నవయుగ నాటక వైతాళికుడు! | - | Sakshi
Sakshi News home page

నవయుగ నాటక వైతాళికుడు!

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఆయన సీ్త్ర విద్యోద్ధారకుడు.. బాలికా విద్యకు స్ఫూర్తి ప్రదాత.. వితంతు వివాహాలు జరిపించిన సంస్కరణవాది.. సమాజ సేవ కోసం ‘హితకారిణి’ని స్థాపించిన సేవామూర్తి. వ్యవహార ధర్మబోధిని పేరుతో తొలి ప్రదర్శిత నాటకం ప్రదర్శించిన నాటక కర్త.. ఇంతటి ఘనత గోదారి తీరాన రాజమహేంద్రిలో నడయాడిన నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులుకే సొంతం. 1848 ఏప్రిల్‌ 16న రాజమహేంద్రవరంలో పున్నమ్మ, సుబ్బారాయుడు దంపతులకు జన్మించిన ఆయన 179వ జయంత్యుత్సవాలకు నగరం ముస్తాబైంది. ‘కావ్యేషు నాటకం రమ్యం’ అని భారతీయ సాహితీకారులు పేర్కొన్నా.. ‘ఈ ప్రపంచమే ఒక రంగస్థలం, సీ్త్రపురుషులందరూ పాత్రధారులు’ అని ఆంగ్ల కవి షేక్‌స్పియర్‌ ప్రకటించినా, నాటకం ఒక విలక్షణ ప్రక్రియగా తన ప్రత్యేకతను, ప్రాభవాన్ని నేటికీ కోల్పోలేదు. ఒకనాడు సమాజ చైతన్యానికి ఊపిరులూదిన నాటకరంగం సినిమాల రాకతో కొంత ప్రాభవం కోల్పోయిన మాట నిజమే. అయినప్పటికీ నేటికీ రంగస్థలాన్ని ఆదరిస్తున్న కళాభిమానులకు కొదవు లేదన్నదీ అంతే నిజం.

రాజమహేంద్రవరం పురిటిగడ్డగా

సామాజిక చైతన్యంతో పాటు, పురాణ సాహిత్యంపైనా సామాన్యుల్లో ఆసక్తి కలిగించినది నాటకరంగమే. రాజమహేంద్రవరం కేంద్రంగా యుగపురుషుడు కందుకూరి వీరేశలింగం రచించిన తొలి ప్రదర్శిత నాటకం ‘వ్యవహార ధర్మబోధిని’ నాడు ఎంతో సంచలన సృష్టించింది. సామాజిక రుగ్మతలపై కందుకూరి సంధించిన మరో అస్త్రం ‘బ్రాహ్మీ వివాహం‘ చాందసవాదులను కలవరపరిచింది. అదే సమయంలో కళింగప్రాంతం నేపథ్యంలో గురజాడ వారి కన్యాశుల్కం నేటికీ నిత్య నూతమే. కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహం, తిరుపతి వేంకట కవులు పౌరాణిక నాటకాలతో తెలుగువారిని ఆకట్టుకుంటే, హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావు, ఇతర ప్రముఖులు నాటకరంగాన్ని పరిపుష్టం చేశారు.

నాటకరంగ దినోత్సవంగా ప్రకటన

నాటకరంగం తన ప్రాభవాన్ని కోల్పోకూడదని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో అప్పటి రాజమహేంద్రవరం ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు అభ్యర్థనపై కందుకూరి జన్మదినాన్ని నాటకరంగ దినోత్సవంగా ప్రకటించారు.

మొట్టమొదటి వితంతు వివాహం

1881 డిసెంబర్‌ 11న వీరేశలింగం ఇంటిలో మొట్టమొదటి వితంతు వివాహం జరిపారు. బాల వితంతువు గౌరమ్మ, రేబూడికి చెందిన గోగులపాటి శ్రీరాములకు వివాహం జరింపించారు. వంట చేయడానికి ఎవరూ ముందుకు రాకపోతే భార్య రాజ్యలక్ష్మమ్మ తానే స్వయంగా వంట చేశారు.

కందుకూరి దంపతులు నివసించిన పాత ఇల్లు, నేటి నాటక నిలయం

వీరేశలింగం రచించిన పుస్తకాలు

నాటక నిలయంగా

కందుకూరి గృహం

నాటకానికి తాహి సాహిత్యం అని ఆర్యోక్తి. నాటకం లేకపోతే అది సాహిత్యమే కాదు. తెలుగు అక్షరానికి శ్రీకారం చుట్టినట్లే, తెలుగు నాటక రంగం కూడా నడక నేర్చింది ఇక్కడే. ఆ ఉద్దేశంతోనే తెలుగు నాటకం నిలయాన్ని ప్రారంభించారు. ఆనంద్‌ గార్డెన్‌లోని కందుకూరి నివశించిన ఇంట్లో జక్కంపూడి విజయలక్ష్మి ప్రోత్సాహంతో లక్ష్మీపార్వతిచే ఈ నాటక నిలయాన్ని ప్రారంభించారు. తెలుగు నాటకంలో జరిగిన పరిశోధనలు, అలాగే సాహిత్యాన్ని ఒకచోట నిక్షిప్తం చేయాలన్న ఉద్దేశంతో ఈ నాటక నిలయాన్ని కందుకూరి ఇంట్లో ప్రవేశ పెట్టారు. ఇది కందుకూరి కుటుంబానికి చెందిన కార్యక్రమంలా కాకుండా యావత్‌ ఆంధ్ర ప్రజలంతా పండగలా నిర్వహించాల్సిన అవసరం ఉంది.

కందుకూరి రచనలలో కొన్ని..

మార్కండేయ మకుటంతో శతకం, శ్రీరాజమహేంద్ర పురవర గోపాల వంటి పద్య కావ్యాలు, వ్యవహార దర్మభోధిని, చమత్కార రత్నావళి, అభిజ్ఞాన శాకుంతలం వంటి నాటకాలు, రాజశేఖర చరిత్రము, సత్యరాజా పూర్వదేశ యాత్రలు వంటి రచనలు, సాంఘిక దురాచారాలపై అనేక రచనలు చేశారు.

నాటకాన్ని ఆదరించే రోజులు రావాలి

దసరా, వినాయక చవితి లాంటి పండగలే నేడు నాటకాలను ప్రదర్శిస్తున్నారు. సత్య హరిశ్చంద్ర, వరవిక్రయం, చింతామణి, పాండవోద్యోగ విజయంలోని పద్యాలు నాటి తెలుగువారి నాలుకలపై నాట్యమడేవి. ఆ రోజులే వేరు. ఆ రోజులు మళ్లీ రావాలి. పరిషత్‌ల పోటీల వల్లే ఇంకా నాటకాలు మనగలుగుతున్నాయి.

– డీఎస్పీ రావు, నాటక కళాకారులు

ప్రపంచమే నాటక రంగం

ప్రపంచమే పెద్ద నాటక రంగం. సీ్త్ర, పురుషులు ఇద్దరూ పాత్రధారులే. విభిన్న సంస్కృతులు, జాతులను కలిపిన కళావేదికే రంగస్థలం. నన్నయ కాలంలోనే నాటక ప్రదర్శనలు ఉన్నాయి. తెలుగులో తొలి నాటక కర్త, ప్రయోక్త రెండూ కందుకూరే. నేడు అడపాదడపా నాటక ప్రదర్శనలు తప్ప, నిరంతరం థియేటర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ని స్మరించుకోవడం కనుమరుగవుతోంది. సమాజ ప్రతిబింబమైన నాటకాన్ని అందరూ కాపాడుకోవాలి.

– డాక్టర్‌ పీవీబీ సంజీవరావు, నాటక సాహిత్య పరిశోధకులు

సాంఘిక నాటకాలకు

ఆద్యుడు కందుకూరి

వ్యవహార ధర్మబోధినితో సంచలనం

ఆయన జనన తేదీనే నాటకరంగ

దినోత్సవంగా ప్రకటించిన వైఎస్సార్‌

నేడు 179వ జయంతి

Advertisement
 
Advertisement
Advertisement