నిడదవోలు: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్న సెక్యూరిటీ గార్డులు తమ విధులను పక్కన పెట్టి పెయింటర్ల అవతారం ఎత్తారు. ఈ నెల 18న సీఎం చంద్రబాబు నిడదవోలు పర్యటన సందర్భంగా ఆసుపత్రి ముందు భాగంలో రంగులు వేస్తున్నారు. యుద్ధప్రాతిపదికన పారిశుధ్య పనులు కూడా చేపట్టారు. ఇంతవరకూ బా గానే ఉంది. అయితే, ఉన్నత చదువులు చదివిన కొందరు సరైన ఉద్యోగాలు లేకపోవడంతో చాలీచాలని జీతాలకు ఔట్‌సోర్సింగ్ సెక్యూరిటీ గార్డు లుగా పని చేస్తున్నారు. దీనిని ఆసరాగా తీసుకు న్న వైద్యాధికారులు ఇద్దరు సెక్యూరిటీ గార్డులతో గురువారం పెయింటింగ్ పనులు చేయించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
‘నన్నయ’లో 20 వసంతాల వేడుకలు ప్రారంభం
రాజానగరం: ఆదికవి నన్నయ యూనివర్సిటీలో 20 వసంతాల వేడుకలు గురువారం ప్రారంభమయ్యాయి. ‘గోదావరి కలశాలు – సంప్రదాయ వరాలు, విభిన్నం – విలక్షణం – వంటకం’ అనే కార్యక్రమాలతో ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ ఈ వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. ప్రాంగణంలోని కొలనులో వర్సిటీలోని 20 విభాగాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులతో కలసి దీపాలు వెలిగించారు. పొంగల్ వండి సామూహికంగా ఆరగించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కేవీ స్వామి, కన్వీనర్లు పి.విజయనిర్మల, టి.హైమవతి పాల్గొన్నారు.
మార్గాని ఎస్టేట్స్‌లో రేపు జాబ్‌మేళా
రాజమహేంద్రవరం సిటీ: స్థానిక వీఎల్ పురం మార్గాని ఎస్టేట్స్‌లో శనివారం ఉదయం 9 గంటల నుంచి జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరుద్యోగ రహిత రాజమహేంద్రవరమే లక్ష్యంగా జనవరిలో సుమారు 75 కంపెనీలతో మంజీరా కన్వెన్షన్‌లో మెగా జాబ్‌మేళా నిర్వహించి, 500 మందికి పైగా ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఈ క్రమంలో ఇప్పుడు రెండో జాబ్ మేళా సుమారు 25 కంపెనీలతో వందలాది ఉద్యోగావకాశాలతో నిర్వహిస్తున్నామని చెప్పారు. జాబ్‌మేళా పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకుని పాల్గొనవచ్చని, లేదంటే నేరుగా వచ్చి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపారు.
పూడి శ్రీహరి అరెస్టు దారుణం
సాక్షి, రాజమహేంద్రవరం: వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా విభాగం) పూడి శ్రీహరి అక్రమ అరెస్టు దారుణమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు సివిల్ డ్రెస్‌లో వచ్చి ఆయనను అరెస్టు చేయడం దుర్మార్గమన్నారు. దీనినిబట్టి చూస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా అనే అనుమానం కలుగుతోందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎవరినైనా అరెస్టు చేసే ముందు నోటీసులు ఇవ్వాలని, న్యాయస్థానాలను సైతం ధిక్కరిస్తూ పోలీసులు అరెస్టు చేశారని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదని, ఈ వ్యవహారంలో చట్టం ప్రకారం ముందుకెళ్తామని చెప్పారు. ప్రజాస్వామ్య దేశంలో మాట్లాడే హక్కు లేదా అని ప్రశ్నించారు. అరెస్టు వారెంట్, ఏవిధమైన అనుమతీ లేకుండా నేరుగా ఇంటికి వెళ్లి ఎలా తనిఖీలు చేస్తారని ప్రశ్నించారు. ఇదంతా ప్రజా వ్యతిరేకతను డైవర్ట్ చేయడంలో భాగమేనని వేణు అన్నారు.


