ప్రకాశం నగర్ (రాజమహేంద్రవరం): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్లకు తాకట్టు పెడుతోందని, లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ప్రతిఘటననోద్యమాలు చేపట్టాల్సిన అవసరముందని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏవీ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. సీఐటీయూ 12వ జిల్లా మహాసభలు స్థానిక వైఎంఏ హాలులో సోమవారం ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొన్న నాగేశ్వరరావు మాట్లాడు తూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహజ వనరులను, కార్మికుల హక్కులను కార్పొరేట్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నాయని మండిపడ్డారు. అనేక దశాబ్దాలుగా భారత్‌కు ఇరాన్ మిత్రదేశంగా ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం పశ్చిమాసియా యుద్ధంపై నోరు మెదపకపోవటం శోచనీయమన్నారు. యుద్ధం ప్రభావంతో దేశంలో ఏర్పడిన గ్యాస్ కొరత వంటింట్లో చిచ్చు పెట్టడంతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు వ్యాపారాలు, భవన నిర్మాణం తదితర రంగాలపై తీవ్ర ప్రభావం చూపించిందని నాగేశ్వరరావు అన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ, పని గంటల పెంపు, వేతనాల కోత, పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ సౌకర్యాలను ప్రస్తావించకుండా రాత్రి వేళ పని వంటి చర్యలు కార్మికుల హక్కులపై తీవ్రమైన దాడిగా అభివర్ణించారు. మతం పేరుతో ప్రజల ఐక్యత మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇటీవల ఆకివీడు, గతంలో అంతర్వేది తదితర ఘటనలను గుర్తు చేశారు. ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొట్టి, రాజకీయ లబ్ధి పొందేందుకు కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎస్‌టీఎఫ్‌ఐ జాతీయ కార్యదర్శి అరుణ కుమారి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు టి.అరుణ్, ఎస్‌ఎస్ మూర్తి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జె.రాంబాబు, సీఐటీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.సుందరబాబు, బి.పవన్ తదితరులు పాల్గొన్నారు.


