ఫ నేటితో పూర్తి కానున్న టెన్త్ స్పాట్
ఫ ఇక ఫలితాల విడుదలే తరువాయి
ఫ విద్యార్థులు, తల్లిదండ్రుల
ఎదురుచూపులు
రాయవరం: పదో తరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనం తుది అంకానికి చేరుకుంది. ఈ నెల 6న ప్రారంభమైన ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రంతో షెడ్యూల్ ప్రకారం ముగియనుంది. జవాబు పత్రాల మూల్యాంకనం చివరి దశకు చేరుకోవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలనే పడింది.
తడబడుతూ ప్రారంభమై..
ఈ ఏడాది పదో తరగతి మూల్యాంకనాన్ని నూతన విధానంలో ప్రారంభించారు. జవాబు పత్రాల మూల్యాంకనం అనంతరం ఆన్‌లైన్‌లో మార్కులను నమోదు చేస్తున్నారు. ప్రతి సబ్జెక్టుకు ప్రశ్నల వారీగా విద్యార్థి పొందిన మార్కులను ట్యాబ్ సహాయంతో ఏరోజుకారోజు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. అయితే ఈ నెల 6న మూల్యాంకనం ప్రారంభించగా తొలి రోజు తడబాట్లతో ప్రారంభమైంది. నెట్‌వర్క్ సమస్యలతో పాటుగా, నూతన విధానం కావడంతో తొలి రోజు తక్కువగా పేపర్ల మూల్యాంకనం చేపట్టారు. రెండో రోజు నుంచి 40 వంతున పేపర్లను ఏఈలు మూల్యాంకనం చేయగా, స్పెషల్ అసిస్టెంట్ల ద్వారా మార్కుల ఆన్‌లైన్ చేపట్టారు. గత విద్యా సంవత్సరంలో ఫలితాలను ఏప్రిల్ 23న విడుదల చేశారు. మరి ఈ సంవత్సరం ఎప్పుడు చేస్తారో వేచి చూడాల్సిందే.
5,44,769 జవాబు పత్రాల రాక
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు వివిధ జిల్లాల నుంచి 5,44,769 జవాబు పత్రాలను మూల్యాంకనం కోసం పంపించారు. తెలుగు, కాంపోజిట్ తెలుగు, హిందీ, ఇంగ్లిషు, గణితం, ఫిజికల్ సైన్స్, బయలాజికల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులతో పాటుగా, ఒకేషనల్ పేపర్లను మూల్యాంకనం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు 1,76,032, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు 1,79,180, కాకినాడ జిల్లాకు 1,89,557 జవాబు పత్రాలు వచ్చాయి. 348 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 1,438 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 693 మంది స్పెషల్ అసిస్టెంట్లు విధుల్లో పాల్గొన్నారు.
షెడ్యూల్ ప్రకారమే..
పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని షెడ్యూల్ ప్రకారమే నిర్వహించాం. శత శాతం జవాబు పత్రాల మూల్యాంకనాన్ని సమర్థవంతంగా చేశాం. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, సిబ్బంది సహకారంతో విజయవంతంగా జరిగింది.
– జి.నాగమణి, ఆర్‌జేడీ, పాఠశాల విద్యాశాఖ, కాకినాడ


