ఫ మొదటి దశలో గృహగణన
ఫ రెండో దశలో జనగణన
ఫ రేపటి నుంచి సెల్ఫ్ ఎన్యూమరేషన్
రాయవరం: పదేళ్లకోసారి నిర్వహించే జనగణన 2021లో కరోనా కారణంగా నిలిచిపోయింది. ఆ తర్వాత వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం జనగణనకు షెడ్యూల్ విడుదల చేసింది. ఈ కార్యక్రమం రెండు విడతల్లో నిర్వహించనుంది. తొలి దశలో గృహ గణన, రెండో దశలో జనగణన చేపట్టనుంది. దీనికి సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకుంది. క్షేత్ర స్థాయిలో జనగణన నిర్వహించే ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చేందుకు గాను ఫీల్డ్ ట్రైనర్లకు తొలి దశలో గత నెల 23 నుంచి 29వ తేదీ వరకూ శిక్షణ ఇచ్చారు. ప్రతి మండలం నుంచి ఇద్దరు టీచర్లను ఫీల్డ్ ట్రైనర్లుగా తీసుకున్నారు. ఈ నెల రెండో వారంలో మండలాల వారీగా ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు ఫీల్డ్ ట్రైనర్లు మూడు రోజుల చొప్పున రెండు బ్యాచ్‌ల్లో క్షేత్ర స్థాయిలో శిక్షణ ఇస్తారు. మండల స్థాయిలో సచివాలయ సిబ్బందిని ఎన్యూమరేటర్లుగా, వివిధ శాఖల అధికారులను సూపర్‌వైజర్లుగా నియమిస్తున్నారు. ఈ ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. 200 ఇళ్లు లేదా 800 జనాభాకు ఒక ఎన్యూమరేటర్‌ను నియమిస్తున్నారు. ఆ విధంగా ప్రతి మండలంలో 100 నుంచి 150 మందిని ఎన్యూమరేటర్లుగా నియమించే అవకాశం ఉంది. ఆరుగురు ఎన్యూమరేటర్లకు ఒక సూపర్‌వైజర్ చొప్పున ఉంటారు.
ప్రత్యేకతలివీ..
ఫ జనగణన పూర్తిగా సెన్సస్–2027 మొబైల్ యాప్‌లో జరుగుతుంది.
ఫ ఈసారి ఎన్యూమరేటర్లుగా టీచర్లను మినహాయిస్తున్నట్లు సమాచారం.
ఫ సచివాలయ సిబ్బందితో జనగణన పూర్తి చేసే అవకాశముంది.
ఫ ప్రస్తుత సెన్సస్‌లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ ప్రక్రియ గురువారం ప్రారంభం కానుంది.
ఫ గూగుల్ ప్లే స్టోర్ నుంచి సెన్సస్–2027 యాప్‌ను గృహ యజమానులు డౌన్‌లోడ్ చేసుకుని, సొంతంగా వివరాలు నమోదు చేసుకోవచ్చు.
33 రకాల ప్రశ్నలు
ఫ మొదటి విడత గృహ గణన మే 1 నుంచి 31వ తేదీ వరకూ జరగనుంది. ఇందులో సేకరించిన వివరాలను కంప్యూటర్ మెయింటెనెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా నమోదు చేస్తారు. జనగణన ద్వారా సేకరించే గణాంకాల ఆధారంగా గ్రామ, పట్టణ, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో అభివృద్ధి ప్రణాళికలకు రూపకల్పన చేస్తారు.
ఫ మొదటి దశలో హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ (హెచ్‌ఎల్‌ఓ) చేపడతారు.
ఫ ఇంటి నిర్మాణం మొదలు ప్రతి వివరం నమోదు చేస్తారు.
ఫ గుర్తించిన ఇంటికి ప్రత్యేక సంఖ్య కేటాయిస్తారు.
ఫ ఇంట్లో నివసించే సభ్యుల వివరాలు నమోదు చేస్తారు.
ఫ గృహగణనలో భాగంగా మౌలిక సదుపాయాలు, ఫోన్, ఇంటర్‌నెట్, వాహనాలు తదితర గృహోపకరణాల వివరాలు సేకరిస్తారు.
ఫ ఇంటి కట్టడం తీరు, ఫ్లోరింగ్, తాగునీటి వినియోగం, మరుగుదొడ్ల వాడకం, విద్యుత్ వినియోగం, నెలవారీ బిల్లు, విద్యుత్‌తో పని చేసే పరికరాలు (ఏసీ, రిఫ్రిజిరేటర్, ఫ్యాన్లు, గీజర్) తదితర వివరాలు నమోదు చేస్తారు.
ఫ ఇంటి యజమానిని 33 రకాల ప్రశ్నలు అడిగి వివరాలు సేకరిస్తారు.
ట్రయల్ రన్ షురూ
యాప్ పని తీరుపై ముందుగా ట్రయల్ రన్ వేశారు. ఎంపిక చేసిన ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లి ఫీల్డ్ ట్రైనర్లు గృహగణన నమోదు చేశారు. సేకరించిన వివరాలను యాప్‌లో నమోదు చేసి, యాప్ పనితీరును సరిచూసుకున్నారు. యాప్ ద్వారా సమాచారం సూపర్‌వైజర్ లాగిన్‌కు వెళ్తున్నట్లు నిర్ధారించుకున్నారు.
సొంతంగా చేసుకోవాలంటే..
గృహ యజమాని సొంతంగా ఎన్యూమరేషన్ చేసుకునే అవకాశమే సెల్ఫ్ ఎన్యూమరేషన్. గూగుల్ ప్లేస్టోర్ నుంచి సెన్సస్–2027 యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వ్యక్తిగత, కుటుంబ వివరాలను ఎవరికి వారే నమోదు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సెల్ఫ్ ఎన్యూమరేషన్ ఐడీ గృహ యజమాని సెల్‌కు టెక్ట్స్ మెసేజ్‌గా వస్తుంది. ఆ ఐడీ నంబరును ఎన్యూమరేటర్‌కు ఇస్తే వివరాలను సరిచూసుకుని సేవ్ చేసుకుంటారు.


