పూలమాల వేయకుండా అవమానిస్తారా? | - | Sakshi
Sakshi News home page

పూలమాల వేయకుండా అవమానిస్తారా?

Apr 15 2026 8:08 AM | Updated on Apr 15 2026 8:08 AM

జనసేన ఎమ్మెల్యేను నిలదీసిన దండోరా నాయకులు

అంబాజీపేట: పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ (జనసేన)కు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళితే.. అంబాజీపేట హడ్కో కాలనీలో గత ఏడాది అంబేడ్కర్‌ విగ్రహం పక్కనే మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహం ఏర్పాటు చేయడంతో వివాదం తలెత్తింది. అప్పటి నుంచీ ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇప్పటికీ పోలీస్‌ పికెట్‌ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా కాలనీలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసేందుకు ఎమ్మెల్యే మంగళవారం వచ్చారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసిన ఆయనను.. పక్కనే ఉన్న జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి కూడా పూలమాల వేయాలని దండోరా నాయకులు కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పూలమాల వేసేందుకు వెళ్తూండగా.. స్థానిక ఎస్సీ నాయకులు జోక్యం చేసుకున్నారు. ఇక్కడ విగ్రహం సమస్య ఇంకా పరిష్కారం కాలేదని ఎమ్మెల్యేకు వివరించి, అక్కడి నుంచి పంపించేశారు. దీనికి దండోరా నాయకులు అభ్యంతరం చెప్పారు. ఏడాది కాలంగా ఇక్కడ విగ్రహం సమస్య పరిష్కారం కానప్పుడు ఎమ్మెల్యే ఎందుకు వచ్చారని నిలదీశారు. రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టడానికి వచ్చారా అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి, జగ్జీవన్‌రామ్‌ విగ్రహానికి పూలమాల వేయకుండా అవమానిస్తారా అని ఆందోళన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కాన్వాయిని అడ్డగించారు. దీంతో, పోలీసులకు, దండోరా నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఆ సమయంలో ఒక గర్భిణి, మహిళ పడిపోయి, అస్వస్థతకు గురవడంతో స్థానిక పీహెచ్‌సీకి తీసుకువెళ్లారు. సమస్యను పరిష్కరించేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో దండోరా నాయకులు ఆందోళన విరమించారు.

Advertisement
 
Advertisement
Advertisement