బెట్టింగ్‌లో నష్టపోయి.. చోరీల బాట
● బంతి బంతికీ పందెమే..
● ఉత్కంఠ రేపుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లు
● యువతను బెట్టింగ్ ఉచ్చులోకి
దించుతున్న బుకీలు
● ఆన్‌లైన్, యాప్‌లతో వల
రాజమహేంద్రవరం రూరల్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 19వ సీజన్ గత నెల 28వ తేదీన ఆరంభమైంది. రెండు నెలల పాటు సాగే ఈ క్రికెట్ మ్యాచ్‌లు యువతలో ఉత్కంఠ రేపుతున్నాయి. మ్యాచ్‌లను ఆసక్తిగా తిలకిస్తూ, తమ అభిమాన జట్టు గెలుస్తుందన్న ధీమాతో బెట్టింగ్‌లు కాసేందుకు కొందరు క్రికెట్ అభిమానులు ఉత్సుకత చూపుతున్నారు. వారి బలహీనతను ఆసరాగా తీసుకుని పలువురు బుకీలు రంగంలోకి దిగారు. ఉమ్మడి తూర్పు గోదా వరి జిల్లావ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, పల్లెలు, మైదాన ప్రాంతం, మన్యసీమ అనే తేడా లేకుండా యువతకు ఆన్‌లైన్, రకరకాల యాప్‌లతో వల విసురుతున్నారు. రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురం, అనపర్తి, నిడదవోలు, పిఠాపురం, ఏలేశ్వరం, తుని, మండపేట, రామచంద్రపురం, కొవ్వూరుతో పాటు అనేక గ్రామాల్లో పలువురిని ఈ ఉచ్చులోకి దించుతున్నారు. టాస్ నుంచి బంతిబంతికీ బెట్టింగ్ కట్టేలా ఉసిగొల్పుతూ, నిలువునా దోచుకుంటున్నారు.
గెలిచినా డబ్బులు ఎగ్గొడుతూ..
ఐపీఎల్‌లో మొత్తం 75 మ్యాచ్‌లకు గాను హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, ముంబై జట్ల పైనే ఎక్కువ మంది బెట్టింగ్‌లు వేస్తున్నారు. ఇదే అదనుగా బుకీలు బెట్టింగ్ కాసేవారిని ముంచేస్తున్నారు. బెట్టింగ్‌లో కొన్నిసార్లు గెలిచినా డబ్బులు ఎగ్గొడుతున్నారు. అయినప్పటికీ అంతా ఆన్‌లైన్ కావడం, విషయం బయటకు తెలిస్తే ఇబ్బందులు ఎదురవుతాయన్న భయంతో చాలా మంది మిన్నకుండిపోతున్నారు. కొందరు బెట్టింగ్‌లకు ఇళ్లు, వాహనాలను, ఆభరణాలను సైతం తాకట్టు పెడుతున్న దాఖలాలున్నాయి.
అన్నింటికీ బెట్టింగే..
ఈ ఉచ్చులో చిక్కుకున్న వారు క్రికెట్ మ్యాచ్‌లు తిలకిస్తూనే బెట్టింగ్‌లో పాల్గొనేలా బుకీలు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా ఫోన్‌లోనే ప్రత్యేక కోడ్ భాషతో పందేలు కాయిస్తున్నారు. ఎస్, నో, ఓకే, డన్, రిపీట్ వంటి పదాలు వాడుతున్నారు. ఏ క్రికెటర్ ఎన్ని పరుగులు చేస్తారు.. ఆ ఓవర్‌లో ఎన్ని సిక్స్‌లు కొడతారు.. వికెట్లు తీస్తారు.. ఎన్ని పరుగులకు జట్టు అవుటవుతుంది వంటి అనేక అంశాలపై బెట్టింగ్‌లు సాగుతున్నాయి. బంతి బంతికీ ఉత్కంఠ రేపుతూ పందెం కాయిస్తున్నారు.
సెకన్ల తేడాతో..
వాస్తవానికి టీవీల్లో క్రికెట్ మ్యాచ్ చూసేవారికి కనీసం 10 నుంచి 80 సెకన్ల తేడాతో ప్రత్యక్ష ప్రసారం వస్తుంది. ఒక్కోసారి రెండు బంతుల సమయం కూడా తేడా ఉంటుంది. అయితే, బెట్టింగ్ బలహీనత ఉన్నవారు ఈ విషయాలు తెలుసుకోకుండా, తెలిసినా పెద్దగా పట్టించుకోకుండా పందేలు కాస్తున్నారు. ఇదే అదనుగా వారి జేబులకు బుకీలు కన్నం వేస్తున్నారు. రూ.100 కడితే రూ.1,000 ఇస్తామంటూ నమ్మించి పెద్ద మొత్తంలో సొమ్ము దోచుకుని నిలువునా ముంచేస్తున్నారు.
పోలీసు శాఖ హెచ్చరికలు
● బెట్టింగ్ అనేది పెనుభూతం లాంటిది. ఆశ చూపి అధఃపాతాళానికి నెట్టేస్తుంది. కుటుంబాలను రోడ్డు పాలు చేస్తుంది. కొందరి ప్రాణాలను సైతం తీస్తుంది.
