రాయవరం మండలం సోమేశ్వరంలో అగ్నికి ఆహుతి అవుతున్న ఇళ్లు (ఫైల్)
● వేసవిలో అగ్ని ప్రమాదాల ముప్పు
● అవగాహన, అప్రమత్తతే రక్ష
● ఏడాదిగా జిల్లాలో 468 అగ్నిప్రమాదాలు
● నేటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు
రాయవరం: ఇంకా గ్రీష్మ రుతువు రానేలేదు.. అప్పుడే సూరీడు దాదాపు 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో భగ్గుమంటున్నాడు. మే నెలను తలదన్నేటట్లు ప్రతాపం చూపుతున్నాడు. ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటుతాయంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. వివిధ కారణాలతో వేసవిలో సాధారణంగా అగ్ని ప్రమాదాల ముప్పు పొంచి ఉంటుంది. ఫలితంగా ఆస్తితో పాటు ఒక్కోసారి ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. జిల్లాలో అగ్నిమాపక కేంద్రాలు 20 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నప్పటికీ పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు నిమిషాల్లోనే నష్టం జరిగిపోతూంటుంది. ఈ నేపథ్యంలో వేసవిలో జరిగే అగ్ని ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఏటా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకూ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తూంటారు. 1994 ఏప్రిల్ 14న ముంబై ఓడరేవులో జరిగిన అగ్నిప్రమాదానికి గుర్తుగా ఏటా జాతీయ అగ్నిమాపక దినోత్సవం నిర్వహిస్తారు. జిల్లాలోని ఏడు అగ్నిమాపక కేంద్రాల పరిధిలో వారోత్సవాల నిర్వహణకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు.
ప్రమాదాలూ అధికమే..
వేసవిలో ఎక్కడ చూసినా అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూంటాయి. కొన్నిసార్లు ఒక్కో రోజు ఒక్కో ప్రాంతంలో రెండు మూడు ప్రమాదాలు కూడా జరుగుతాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకూ జిల్లావ్యాప్తంగా 468 అగ్ని ప్రమాదాలు సంభవించాయి. వీటిలో అతి భారీ ప్రమాదం ఒకటి, తీవ్రమైనవి (రూ.10 లక్షల పైన) 7, ఒక మోస్తరు (రూ.2 లక్షల నుంచి రూ.10 లక్షల లోపు) 36, చిన్నపాటివి 360 చొప్పున సంభవించాయి. ఈ అగ్ని ప్రమాదాల్లో మొత్తం రూ.7.92 కోట్ల మేర ఆస్తినష్టం సంభవించింది. రూ.27.89 కోట్ల ఆస్తిని అగ్నిమాపక సిబ్బంది కాపాడగలిగారు. అగ్ని ప్రమాదాల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, 15 మందిని రక్షించగలిగారు. రెస్క్యూ కాల్స్‌లో 20 మంది చనిపోగా, 11 మందిని అగ్నిమాపక సిబ్బంది కాపాడాగారు. జిల్లాలోని గోపాలపురం మినహా మిగిలిన ఆరు నియోజకవర్గ కేంద్రాల్లోనూ అగ్నిమాపక కేంద్రాలున్నాయి. గోపాలపురంలో స్థలం కేటాయింపు జరిగినా, బడ్జెట్ కేటాయించకపోవడంతో ఫైర్ స్టేషన్ నిర్మాణం చేపట్టలేదు. రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరులో అగ్నిమాపక కేంద్రం నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
అవగాహన కల్పిస్తున్నాం
అగ్ని ప్రమాదాలను అదుపు చేయడంతో పాటు ప్రమాదాలపై ముందస్తు అవగాహన కల్పిస్తున్నాం. అవసరమైన వారికి శిక్షణ ఇస్తున్నాం. వేసవిలో నిర్లక్ష్యంగా స్మోకింగ్ చేయడాన్ని నియంత్రించాలి. ఇంట్లో వంట చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. వోల్వో బస్సులలో జరిగే ప్రమాదాలపై అవగాహన కల్పిస్తాం.
– చిన్నం మార్టిన్ లూథర్‌కింగ్, జిల్లా విపత్తుల
స్పందన అధికారి, రాజమహేంద్రవరం
అగ్నిమాపక శకటం
ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు
గ్యాస్ స్టౌను సిలిండర్ కన్నా ఎత్తులో ఉంచాలి.
