రాజమహేంద్రవరం సిటీ: కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్‌లో దేశంలోనే అతి పెద్ద లూటీ జరుగుతోందని, రాష్ట్ర ప్రజల అవసరాల కోసం గ్యాస్, చమురులో 50 శాతం వాటా లక్ష్యంగా సమరశంఖం పూరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని డిమాండ్ చేశారు. అప్పటికీ కేంద్రం దిగి రాకుంటే ఎన్‌డీఏకి మద్దతు ఉపసంహరించుకుని, ప్రధాని నరేంద్ర మోదీ మెడలు వంచాలని అన్నారు. తాడితోట సెంటర్‌లో సంహిత కన్వెన్షన్ సెంటర్‌లో కేజీ బేసిన్ గ్యాస్, చమురు సాధన సమితి ఆధ్వర్యాన గురువారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. కేజీ బేసిన్‌లో గ్యాస్, చమురుపై వాటా కోసం రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహించి, ప్రజలను కార్యోన్ముఖులను చేయాలని అన్నారు. కేజీ బేసిన్‌లో గ్యాస్, చమురు నిల్వలను యథేచ్ఛగా తరలించుకు పోయి కార్పొరేట్ సంస్థలు లాభాలు గడిస్తున్నాయని చెప్పారు. సహజ వనరులపై రాష్ట్రాలకు 50 శాతం వాటా కల్పించాలంటూ 12వ ఆర్థిక సంఘం చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
బానిస పాలకులు నాటకాలు చేస్తున్నారు
ప్రత్యేక హెూదా, రాష్ట్ర విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో సహజ వనరుల లూటీ యథేచ్ఛగా జరుగుతూంటే బానిస పాలకులు నాటకాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. యుద్ధం నేపథ్యంలో మరోసారి ఈ చర్చ ముందుకు వచ్చిందని, ఇప్పటికై నా దానిని సాధించుకోవాలని అన్నారు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ తరపున కాకినాడలో త్వరలో సదస్సు నిర్వహిస్తామని, బుక్‌లెట్ కూడా విడుదల చేస్తామని చెప్పారు. కేజీ బేసిన్ గ్యాస్, చమురులో సగం వాటా రాష్ట్ర ప్రజల అవసరాలకు కేటాయించాలని, పీఎన్‌జీ గ్యాస్ ఇంటింటికీ సరఫరా చేయాలని, సహజ వనరుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే చేపట్టాలని కోరుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సదస్సు ఏకగ్రీవంగా ఆమోదించింది. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి టి.అరుణ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు టి.మధు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పి.ప్రసాద్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగత బంగార్రాజు, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు చీకట్ల వెంకటేశ్వరరావు, ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.సుందర రామరాజు, సీపీఐ ఎంఎల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఎంఎస్ నాగరాజు, ఎంసీపీఐ రాష్ట్ర కార్యదర్శి కాటం నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.


