అన్నవరం: ఈ నెల 26 నుంచి మే రెండో తేదీ వరకూ సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. ఏర్పాట్లలో చోటు చేసుకున్న లోపాలతో గత ఏడాది ఈ ఉత్సవాలు పెద్దగా కళ కట్టలేదు. ఈ ఏడాదైనా ఆ లోపాలను సరి చేసి, ఉత్సవాలను కన్నుల పండువగా నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ శుభ వేడుకల నిర్వహణపై గురువారం రత్నగిరిపై సన్నాహక సమావేశం నిర్వహించనున్నారు. పెద్దాపురం ఆర్‌డీఓ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ సమావేశానికి పెద్దాపురం డీఎస్పీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, నూతన ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తదితరులు హాజరు కానున్నారు. ఉత్సవాల నిర్వహణకు దేవస్థానం తరఫున చేపడుతున్న ఏర్పాట్లను ఈఓ ఈ సందర్భంగా వివరించనున్నారు. ఈ ఉత్సవాలకు వేలాదిగా భక్తులు తరలి రానున్న నేపథ్యంలో చేయాల్సిన ఇతర ఏర్పాట్లపై ఈ సమన్వయ సమావేశంలో చర్చించనున్నారు.
వీటిపై దృష్టి పెడితే మేలు
ఫ కల్యాణోత్సవాల మొదటి రోజున స్వామి, అమ్మవారిని వధూవరులను చేసే కార్యక్రమంలో తూతూమంత్రంగా నలుగురికి తాంబూలం ఇచ్చి మమ అనిపించేస్తున్నారు. ఈ కాార్యక్రమానికి వచ్చే మహిళలే 25 మందికి మించి ఉండరు. వారందరికీ తాంబూలం ఇస్తే సంతోషిస్తారు.
ఫ ఈ నెల 27వ తేదీ రాత్రి 9.30 గంటలకు జరిగే సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవానికి వేలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. కానీ, స్వామివారి వార్షిక కల్యాణ వేదిక ముందున్న విశ్రాంతి షెడ్డులో సుమారు 2 వేల మంది మాత్రమే కల్యాణాన్ని తిలకించే అవకాశం ఉంది. మిగిలిన వారు కూడా ఈ ఉత్సవాన్ని తిలకించేందుకువ వీలుగా ఆ షెడ్డుకు ఇరువైపులా పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేయాలి.
ఫ ఆ రోజున ట్రాఫిక్ క్రమబద్ధీకరించాలి. చిన్న, ద్విచక్ర వాహనాలు మినహా మిగిలిన వాటిని సాధ్యమైనంత వరకూ కొండ దిగువనే నిలిపివేయాలి. భక్తులను కొండ మీదకు తరలించేందుకు ఉచిత బస్సులు నడపాలి.
ఫ కల్యాణానికి హాజరయ్యే భక్తులకు మంచినీరు, కల్యాణానంతరం అన్నదాన పథకంలో ఉచిత ఫలహారాన్ని రెండు మూడు చోట్ల పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఫలహారం కూడా ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేస్తే భక్తులు వాటిని తీసుకుని వెళ్లిపోయే అవకాశం ఉంటుంది.
ఫ కల్యాణానంతరం ఉచిత ప్రసాదం, తలంబ్రాలను ఒక్కచోట మాత్రమే పంపిణీ చేస్తూండటంతో భక్తుల మధ్య తోపులాట జరుగుతోంది. స్వామివారి సర్కులర్ మండపంతో పాటు మరో రెండుచోట్ల పంపిణీ చేస్తే ఈ ఇబ్బంది తప్పుతుంది.
ఫ పంపా జలాశయంలో ప్రస్తుత నీటిమట్టం 88 అడుగులు ఉంది. బ్యారేజీకి కొత్త గేట్ల ఏర్పాటు పనులకు తోడు, ఆయకట్టులో రబీ సాగుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఏలేరు నుంచి రోజుకు 50 క్యూసెక్కులు పంపాకు మళ్లిస్తున్నా వచ్చిన నీరు వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో, రోజు రోజుకూ నీటిమట్టం తగ్గుతోంది. కల్యాణోత్సవాల నాటికి ఇది మరింత తగ్గే అవకాశం ఉంటుంది. కల్యాణోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు రానున్నందున దేవస్థానంలో నీటి సమస్య ఉత్పన్నమయ్యే అవకాశముంది. దీంతోపాటు మే 1న స్వామివారి శ్రీచక్రస్నానం నిర్వహించాలి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఏలేరు నుంచి నీటి విడుదలను పెంచాలి.
ఫ భక్తులు భారీగా రానున్నందున వారిని నియంత్రించేందుకు పెద్ద సంఖ్యలో పోలీసులను నియమించాలి.
ఫ పశ్చిమ, తూర్పు రాజగోపురాల పరిసరాల్లో పార్కింగ్ స్థలాల వద్ద ఎక్కువ సంఖ్యలో టాయిలెట్లు ఏర్పాటు చేయాలి.
ఫ ఈ నెల 30న సత్యదేవుడు, అమ్మవార్లను భారీ టేకు రథంపై కొండ దిగువన ఊరేగించనున్నారు. దీనికి అధిక సంఖ్యలో భక్తులు రానున్నందున విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయాలి. ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలి.
ఫ గత ఏడాది మధ్యాహ్నం 3.30 గంటలకే రథోత్సవాన్ని ప్రారంభించడంతో ఆంధ్రా బ్యాంక్ సెంటర్ వరకూ ఈ ఉత్సవాన్ని తిలకించేవారే లేరు. ఆ తరువాత సాయంత్రం 6 గంటల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. అందువలన ఈసారి రథోత్సవాన్ని సాయంత్రం 5 గంటల తరువాత ప్రారంభిస్తే మేలు.
ఫ సత్యదేవుని శ్రీపుష్పయాగం అనంతరం మహిళలకు జాకెట్టు ముక్కల పంపిణీలో ఏటా గందరగోళం ఏర్పడుతోంది. దీని నివారణకు చర్యలు తీసుకోవాలి.
గత ఏడాది లోపాలివీ..
గత ఏడాది సత్యదేవుని కల్యాణోత్సవాల నిర్వహణపై అనేక విమర్శలు వచ్చాయి. ప్రధానంగా పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణ పేలవంగా ఉన్నాయనే అభిప్రాయం భక్తుల నుంచి వినిపించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా గత ఏడాది కల్యాణోత్సవాల సందర్భంగా రత్నగిరి వనదేవత వనదుర్గ అమ్మవారికి శుక్రవారం చండీ హోమం, పౌర్ణమి నాడు ప్రత్యంగిర హోమం నిర్వహించలేదు. దీనిపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించడంతో అధికారులు స్పందించి, వైదిక కమిటీని వివరణ కోరారు. ఈసారి కొత్తగా ప్రతి శుక్రవారం ఉదయం ఖడ్గమాల పూజ కూడా ప్రారంభించారు. వీటన్నింటినీ ఈ ఏడాదైనా ఏ వివాదం లేకుండా నిర్వహిస్తారో లేక ఉత్సవాల సాకుతో నిలిపివేస్తారో వేచి చూడాలి. కల్యాణోత్సవాల చివరి రోజున శ్రీపుష్పయాగం నాడు ఊయలలో స్వామి, అమ్మవార్ల అలంకరణపై కూడా గతంలో విమర్శలు వచ్చాయి. ఈ లోపాలను ప్రస్తావిస్తూ ‘ప్చ్.. కళ కట్టలే..’ శీర్షికన అప్పట్లో ‘సాక్షి’ కథనం ప్రచురించింది. ఆ లోపాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. ఈ మాట ఏమేరకు నిలబెట్టుకుంటారో చూడాలి.


