తొలగించేందుకు అంగీకరించడం లేదన్న ఆరోపణలున్నాయి. కంటితుడుపు చర్యగా టైల్స్ జారకుండా గాడి కొడతామని చెబుతున్నారు. మార్చి నెలాఖరులోగా ఈ పనులు పూర్తి చేయాల్సి ఉండగా.. నేటికీ అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. కూటమి నేతలకు లబ్ధి చేకూర్చేందుకు, వారు సిఫారసు చేసిన, అవగాహన లేని వారికి కాంట్రాక్ట్ అప్పగించినందువల్లనే ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయనే ఆరోపణలున్నాయి. పాత టైల్స్ బాగానే ఉన్నా.. బిల్లుల కోసం కక్కుర్తిపడి వాటిని పూర్తిగా తొలగించారని పలువురు విమర్శిస్తున్నారు.
గోదారిలో కలసిన ‘వ్యూ’
పుష్కర ఘాట్ వద్ద ఇప్పటి వరకూ హేవలాక్ బ్రిడ్జి (పాత రైల్వే వంతెన), ఆర్చిలతో ఉన్న మూడో రైల్వే వంతెన మధ్య నిల్చుని సందర్శకులు గోదావరి అందాలను తిలకించి, పులకించే వారు. అక్కడ ఉత్సాహంగా ఫొటోలు దిగేవారు. కూర్చుని కాసేపు సేద తీరేవారు. ఎన్నో ఫొటోషూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు, సీరియల్, సినిమా చిత్రీకరణలు ఇక్కడ జరిగేవి. ఇంతటి పర్యాటకాకర్షణ ఉనన ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులతో ఈ ‘వ్యూ’ కాస్తా గోదారిలో కలసిపోయింది. అసలే పుష్కర ఘాట్ విస్తీర్ణం తక్కువగా ఉంటుంది. ఇటువంటి చోట అనవసర కట్టడాలు చేపడుతూండటంతో ఘాట్ మరింత కుచించుకుపోతోంది. ఘాట్ ప్రవేశం వద్ద సైతం ఆర్చి నిర్మిస్తూండటంతో గోదావరి వ్యూ పూర్తిగా కనుమరుగైపోయింది. ఈ పనులతో రెండు వంతెనల మధ్య గోదావరి అందాలను చూసే వీలు లేకుండా పోయిందని భక్తులు, పర్యాటకులు ఆవేదన చెందుతున్నారు. కట్టడాలు లేని సమయంలో ప్రతి రోజూ వివిధ ప్రాంతాల నుంచి నాలుగైదు బస్సుల్లో వచ్చిన యాత్రికులు ఘాట్‌ను సందర్శించి, వ్యూ పాయింట్ వద్ద ఫొటోలు దిగేవారు. ప్రస్తుతం ఒక్క బస్సు కూడా వస్తున్న దాఖలాలు లేవు.


