సభ్యుల డిమాండ్
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జయలక్ష్మీ సొసైటీ ప్రస్తుత పాలక వర్గం చైర్మన్ గంగిరెడ్డి త్రినాథరావు, ఇతర సభ్యులు అవినీతికి పాల్పడిన నేపథ్యంలో వారిని తొలగించాలని సొసైటీ సభ్యుల డిమాండ్ చేశారు. కాకినాడ గాంధీభవన్‌లో గురువారం జయలక్ష్మి సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. సొసైటీ బోర్డు తిప్పేసిన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో చైర్మన్‌గా ఎన్నికై న గంగిరెడ్డి త్రినాథరావు, ఇతర పాలక వర్గ సభ్యులు సుమారు రూ.4.60 కోట్లు దోచుకొన్నారని సభ్యులు మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న కార్యవర్గాన్ని రద్దు చేసి, ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. నాలుగు సంవత్సరాలుగా విచారణ అధికారులు సైతం రికవరీలో శ్రద్ధ చూపకపోవడంతో డిపాజిట్‌దారులకు అన్యాయం జరిగిందని జయలక్ష్మి విక్టిమ్స్ స్టీరింగ్ కమిటీ కార్యదర్శి ఈరంకి రఘభూషణ్ తెలిపారు.
సొసైటీలో 2,284 మంది రుణాలు తీసుకొన్నారన్నారు. వీరిలో కేవలం 13 మంది వద్ద మాత్రమే రుణాలు వసూలు చేశారన్నారు. జయలక్ష్మి సొసైటీ 29 శాఖల్లో ఉన్న ఫర్నీచర్ అమ్మకాల్లో అవినీతి జరిగిందన్నారు. అక్కడ ఉన్న ఫర్నీచర్‌ను కార్గవర్గ సభ్యులు వారి బంధువులకు తక్కువ ధరకు విక్రయించారన్నారు. ఈ సొసైటీకి ఎన్నో విలువైన ఆస్తులు ఉన్నాయని వాటిని అమ్మితే డిపాజిట్‌దారులకు 50 శాతం చెల్లించవచ్చునన్నారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న కాకినాడ డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి పీబీఎంఎం కుమార్ మాట్లాడుతూ సహకారశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జయలక్ష్మి సొసైటీలో జరిగిన అవినీతిపై తాను విచారణ చేపట్టగా పలు విషయాలు బయటపడ్డాయన్నారు. డబ్బు చెల్లించకుండానే రూ.3. 98 కోట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు రుణాలు తీసుకొన్న వారికి ఇచ్చివేశారన్నారు. ఎటువంటి ఓచర్లు, బిల్లులు లేకుండా సుమారు రూ.70 లక్షలు దుర్వినియోగం అయినట్లు గుర్తించామని వివరించారు. ఈ సందర్భంగా పలువురు డిపాజిట్‌దారులు వీలైనంత త్వరగా తమకు డబ్బులు ఇప్పించాలని సహకారశాఖ అధికారులను కోరారు. నాలుగు సంవత్సరాలుగా వడ్డీ రాకపోవడంతో కుటుంబాలను పోషించడం ఇబ్బందిగా మారిందని పలువురు డిపాజిట్‌దారులు ఆవేదన వ్యక్తం చేశారు.


