జాతీయ రహదారిపై టిప్పర్‌ బీభత్సం | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై టిప్పర్‌ బీభత్సం

Apr 16 2026 12:17 PM | Updated on Apr 16 2026 12:17 PM

అదుపు తప్పిన వాహనం నుంచి పడి

డ్రైవర్‌ మృతి

క్లీనర్‌కు తీవ్ర గాయాలు

బాధితులు ఒడిశావారిగా గుర్తింపు

తొండంగి: బెండపూడి శివారు తమ్మయ్యపేట జాతీయ రహదారిలోని రావికంపాడు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ జంక్షన్‌ వద్ద బుధవారం టిప్పర్‌ లారీ బీభత్సం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు అన్నవరం వైపు నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న టిప్పర్‌ లారీ అతివేగంగా వెళ్తూ అక్కడి జంక్షన్‌ వద్ద ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో అందులోని డ్రైవర్‌ సంతోష్‌కుమార్‌ ఫాలో (56) రోడ్డుపై పడిపోయాడు. లారీ ఆగకుండా సెంట్రల్‌ డివైడర్‌ను దాటి రాజమండ్రి వైపు నుంచి అన్నవరం వైపు వస్తున్న రహదారిని దాటుకుని రేకుల షెడ్డును ఢీకొట్టి ఆగింది. దీంతో విద్యుత్‌ వైర్లు కూడా తెగిపడ్డాయి. ఈ ఘటనలో డ్రైవర్‌తో పాటు, క్లీనర్‌ మంగరాజ్‌ గొల్లారి తీవ్రగాయాలు కాగా, డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే హైవే సిబ్బంది తెగిన విద్యుత్‌ తీగల నుంచి స్థానికులను అప్రమత్తంచేసి దూరంగా పంపారు. క్లీనర్‌ను వైద్యం నిమిత్తం అంబులెన్స్‌లో ప్రత్తిపాడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌, క్లీనర్‌ ఇద్దరూ ఒడిశా రాష్ట్రం కోరాపుట్‌ వాసులుగా పోలీసులు తెలిపారు. జి.మాడుగుల నుంచి రాజమహేంద్రవరానికి లారీ మరమ్మతుల నిమిత్తం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వారు తెలిపారు. తొండంగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్థానికంగా దుకాణాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమేరాల్లో ప్రమాద దృశ్యాలు రికార్డయ్యాయి. డ్రైవర్‌ నిద్రమత్తా, లేక సాంకేతిక లోపమా అనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఈ ఘటన సమయంలో హైవే మరమ్మతులు చేస్తున్న సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనతో సుమారు గంటపాటు వాహనాల ట్రాఫిక్‌ నిలిచిపోయింది. హైవే సిబ్బంది, పెట్రోలింగ్‌ సిబ్బంది వాహనాలను క్రమబద్దీకరించడంతో వాహనాల రాకపోకలు యథావిధిగా సాగాయి.

Advertisement
 
Advertisement
Advertisement