సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారంలో అలసత్వం చూపుతున్న అధికారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కీర్తి చేకూరి హెచ్చరించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్, రెవెన్యూ క్లినిక్‌లో జాయింట్ కలెక్టర్ మేఘస్వరూప్ తదితరులతో కలసి ప్రజల నుంచి ఆమె 183 అర్జీలు స్వీకరించారు. అనంతరం, అర్జీల పరిష్కార విధానం, పెండింగ్, ఐవీఆర్‌ఎస్ ఫీడ్‌బ్యాక్ తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో పీజీఆర్‌ఎస్ అర్జీల పరిష్కారంలో అలసత్వం చూపుతున్న ప్రభుత్వ శాఖల జాబితాను ముఖ్యమంత్రి కార్యాలయ పీజీఆర్‌ఎస్ విభాగం నుంచి పంపారన్నారు. ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యానికి గల కారణాలను ఆయా శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. జేసీ మేఘస్వరూప్ మాట్లాడుతూ, ఆయా అధికారుల విధి నిర్వహణలో ప్రవర్తనాపరమైన, విధానపరమైన లోటుపాట్లను గుర్తించామని, వెంటనే వాటిని సరిదిద్దుకోవాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంపై హడావుడిగా చర్యలు తీసుకునే విధానాన్ని మార్చుకోవాలని, ఏ రోజు వచ్చిన వాటిని ఆ రోజు చూస్తే పరిష్కారానికి తగిన సమయం ఉంటుందని అన్నారు. అర్జీ అందిన వెంటనే కింది స్థాయి అధికారులకు సూచనలు ఇస్తూ, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నూరు శాతం పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏదైనా అర్జీ తమ పరిధిలోకి రానప్పుడు సంబంధిత అధికారికి పంపించాలని జేసీ అన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ టి.సీతారామమూర్తి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.భాస్కర్‌రెడ్డి, రాజమహేంద్రవరం ఆర్‌డీఓ ఆర్.శివరాముడు తదితరులు పాల్గొన్నారు.


