తాళ్లపూడి: స్థానిక సాంఘిక సంక్షేమ వసతిగృహన్ని మంగళవారం కొవ్వూరు ఆర్డీవో ఆనందరావు తనిఖీ చేశారు. అక్కడ పరిస్థితులను గమనించిన ఆయన ఆశ్చర్యపోయారు. విద్యార్థులకు కనీసం రాష్ట్రపతి, ప్రధాని, ఆర్డీఓ, తహసీల్దార్ పేర్లు తెలియని పరిస్థితి నెలకొంది. హాస్టల్‌లో 23 మంది విద్యార్థులకు సగం మంది మాత్రమే ఉన్నారు. ఇక్కడ కొంతకాలంగా వార్డెన్‌తో పాటు పలువురు సిబ్బంది లేకుండానే హాస్టల్ నడుస్తోంది. నాలుగు నెలల క్రితం వచ్చిన కుక్ (వంటమనిషి) శివాజీ అన్ని తానై హాస్టల్‌ను నడుపుతున్నారు. వార్డెన్‌గా, వాచ్‌మెన్‌గా, కుక్‌గా శివాజీ పని చేయటంపై అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. తాళ్లపూడి తహసీల్దార్ లక్ష్మీలావణ్య, ఆర్‌ఐ రామకృష్ణ, వీఆర్వోలు ప్రకాష్, నాగేశ్వరరావు, సంజీవరావు, లీలావతి తనిఖీలో పాల్గొన్నారు.
సీఐటీయూ
నూతన కార్యవర్గం
ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం) : సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ (సీఐటీయూ) నూతన జిల్లా కమిటీ ఎన్నిక మంగవారం స్థానిక వైఏంఏ హాలులో జరిగింది. ఈ కమిటీలో తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఎం.సుందర్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బి.పవన్, జిల్లా కోశాధికారిగా కేఎస్‌వీ రామచంద్రరావు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్‌ఎస్. మూర్తి, టి.అరుణ్, సీహెచ్ మాణిక్యాంబ, కె.అన్నామణి, కె.రామకృష్ణ, కార్యదర్శులుగా కె.బేబీరాణి, బి.పూర్ణిమ రాజు, బి.భగత్, రణదీప్ సింగ్, గంటి కృష్ణ, ఎం.వెంకటలక్ష్మి ఎన్నికయ్యారు. వీరితోపాటు జిల్లా కమిటీ సభ్యులుగా 41 మంది ఎన్నికయ్యారు.
గృహోపకరణాలు దగ్ధం
తాళ్లరేవు: కోరంగి పంచాయతీ సీతారామపురం గ్రామంలో మంగళవారం రాత్రి రెడ్డి నాగరాజు ఇంటిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఇంట్లోని వారంతా టీవీ చూస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో టీవీతో పాటు ఏసీ తదితర గృహోపకరణాలు కాలిపోయాయి. గమనించిన స్థానికులు వెంటనే మంటలను అదుపుచేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సుమారు రూ.లక్షకు పైగా ఆస్తినష్టం సంభవించిందని బాధితులు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు వచ్చి ప్రమాదానికి గల కారణాలను పరిశీలించారు.
నిబంధనలు పాటించకుంటే
కఠిన చర్యలు
ముమ్మిడివరం: నిబంధనలు పాటించని ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా రవాణాధికారి (డీటీవో) దేవిశెట్టి శ్రీనివాస్ హెచ్చరించారు. ఆయన మంగళవారం అన్నంపల్లి టోల్ ప్లాజా వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను తనిఖీ చేశారు. యానాం నుంచి హైదరాబాద్ వెళుతున్న 23 బస్సుల్లో తనిఖీలు నిర్వహించారు. అగ్ని ప్రమాద నిరోధక పరికరాలు, అత్యవసర ద్వారం, ప్రయాణికుల లగేజీలను పరిశీలించారు. అతివేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పట్టుపడితే డ్రైవర్‌కు జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు. ఏదైనా ప్రమాదం సంభవించినప్పుడు బయటపడే మెళకువలను ప్రయాణికులకు వివరించారు. ఎంవీఐ సురేష్ కుమార్ పాల్గొన్నారు.
హాస్టల్ విద్యార్థులకు
’దివీస్’ విరాళం
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు కాకినాడ ఒంటిమామిడికి చెందిన దివీస్ ల్యాబ్‌రేటరీస్ లిమిటెడ్ సంస్థ రూ.3.10 కోట్ల విలువైన వస్తువులను విరాళంగా అందించినట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. మొదటి విడతగా 500 పరుపులను నాలుగు బీసీ హాస్టళ్లకు పంపే వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.