వాడుతున్న వంట గ్యాస్ సిలిండర్‌కు అదనపు సిలిండర్‌ను, కిరోసిన్, డీజిల్, పెట్రోల్‌ను దూరంగా ఉంచాలి.
చిన్నారులకు అగ్గిపెట్టెలు, లైటర్లు అందుబాటులో ఉంచరాదు.
వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్‌ను తప్పనిసరిగా ఆపివేయాలి.
ఐఎస్‌ఐ మార్కు ఉన్న ఎల్‌పీజీ సురక్ష ట్యూబులనే వాడాలి.
గ్యాస్ లీక్ అవుతున్న అనుమానం వస్తే కిటికీలు, తలుపులు వెంటనే తెరవాలి. ఎలక్ట్రికల్ స్విచ్ ఆన్, ఆఫ్ చేయరాదు.
ఒకే ఎలక్ట్రిక్ పాయింట్ వద్ద ఎక్కువ ప్లగ్గులు పెట్టరాదు.
ఇళ్లు వదిలి దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు విద్యుత్ మెయిన్ ఆపు చేయాలి.
విద్యుత్ పరికరాలకు నిప్పు అంటుకుంటే మెయిన్ ఆఫ్ చేసి పొడి ఇసుక లేదా డ్రై కెమికల్ పౌడర్ జల్లాలి.
కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పివేసి పారేయాలి.
ఎలక్ట్రిక్ పాయింట్లను ఓవర్‌లోడు చేయరాదు.
దుస్తులకు నిప్పు అంటుకుంటే పరుగెత్తరాదు. నేలపై దొర్లాలి లేదా దుప్పటి చుట్టుకోవాలి.
కాలిన శరీర భాగాల మీద చల్లని నీరు పోయాలి.
పొగతో నిండిన గదుల్లో మోచేతులు, మోకాళ్లపై పాకాలి.
గడ్డివాములను ఇళ్లకు తప్పనిసరిగా 60 అడుగుల దూరంలో వేసుకోవాలి. గడ్డివాములను సరైన గాలివాటంలో ఏర్పాటు చేసుకోవాలి.
గుడిసెకు గుడిసెకు మధ్య 30 అడుగుల దూరాన్ని పాటించాలి.
కర్మాగారాల్లో కార్మికులు పని చేసే స్థలాల్లో కనీసం రెండు ఫైర్ ఎగ్జిట్స్ ఏర్పాటు చేయాలి.
వారోత్సవాలు ఇలా..
ఈ నెల 14న అగ్నిమాపక దళ పతాకావిష్కరణ, విధి నిర్వహణలో అసువులు బాసిన సిబ్బందికి నివాళి, కరపత్రాల ఆవిష్కరణ.
15న బస్టాండ్, మాల్స్, మార్కెట్లు, సినిమా థియేటర్లు, మురికివాడల్లో అగ్నిమాపక పరికరాల ప్రదర్శన, అవగాహన కల్పించడం.
16న నివాస ప్రాంతాల్లో ముఖ్యంగా అపార్ట్‌మెంట్ల వద్ద ఎల్‌పీజీ సేఫ్టీ, నిర్లక్ష్యంగా పొగ తాగడం, అగ్నిమాపక నియంత్రణ పరికరాల వినియోగం, అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన.
17న విద్యా సంస్థల్లో మాక్ డ్రిల్.
18న ఎల్‌పీజీ నిల్వ ఉంచే విధానం, పరిశ్రమల్లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన.
19న ఆస్పత్రుల్లో వైద్యులు, స్టాఫ్ నర్సులు, రోగులకు అగ్నిమాపక నియంత్రణపై అవగాహన.
20న అంగన్‌వాడీ కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థల్లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన, వారోత్సవాల ముగింపు.
జిల్లాలో ఫైర్ స్టేషన్ల నంబర్లు
ఫైర్ స్టేషన్ ల్యాండ్ నంబరు
అనపర్తి 08856–227201
ఇన్నీస్‌పేట, రాజమహేంద్రవరం 08832–444101
కొవ్వూరు 08813–232101
మండపేట 08855–232101
కోరుకొండ 0883–2496101
నిడదవోలు 08813–221101


