కోమాలోకి వెళ్లిన యువకుడి ఆచూకీ గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

కోమాలోకి వెళ్లిన యువకుడి ఆచూకీ గుర్తింపు

Apr 15 2026 8:08 AM | Updated on Apr 15 2026 8:08 AM

అమలాపురం రూరల్‌: జాతీయ రహదారిపై భట్నవెల్లి వద్ద ఈ నెల 12వ తేదీ రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కోమాలోకి వెళ్లిన యువకుడి ఆచూకీ తెలిసింది. సోషల్‌ మీడియాలో వచ్చిన ఫొటో ఆధారంగా యువకుడిని కుటుంబ సభ్యులు గుర్తించారు. అతడిని అల్లవరం మండలం కొమరగిరి పట్టణానికి చెందిన కోటూరు రాజేష్‌ (20 గా గుర్తించారు. ఎస్సై వై.శేఖర్‌ బాబు మంగళవారం రాత్రి తెలిపిన వివరాల ప్రకారం అమలాపురం నుంచి ముమ్మిడివరం వైపు మోటారు సైకిల్‌పై వెళుతున్న రాజేష్‌ స్థానిక చెక్‌పోస్ట్‌ సమీపంలో రోడ్డును దాటుతున్న వ్యక్తిని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తలకు తీవ్ర గాయం కావడంతో రాజేష్‌ కోమాలోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. రాజేష్‌కు వరుసకు సోదరుడు అయిన నేల వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రోడ్డు ప్రమాదంలో

మహిళ మృతి

సీతానగరం: మోటారు సైకిల్‌ పైనుంచి పడిన ఘటనలో తలకు తీవ్ర గాయమై ఓ మహిళ మృతి చెందింది. వంగలపూడి శివారున ఏటిగట్టుపై ఈ ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే.. కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన నొక్కి వెంకటలక్ష్మి (37) సోమవారం వంగలపూడిలో ఉంటున్న అక్క అరవాలమ్మ ఇంటికి వచ్చింది. అక్క కుమార్తె ఆరోగ్యం బాగా లేకపోవడంతో తాళ్లపూడి మండలం అన్నదేవరపేటలో ఆయుర్వేద మందు తీసుకోవడానికి పురుషోత్తపట్నం ఫెర్రీ రేవు నుంచి గోదావరి దాటి పోలవరం మీదుగా వెళ్లడానికి బంధువులతో కలిసి మంగళవారం వంగలపూడి ఏటిగట్టుపైకి వచ్చింది. అక్కడి నుంచి పురుషోత్తపట్నం వైపు బంధువులు ముందుగా వెళ్లిపోయారు. దీంతో అక్కడకు వెళ్లడానికి వెంకటలక్ష్మి వంగలపూడికి చెందిన దురికుర్తి ఏసును లిఫ్ట్‌ అడిగి మోటారు సైకిల్‌ ఎక్కింది. వంగలపూడి శివారు ఆంజనేయస్వామి ఆలయం వద్ద మలుపులో రోడ్డు పక్కగా వ్యాన్‌ ఆగి ఉంది. ఏసు ఆకస్మాతుగా ఆ వ్యాన్‌ను చేసి బ్రేక్‌ వేశాడు. దీనితో వెంకటలక్ష్మి అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. ఆమె తలకు తీవ్రమైన గాయం తగిలింది. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్‌ ఈఎంటీ శ్రీనివాస్‌ అక్కడి వచ్చి.. వెంకటలక్ష్మి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని హెడ్‌ కానిస్టేబుల్‌ గోవిందరాజులు పోస్టుమార్టం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి భర్త పెంటయ్య, పదిహేడేళ్ల కుమార్తె అనుష్క, పదిహేనేళ్ల కుమారుడు జోసెఫ్‌ ఉన్నారు. అక్క కుమారుడు యానంపూడి శ్రీకాంత్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

హాస్టల్‌కు ఇన్వెర్టర్ల వితరణ

రాజమహేంద్రవరం సిటీ: భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సిద్ధాంతాలు మహోన్నతమైనవని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రీజినల్‌ హెడ్‌ ఏ.విశ్వేశ్వరరావు అన్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా మంగళవారం రాజమహేంద్రవరంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీ సమీపంలోని ఎస్సీ, ఎస్టీ మహిళల హాస్టల్‌ సముదాయానికి రెండు ఇన్వర్టర్లను వితరణ చేశారు. కార్యక్రమంలో డీఆర్‌హెచ్‌ నిర్మల జ్యోతి, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ నాయకులు, బ్యాంక్‌ యూనియన్‌ నాయకులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement