బాణసంచా తయారీకి అనుమతించాలి | - | Sakshi
Sakshi News home page

బాణసంచా తయారీకి అనుమతించాలి

Apr 13 2026 7:38 AM | Updated on Apr 13 2026 7:38 AM

ఉపాధి లేక రోడ్డున పడ్డాం

లైసెన్సులు పునరుద్ధరించాలి

తయారీదారుల సంఘ

ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌

కరప: బాణసంచా తయారీ కేంద్రాల లైసెన్సులను పునరుద్ధరించి, తయారు చేయడానికి అనుమతించి, తమకు జీవనోపాధి కల్పించాలని ఆ సంఘ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కొప్పిశెట్టి శ్రీనివాస్‌ కోరారు. కరప మండలం వేళంగిలో ఆదివారం ఆ సంఘ ఉపాధ్యక్షుడు వినకోటి శ్రీనివాస్‌ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బాణసంచా తయారీ దారుల సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ మాట్లాడుతూ వేట్లపాలెంలో జరిగిన బాణసంచా పేలుడు దుర్ఘటన కారణంగా తయారీ దారుల లైసెన్సులను రద్దు చేసి, తయారీని నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారన్నారు. దీనివల్ల ఈ పరిశ్రమపై ఆధార పడిన వందల మంది కార్మికులు, యజమానులు ఉపాధి లేక రోడ్డున పడ్డారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 115 లైసెన్సు కలిగిన బాణసంచా తయారీ షాపులుండగా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 60 ఉన్నాయన్నారు. వీటిలో పనిచేసే కార్మికులతో పాటూ యజమానులు కూడా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వేట్లపాలెం విస్పోటానికి కారకుడైన లైసెన్సుదారుడిని తూర్పు, పశ్చిమ, విశాఖ జిల్లా బాణసంచా ఓనర్స్‌ సంక్షేమ సంఘం నుంచి బహిష్కరించామని, ఆ ఘటన మానవ తప్పిదం వల్లనే జరిగిందన్నారు. అనుమతికి మించి స్టాకును తయారు చేయడమే ప్రమాదానికి కారణమని, దానిని తమ సంఘం వ్యతిరేకిస్తోందన్నారు. వేట్లపాలెం షాపును సీజ్‌ చేసి, మిగిలిన షాపులకు అనుమతించాలని కోరారు. తయారీ సమయంలో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తామని హామీ ఇచ్చారు. సంఘ ఉపాధ్యక్షుడు వినకోటి శ్రీనివాస్‌ మాట్లాడుతూ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాపారాలు కొనసాగేలా అధికారులు, ప్రభుత్వం స్పందించి, లైసెన్సులను పునరుద్ధరించాలని కోరారు. సమావేశానికి వివిధ జిల్లాల నుంచి బాషా, బాబ్జీ, గోపి, కంభంపాటి రమణ, రమణ, చంద్ర, వేల్పుకొండ సత్తిబాబు తదితరులు హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement