ఇంటర్‌ ఫలితాల్లో జిల్లాకు 6వ స్థానం | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ ఫలితాల్లో జిల్లాకు 6వ స్థానం

Apr 16 2026 10:30 AM | Updated on Apr 16 2026 10:30 AM

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటర్‌ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో జిల్లా 6వ స్థానంలో నిలిచింది. ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణత ఐదు శాతం తగ్గినా, ద్వితీయ సంవత్సరంలో 9 శాతం ఉత్తీర్ణత పెరిగింది. జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మార్చి 25 వరకు జరిగాయి. ఈ పరీక్షలకు మొదటి సంవత్సరం విద్యార్థులు 19,977 మంది హాజరుకాగా, 16,439 మంది ఉత్తీర్ణులయ్యారు. 82 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాది కంటే ఉత్తీర్ణత 5 శాతం తగ్గింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 18,337 మంది పరీక్షలు రాయగా 15,707 మంది ఉత్తీర్ణులయ్యారు. 86 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు. గత సంవత్సరంతో పోలిస్తే 9 శాతం ఉత్తీర్ణత పెరిగింది. 2025లో జిల్లా ప్రథమ సంవత్సరంలో 77 శాతం ఉత్తీర్ణతతో 5వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 87 శాతం ఉత్తీర్ణతతో 4వ స్థానంలో నిలిచింది. 2024లో ప్రథమ సంవత్సరంలో 75 శాతం ఉత్తీర్ణతతో 5వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 85 శాతం ఉత్తీర్ణతతో 5వ స్థానం సాధించింది. విద్యార్థులకు మరో అవకాశం కల్పిస్తూ సప్లిమెంటరీ పరీక్షలను మే 21 నుంచి జూన్‌ 4 వరకు నిర్వహించనున్నట్టు అధికారులు వెల్లడించారు.

కళాశాలల వారీ ఇలా..

మొదటి సంవత్సరంలో ఎయిడెడ్‌ కళాశాలల నుంచి 95 మంది హాజరుకాగా 17 మంది పాసై 17.8 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ కళాశాలల్లో 481 మందికి 401 మంది పాసై 83.3 శాతం, ప్రభుత్వ కళాశాలల్లో 1,794 మందికి 780 మంది పాసై 43.4 శాతం, హైస్కూలు ప్లస్‌లో 447 మందికి 178 మంది పాసై 39.8 శాతం, ప్రైవేట్‌, అన్‌ ఎయిడెడ్‌ కళాశాలల్లో 17,676 మందికి 15,063 మంది పాసై 85.2 శాతం ఉత్తీర్ణత సాధించారు.

ద్వితీయ సంవత్సరంలో ఎయిడెడ్‌ కళాశాలల నుంచి 114 మంది విద్యార్థులు హాజరుకాగా 41 మంది పాసై 39.5 శాతం సాధించారు. ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ కళాశాలల్లో 420 మందికి 389 మంది పాసై 92.6 శాతం, ప్రభుత్వ కళాశాలల్లో 1,508 మందికి 926 మంది పాసై 61.4 శాతం, హైస్కూలు ప్లస్‌లో 342 మందికి 180 మంది పాసై 52.6 శాతం, ప్రైవేట్‌, అన్‌ ఎయిడెడ్‌ కళాశాలల్లో 16,370 మందికి 14,171 మంది పాసై 86.5 శాతం ఉత్తీర్ణత సాధించారు.

20 నుంచి రీ వెరిఫికేషన్‌,

రీ కౌంటింగ్‌

ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో అనుమానాలుంటే ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు రీ వెరిఫికేషన్‌, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్‌ బోర్డు ఆర్‌ఐవో ఐ.శారద తెలిపారు.

ప్రథమ సంవత్సరంలో 82, ద్వితీయ

సంవత్సరం 86 శాతం పాస్‌

గత ఏడాదితో పోలిస్తే ప్రథమ

సంవత్సరంలో 5 శాతం తగ్గిన ఉత్తీర్ణత

ద్వితీయ సంవత్సరంలో

9 శాతం పెరుగుదల

నూరుశాతం ఫెయిల్‌

పెదపూడి: జి.మామిడాడలోని ప్రభుత్వ మహిళా ఇంటర్మీడియెట్‌ కాలేజీ (ప్లస్‌ 2) విద్యార్థులు నూరుశాతం ఫెయిల్‌ అయ్యారు. ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ అప్పలాచార్యులు మాట్లాడుతూ తమ కళాశాల నుంచి ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు మొత్తం 25 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. వారిలో ఫస్ట్టియర్‌ సీఈసీ నలుగురు, సెకండియర్‌ 11, సెకండియర్‌ ఎంపీసీ 10 మంది ఉన్నారన్నారు. వీరందరూ పరీక్షల్లో ఫెయిల్‌ అయ్యారని ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement