ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): వచ్చే నెల తొమ్మిదో తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి పోలీసులకు సూచించారు. బుధవారం సంస్థ కార్యాలయంలో ఆమె, తూర్పు గోదావరి జిల్లా ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జి షేక్ జానీ బాషా సమన్వయశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో విచారణలో ఉన్న ఖైదీల కేసుల దర్యాప్తు, చార్జ్ షీట్ దాఖలు విషయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పోలీసు అధికారులకు పలు సూచనలిచ్చారు. బెయిల్ / జామీను విషయంలో ఖైదీలు ఎదుర్కొంటున్న సమస్యలపై తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించారు. ఈ సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రెవెన్యూ, పోలీసు అధికారులు, కేంద్ర కారాగారం, ప్రత్యేక మహిళా కారాగారం అధికారులు పాల్గొన్నారు.


