సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జనగణన (సెన్సస్)లో భాగంగా స్వీయ నమోదు అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. స్వీయ వివరాలతో పాటు కుటుంబ సభ్యుల వివరాలు కూడా నమోదు చేసుకోవాలని సూచించారు. హెచ్‌టీటీపీఎస్://ఎస్‌సీ.సీఈఎన్‌ఎస్‌యూఎస్.జీఓవీ.ఇన్ పోర్టల్ ద్వారా ఈ నెల 16 నుంచి 30వ తేదీ వరకూ ప్రజలు తమ వివరాలు స్వయంగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఫోన్ నంబర్ వంటి మొత్తం 33 అంశాలపై సమాచారం సేకరిస్తారని తెలిపారు. దీనిపై ప్రతి రోజూ వేర్వేరు వర్గాల ప్రజలను కలిసేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా ఈ నెల 16న ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. 17న సచివాలయ, జిల్లా, మండల కార్యాలయ సిబ్బంది, 18న ప్రముఖులు, క్రీడాకారులు, కళాకారులు, 19న మహిళా సంఘాలు, 20, 30 తేదీల్లో కార్మికులు, 21న గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది, 22న పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, 23, 24 తేదీల్లో అంగన్‌వాడీ, ఆరోగ్య కార్యకర్తలు, గిరిజన ప్రాంతాలు, 25న రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, 26న వృద్ధాశ్రమాలు, 27న దుకాణాలు, పరిశ్రమలు, 28న బ్యాంకులు, 29న పోలీస్ సిబ్బంది వంటి వర్గాలను లక్ష్యంగా చేసు కుని ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా రోజుకు కనీసం 10 నుంచి 20 మంది వరకూ స్వీయ నమోదు చేసుకునేలా ప్రోత్సహించాలని కలెక్టర్ కీర్తి సూచించారు.
మాలకోడు చెరువు ప్రక్షాళనకు శ్రీకారం
నిడదవోలు: మాలకోడు చెరువు ప్రక్షాళనకు రూ.5.5 కోట్లతో శ్రీకారం చుట్టామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈ వారం నిడదవోలు రానున్న సీఎం చంద్రబాబు ఈ పనులను పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. చెరువులో గుర్రపు డెక్కను తొలగించి, దానిని వర్మి కంపోస్ట్‌గా మార్చే ప్రక్రియను పరిశీలిస్తారన్నారు. సీవేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారన్నారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.


