కార్యకర్తకు రూ.లక్ష ఆర్థిక సాయం | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తకు రూ.లక్ష ఆర్థిక సాయం

Apr 14 2026 7:58 AM | Updated on Apr 14 2026 7:58 AM

కపిలేశ్వరపురం: ఎలక్ట్రికల్‌ పని చేస్తూండగా షాక్‌కు గురై, చేతిని కోల్పోయిన కపిలేశ్వరపురానికి చెందిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్త నాగాబత్తుల సుధీర్‌కు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మండలానికి చెందిన నాయకులు, కార్యకర్తలు రూ.1,00,500 ఆర్థిక సాయం సమకూర్చారు. ఆ మొత్తాన్ని సుధీర్‌కు ఆయన నివాసంలో ఎమ్మెల్సీ తోట చేతుల మీదుగా సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా సుధీర్‌కు, కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఏ కష్టమొచ్చినా తనను సంప్రదించవచ్చన్నారు. కష్టకాలంలో చేదోడువాదోడుగా నిలిచిన ఎమ్మెల్సీ తోటకు, పార్టీ నేతలు, కార్యకర్తలకు సుధీర్‌ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గూటం సత్యనారాయణ, గ్రామ కమిటీ అధ్యక్షుడు అంగాని నూకరాజు, వైస్‌ ఎంపీపీ గుణ్ణం భానుప్రసాద్‌, ఎంపీటీసీ సభ్యులు గొల్లపల్లి సోనియా, నాయకులు మేడిశెట్టి దుర్గారావు, కట్టా మురళి, పిప్పర సంపతరావు, కుడుపూడి విజయ్‌, చింతా పెద్దకాపు, కందుల శ్రీనివాస్‌, పాలింగి కృష్ణకిశోర్‌, శ్రీనివాస్‌, పీతల శ్రావణ్‌ కుమార్‌, నీతిపూడి శేఖర్‌, కన్నా శ్రీను, పెంటపాటి వెంకన్నబాబు, పలివెల మధు పాల్గొన్నారు.

ర్యాపిడో రైడర్ల సమస్యలు పరిష్కరించాలి

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): తమ సమస్యలు పరిష్కరించాలంటూ ర్యాపిడో రైడర్లు ఆ సంస్థ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా చేశారు. రైడర్లు రవీంద్ర, వంశీ మాట్లాడుతూ, ర్యాపిడో యాప్‌ ద్వారా రాత్రనక, పగలనక, ఎండనక, వాననక ఎంతో కష్టపడి తాము రైడ్స్‌ చేసి సంపాదిస్తున్న సొమ్మును యాజమాన్యం అడ్డంగా దోచుకుంటోందని మండిపడ్డారు. తమకు కంపెనీ నుంచి రావలసిన హెల్మెట్లు, టీషర్టులు ఇవ్వడం లేదని, రేట్‌ కార్డుల వంటి సదుపాయాలు కల్పించకపోగా.. తమ ఆదాయంలో జీఎస్‌టీ, కమీషన్‌ పేరిట అడ్డంగా వసూలు చేస్తున్నారని అన్నారు. చివరకు కస్టమర్లు ఇస్తున్న టిప్‌లో కూడా కమీషన్‌ కట్‌ చేస్తున్నారన్నారు. అదేమిటని ప్రశ్నిస్తే పైనుంచి వస్తున్న రూల్స్‌ అని, ఇష్టం ఉంటే చేయమని, లేదంటే మానేయాలని చెబుతున్నారన్నారు. ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి పి.త్రిమూర్తులు మాట్లాడుతూ, ర్యాపిడో రైడర్ల శ్రమను యాజమాన్యం దారుణంగా దోచుకుంటోందని ఆరోపించారు. బైక్‌ బూస్ట్‌ ఇంటర్‌ సిటీ పేరిట రాజమహేంద్రవరం నుంచి కాకినాడకు రూ.177, రావులపాలేనికి రూ.68, భీమవరానికి రూ.198 చార్జీ పెడుతూ రైడర్లను ఇబ్బంది పెడుతోందన్నారు. ఇకపై బైక్‌ బూస్ట్‌ ఇంటర్‌ సిటీలను రద్దు చేసి, సరైన రైడ్స్‌ కార్డు ప్రకటించాలని, రైల్వే స్టేషన్‌, ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద రైడర్లకు సరైన సదుపాయాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ర్యాపిడో యాప్‌ను రాజమహేంద్రవరంలో నిలిపివేయడానికి మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో 200 మందికి పైగా రైడర్లు పాల్గొన్నారు.

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు

43 ఫిర్యాదులు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమానికి 43 ఫిర్యాదులు వచ్చాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్‌ స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకుని, వెంటనే సంబంధిత స్టేషన్‌ పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఆ సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, బాధితులకు సత్వర న్యాయం అందించాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement