● జనసేన నేతపై పోలీసులకు
మహిళల ఫిర్యాదు
● బాధితులకు అండగా కులసంఘాలు
రామచంద్రాపురం (కాజులూరు): న్యాయం కోసం వెళ్లిన తమతో కాజులూరుకు చెందిన జనసేన నాయకుడు అన్యం శ్రీరామచంద్రమూర్తి (అన్యం శ్రీరామ్) అవమానకరంగా ప్రవర్తించాడని, కులంపేరుతో దూషించి ఇంటి నుంచి నెట్టివేశాడని అదే గ్రామానికి చెందిన సన్నపు లక్ష్మి, ఆకుల నాగదేవి శనివారం రాత్రి గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాల ప్రకారం.. ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన సన్నపు లక్ష్మి భర్త, కాపు సామాజిక వర్గానికి చెందిన ఆకుల నాగదేవి భర్త ఆ గ్రామానికి చెందిన సుబ్బారావుతో కలిసి టైల్స్ వ్యాపారం చేస్తున్నారు. అయితే వ్యాపార లావాదేవీల్లో సుబ్బారావుతో వివాదాలు రావడంతో ఆ ఇద్దరు మహిళలు గురువారం జనసేన పార్టీకి చెందిన అన్యం శ్రీరామ్ వద్దకు తగవు తీర్చాలని వెళ్లారు. మందుగా ఆకుల నాగదేవి ఇంటి తలుపుకొట్టి పిలవగా.. బయటకు వచ్చిన అన్యం శ్రీరామ్ ఆమెతో మాలలతో మీకు వ్యాపారాలు ఏమిటి, అంతలా దిగజారిపోయారా అంటూ హేళనగా మాట్లాడాడు. దీంతో పక్కనే ఉన్న సన్నపు లక్ష్మి కలుగజేసుకుని కాపులకు మాలల ఓట్లు కావాలి కానీ, మాలలతో కాపులు వ్యాపారాలు చెయ్యకూడదా అని ప్రశ్నించింది. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాలలకు తాను తగవు చెప్పనంటూ, కులం పేరుతో దుర్భాషలాడుతూ వారిని బయటకు నెట్టేసి తలుపులు వేసుకున్నాడు. జరిగిన సంఘటన చెప్పి తమకు న్యాయం చేయాలని పలువురు స్థానికులను కోరినా ఎవ్వరూ పట్టించుకోలేదని, దీంతో తమ కుల సంఘాల నాయకులను ఆశ్రయించి వారి సహకారంతో పోలీసులకు ఫిర్యాదులు చేశామన్నారు. కాగా.. జైభీమ్ పార్టీ అధ్యక్షుడు ఏనుగుపల్లి కృష్ణ, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు మాత సుబ్రహ్మణ్యం, బుల్లిరాజు తదితరులు బాధితులకు బాసటగా పోలీస్టేషన్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