● క్రికెట్‌ను అభిమానులు ఆస్వాదించాలే తప్ప బెట్టింగ్‌లకు పోరాదు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లతో జీవితాలను నాశనం చేసుకోవద్దు.
● బెట్టింగ్ కాస్తున్న వారిలో యువతే అధికంగా ఉంటున్నారు. కొందరు స్వార్థపరులు, చెడు నడత కలిగిన వ్యక్తులు క్రికెట్ బెట్టింగ్‌లకు తెర లేపే అవకాశం ఉంది. వారి మాటలు నమ్మరాదు.
● బెట్టింగ్‌లో ఒకసారి ఆదాయం వచ్చినా ఎక్కువసార్లు నష్టపోతారు. ఆ నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, చేసిన అప్పులను తీర్చడానికి యువత దొంగతనాలకు, ఇతర నేరాలకు పాల్పడుతూ, భవిష్యత్తును అంధకారమయం చేసుకుంటున్నారు.
● పిల్లలను తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలి. బెట్టింగులకు పాల్పడుతూంటే నచ్చజెప్పి వారిని ఆ ఊబిలో నుంచి బయటకు తీసుకురావాలి.
● బెట్టింగ్ నిర్వాహకులపై సస్పెక్ట్ షీట్లు తెరుస్తాం.
● ఎక్కడైనా క్రికెట్ బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలి స్తే 112, 100 లేదా సంబంధిత పోలీసు అధికారులకు ఫోను ద్వారా తెలియజేయాలి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం.
నిర్వాహకులపై నిఘా
క్రికెట్ బెట్టింగ్‌పై పూర్తి స్థాయిలో నిఘా పెట్టాం. గతంలో బెట్టింగ్ కేసులలో పట్టుబడిన నిందితుల ఫోన్లపై ఇప్పటికే నిఘా పెట్టాం. బెట్టింగ్‌లకు పాల్పడినా, ఇతరులను ప్రోత్సహించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఆన్‌లైన్, బెట్టింగ్ యాప్‌ల వలలో చిక్కుని జీవితాలను నాశనం చేసుకోవద్దు.
– డి.నరసింహ కిషోర్, ఎస్పీ,
తూర్పు గోదావరి జిల్లా
పలుచోట్ల దొంగతనాలు
యువకుడి అరెస్టు
రూ.12 లక్షల సొత్తు స్వాధీనం
రంపచోడవరం: క్రికెట్ బెట్టింగ్‌లకు అలవాటు పడి.. డబ్బులు పొగొట్టుకుని.. ఆ నష్టాల నుంచి బయట పడటానికి దొంగగా మారిన ఓ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. చింతూరు ఏఎస్పీ, రంపచోడవరం ఇన్‌చార్జి ఏఎస్పీ బి.హేమంత్ సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. అడ్డతీగల సీఐ బి.నరసింహమూర్తి, ఎస్సైలు అడ్డతీగల మండలం పాపంపేట వద్ద ఆదివారం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో కాకినాడ జిల్లా ఏలేశ్వరం పట్టణానికి చెందిన మజ్జి శివప్రసాద్ మోటార్ బైక్‌పై వస్తూండగా ఆపారు. అనుమానంతో తనిఖీ చేసి, ప్రశ్నించగా పోలవరం జిల్లా పరిధిలోని పలుచోట్ల 13 దొంగతనాలు చేసినట్లు అతడు అంగీకరించాడు. క్రికెట్ బెట్టింగ్‌కు అలవాటు పడి దాదాపు రూ.4 లక్షల వరకూ పోగొట్టుకున్న అతడు.. ఈ క్రమంలో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. మోటార్ బైక్‌పై ఉదయం వేళ గ్రామాల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తాడు. తాళాలు వేయకుండా ఉన్న ఇళ్లు, తాళాలు గుమ్మానికి తగిలించిన ఇళ్లను గుర్తించి, దొంతనాలకు పాల్పడుతున్నాడు. నిందితుడు శివప్రసాద్ నుంచి రూ.12 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పది జతల చెవి దిద్దులు, 5 చైన్లు, 14 ఉంగరాలు, ఒక జత మాటీలు, నల్లపూసలు వంటి వాటితో కలిపి మొత్తం 122.846 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటితో పాటు వెండి పట్టీలు, వెండి వినాయకుడు, లక్ష్మీదేవి, ఆవు–దూడ, తులసి చెట్టు బొమ్మలు, గుత్తి గ్లాసులు, కుంకుమ భరిణె తదితర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అడ్డతీగల కోర్టులో హాజరుపరిచారు. అతడిని పట్టుకోవడంలోను, చోరీ సొత్తు రికవరీలోను ప్రతిభ చూపిన సీఐ నరసింహమూర్తి, ఎస్సై బి.వినోద్, కానిస్టేబుళ్లు కె.రాంబాబు, కె.దుర్గాప్రసాద్, బి.సురేంద్ర, కె.నీలపురెడ్డిలను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారని ఏఎస్పీ హేమంత్ తెలిపారు.


