ఇటీవల జరిగిన చోరీలు
● సామర్లకోట పట్టణంలో 15 రోజుల కిందట ఓ కుటుంబీకులు తమ ఇంటికి తాళాలు వేసి ఊరెళ్లారు. వారు ఇంటికి తిరిగి వచ్చేలోపు దొంగలు తమ పని కానిచ్చేశారు. 143 గ్రాముల బంగారు నగలు, రూ.50 వేల నగదు తస్కరించారు.
● తాళ్లరేవులో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన వరస చోరీలు ప్రజలను ఆందోళనకు గురిచేశాయి. ఒక స్టూడియో, రెండు ఇళ్లలో దొంగలు చొరబడి ఈ చోరీలు చేశారు. రూ. 1.50 లక్షలకు పైగా సొత్తును దోచుకున్నారు.
● అప్రమత్తతతో ‘వేసవి’ చోరీలకు చెక్
● అర్ధరాత్రి వేళ ఇళ్లు, షాపుల్లో జరిగే
అవకాశం
● ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను వినియోగించు
కోవాలంటున్న పోలీసులు
అమలాపురం టౌన్: వేసవి కాలం.. ఇంటి ఆరు బయట మంచాలు వేసుకుని చల్లని గాలిని ఆస్వాదిస్తూ నిద్రలోకి జారుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. ఆరుబయట నిద్రిస్తే ఇల్లును గుల్ల చేసే చోరీలు జరుగుతాయని జనం ఆందోళన చెందుతున్నారు. వేసవి కాలం వచ్చిందంటే ఏ ఇంట్లో కన్నం వేద్దామా అని దొంగలు పగలు రెక్కీ నిర్వహిస్తుంటారు. రాత్రి అయ్యాక రెక్కీలో గుర్తించిన ఇళ్లల్లో చోరీలు చేసేందుకు పక్కా ప్రణాళిక వేసుకుంటారు. జిల్లా కేంద్రాలైన రాజమహేంద్రవరం, కాకినాడ, అమలాపురంతో పాటు ఉమ్మడి జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో వేసవి చోరీలు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రజలే కాదు పోలీసులు కూడా ఈ చోరీల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్
వేసవి సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి పిల్లలను వెంటబెట్టుకుని కుటుంబ సమేతంగా బంధువుల ఇంటికో, గుళ్లు గోపురాలకో, విహార యాత్రకో వెళ్లడం సాధారణం. అలా తాళాలు వేసిన ఇళ్లనే దొంగలు టార్గెట్ చేస్తారు. వేసవి ఎండలకు పగలంతా అలసి సొలసి ఇంటికి తాళాలు వేయకుండా తలుపులు జారవేసి వీధిలో నిద్రించే ఇళ్లపై దొంగలు ప్రత్యేక దృష్టి పెడతారు. సీసీ కెమెరాల వ్యవస్థ ఉన్న కొన్ని షాపుల్లో కూడా చోరీలు జరుగుతున్నాయి. కొందరు దొంగలు సీసీ కెమెరాలకు తమ పోలికలు దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటుంటే మరికొందరు సీసీ పుటేజీలకు చిక్కి కొద్దిరోజులకు పోలీసులకు పట్టుబడుతున్నారు.
ఇవీ జాగ్రత్తలు..
ఇంటికి తాళాలు వేసి ఊరు వెళ్లేవారు రోజూ రాత్రి అయ్యే సరికి ఇంటి బయట, వెనుక వైపు లైట్లు వెలిగేలా ఏర్పాట్లు చేసుకోవాలి. అలా రోజూ రాత్రి లైట్లు వేసేందుకు ఇరుగుపొరుగు వారి సహకారం తీసుకోవాలి.
● ఇంటి ప్రధాన ద్వారానికి తాళం వేసినట్టు దొంగలకు తెలియకుండా గుమ్మానికి ఉన్న తాళం కనిపించకుండా విధిగా కర్టెన్ వేయాలి.
● ఇంటి ఇరుగు పొరుగున ఉండే వారిలో మీతో నమ్మకంగా ఉన్న వ్యక్తికి ఇంటిని చూస్తూ ఉండే బాధ్యతలు అప్పగించాలి.
● ఇంట్లో విలువైన నగలు, నగదు తదితర వస్తువులను బ్యాంక్ లాకర్లలో పెట్టుకోవడమో లేదా ఎవరికై నా తెలుసున్న బంధువులు లేదా స్నేహితులకు అప్పగించడమో చేసి ఊరు వెళ్లాలి.
‘ఎల్‌హెచ్‌ఎంఎస్’ ఉచిత అధికారిక సేవ
లాక్డ్ హౌస్ మోనటరింగ్ సిస్టమ్’ (ఎల్‌హెచ్‌ఎంఎస్) పోలీసులు ఇళ్లకు కల్పించే ఉచిత అధికారిక సేవ. ఎవరైనా తమ ఇళ్లకు తాళాలు వేసి ఊరెళితే సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం లేదా పోలీసులకు ఫోన్ చేసి ఎల్‌హెచ్‌ఎంఎస్‌ను అభ్యర్థించాలి. ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్‌ను డోన్ లౌడ్ చేసుకుంటే దాని గురించి పూర్తి అవగాహన కలుగుతుంది. ఈ సౌకర్యాన్ని తమ ఇళ్లకు ఏర్పాటు చేయించుకుంటే 24 గంటలూ ఆ ఇళ్లను పోలీసులు ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తారు. ఈ విధానం తమ ఇళ్లకు ఓ రక్షణ కవచంగా నిలుస్తుంది. ఈ సిస్టమ్‌ను అభ్యర్థిస్తే పోలీసులే ఇళ్లకు వచ్చి ఆ సిస్టమ్‌ను అమర్చుతారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారంతా ఎల్‌హెచ్‌ఎంఎస్ ఉపయోగించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వేసవి కాలంలో అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగే చోరీలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వేసవి సెలవుల్లో ఊరు వెళ్లే వారు ఇళ్లకు పటిష్టమైన తాళాలు వేసుకోవాలి. ఆరు బయట నిద్రించేవారు తమ ఆస్తులను భద్రపరచుకోవాలి.
– టీఎస్‌ఆర్‌కే ప్రసాద్,
డీఎస్పీ, అమలాపురం


