పెదపూడి: కరకుదురు గ్రామంలో గురువారం ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న కూలీలపై తేనెటీగలు ఆకస్మికంగా దాడి చేశాయి. ఈ ఘటనలో గాయపడిన 24 మందిని పెదపూడి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారికి వైద్యులు ప్రేమ్‌చంద్, హర్షవర్ధన్, సుభాష్, రాముడు, వరప్రసాద్ తదితరులు అత్యవసర చికిత్స అందించారు. వారిలో కనిపే అచ్యుతామణి, నురుకుర్తి సూరమ్మ, విప్పర్తి కొండబాబు, జాలిమి వెంకటరావు, దున్నా జయలక్ష్మిలను మెరుగైన చికిత్స కోసం కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. మిగిలిన 19 మంది ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఇళ్లకు పంపించారు. జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఐదుగురు బాధితులను వైఎస్సార్ సీపీ అనపర్తి నియోజకవర్గ కో ఆర్డినేటర్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సాయంత్రం పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు, వారి బంధువులను అడిగి తెలుసుకున్నారు. సంఘటన జరిగిన వెంటనే ఫీల్డ్ అసిస్టెంటు శివ, ఏపీఓ సత్యనారాయణ సకాలంలో స్పందించడంతో కూలీలకు ప్రాణాపాయం తప్పిందని అన్నారు. తేనెటీగల దాడిలో కిడ్నీలు ఫెయిలై ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుందని చెప్పారు. తుప్పలు, గట్ల మీద చెత్త , కాలువల్లో పూడిక తొలగింపు వంటి పనుల్లో కూలీలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ జిల్లా కార్యదర్శి వాసంశెట్టి మాధవ, గ్రామ కన్వీనర్ పెమ్మనబోయిన గోవిందరాజు తదితరులు ఉన్నారు. అంతకు ముందు తేనెటీగల బాధితులను కాకినాడ డ్వామా పీడీ ఎస్.మధుసూదన్, డ్వామా ఫైనాన్స్ అధికారి విజయభాస్కర్ తదితరులు జీజీహెచ్‌లో పరామర్శించారు. అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు.


