కొత్త ఈఓ ‘చక్ర’ం తిప్పగలరా? | - | Sakshi
Sakshi News home page

కొత్త ఈఓ ‘చక్ర’ం తిప్పగలరా?

Apr 15 2026 7:44 AM | Updated on Apr 15 2026 7:44 AM

రత్నగిరిపై స్వాగతం

పలుకుతున్న సమస్యలు

ఐదేళ్లుగా అంతంత మాత్రంగా

ఆర్థిక పరిస్థితి

అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ఇన్‌చార్జి ఈఓగా నియమితులైన వాడపల్లి ఈఓ ఎన్‌ఎస్‌ చక్రధర్‌రావుకు సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. అనుభవజ్ఞులైన సిబ్బంది లేకపోవడం, శానిటేషన్‌ సమస్య, ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండడం, త్వరలో జరుగనున్న స్వామివారి కల్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు వంటివి కొత్త ఈఓకు చాలెంజ్‌గా మారనున్నాయి.

క్లిష్టంగా పరిస్థితి

ఒకప్పుడు అనుభవం గలిగిన సిబ్బంది, మిగులు ఆదాయంతో కళకళలాడిన దేవస్థానంలో నేడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. గతంలో అనేక కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించిన చాలామంది సిబ్బంది పదవీ విరమణ చేశారు. మిగిలిన సిబ్బందిలో కార్యక్రమాలు సమర్థంగా నిర్వహించే చొరవ, అనుభవం లేకపోవడంతో తూతూ మంత్రంగా జరుగుతున్నాయన్న అభిప్రాయం భక్తుల నుంచి వినిపిస్తోంది.

వార్షికాదాయం రూ.157 కోట్లు

2025–26 ఆర్థిక సంవత్సరంలో దేవస్థానం ఆదాయం రూ.157 కోట్లు వచ్చింది. 2026–27 దేవస్థానం బడ్జెట్‌ రూ.180 కోట్లుగా ఖరారు చేశారు. ఐదేళ్ల క్రితమే దేవస్థానం ఆదాయం సుమారు రూ.150 కోట్లు. పది శాతం చొప్పున పెరిగినా ఈ ఐదేళ్లలో రూ.200 కోట్లుకు చేరుకోవాలి. కాని ఆ మేరకు పెరగలేదు. ఆదాయం పెరగకపోవడంతో బడ్జెట్‌ కూడా పెరగలేదు.

కీలక అధికార్లదీ ప్రేక్షక పాత్రే

ఇక్కడ కీలకంగా బాధ్యతలు నిర్వహించాల్సిన డిప్యూటీ కమిషనర్‌, అసిస్టెంట్‌ కమిషనర్‌ కేవలం అలంకార ప్రాయంగానే ఉంటున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అనుభవజ్ఞులైన సిబ్బంది లేకపోవడం, ఏ వ్యవహారమైనా చక్కదిద్దే భాధ్యత ఈఓ మీదనే ఉండడం తదితర కారణాల వల్ల గతంలో ఇక్కడ పనిచేసిన ఈఓలు బదిలీ చేయించుకుని వెళ్లిపోతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

220 మంది రెగ్యులర్‌ సిబ్బంది...

వేయికి పైగా తాత్కాలిక సిబ్బంది

దేవస్థానంలో రెగ్యులర్‌ సిబ్బంది 220 మంది ఉంటే ఎన్‌ఎంఆర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేయి కి పైగా ఉన్నారు. రెగ్యులర్‌ సిబ్బందిలో కూడా దాదాపు సగం మంది కారుణ్య నియామకాల ద్వారా నియమితులైనవారే. కీలకమైన పోస్టులలో కూడా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందినే నియమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవస్థానంలో ఒక ఏఈఓ, నాలుగు సూపరిండెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

మరో పది రోజుల్లో కల్యాణోత్సవాలు

ఈ నెల 26వ తేదీ నుంచి జరుగనున్న సత్యదేవుని కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. గురువారం కో ఆర్డినేషన్‌ సమావేశంలో ఏర్పాట్లపై సమీక్షించనున్నారు.

పెరిగిన రాజకీయ జోక్యం

దేవస్థానంలో ప్రతీ విషయంలో ప్రజాప్రతినిధుల అనుమతి తప్పనిసరి అనే ధోరణి ప్రబలింది. దీంతో చిన్న స్థాయి ఉద్యోగిని మరో సెక్షన్‌కు బదిలీ చేయాలన్నా ఈఓ సొంతంగా చేయలేని పరిస్థితి. ఈ పద్ధతి మారకపోతే ఇబ్బందే.

ప్రోసీడింగ్స్‌ ఇచ్చాక బాధ్యతల స్వీకరణ

మంగళవారం అంబేడ్కం జయంతి కావడంతో దేవదాయశాఖ కమిషనర్‌ ప్రోసీడింగ్స్‌ పంపించ లేదు. బుధవారం ఆదేశాలు వస్తాయని భావిస్తున్నారు. అవి రాగానే ఈఓ బాధ్యతలు స్వీకరిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement