పెరవలి: జిల్లాలో నవధాన్యాల సాగు పెంచేందుకు అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగా గత ఏడాది 40 వేల ఎకరాల్లో ఈ పంటలు వేస్తే ఈ ఏడాది 54 వేల ఎకరాల్లో, 45 వేల మంది రైతులతో సాగుకు సమాయత్తమవుతున్నారు. ఇందుకు 30 రకాల నవరత్న ధాన్యాలను కిట్లను రైతులకు అందించేందుకు రంగం సిద్ధం చేశారు. కిట్టు రూ.850 నుంచి రూ.వెయ్యికి అందిస్తూ 309 గ్రామాలను ఈ సాగుకు ఎంపిక చేశారు. ఈ కిట్ల తయారీకి అవసరమైన పెట్టుబడిని సొసైటీల ద్వారా రూ.1.5 కోట్లు, మహిళా సంఘాల ద్వారా రూ.2 లక్షల చొప్పున, ఉన్నతి పథకం ద్వారా ఒకొక్కరికి రూ.50 వేల చొప్పున తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 10 వేల కిట్లు తయారు చేసి రైతులకు ఐదు వేల కిట్లు అందజేశారు. దీని వలన భూసారం పెరగటంతో పాటు రైతులకు పంటల ద్వారా లబ్ధి చేకూరనుంది.
లక్ష్యం ఇదీ..
జిల్లాలో 54 వేల ఎకరాల్లో 45 వేల మంది రైతులతో నవధాన్యాల సాగు చేపట్టాలన్నది లక్ష్యం. ఇందు కోసం వ్యవసాయ అనుభంద శాఖలతో పాటు వెలుగు, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులను సన్నద్ధం చేస్తున్నారు. ప్రకృతి సాగు ద్వారా నేలను సారవంతం చేసి, పెట్టుబడి ఖర్చు తగ్గించి, పంట దిగుబడి పెంచేలా దృష్టిసారించారు. నవధాన్యాల్లో పెసలు, పిల్లిపెసర, మినుము, జీలుగ, జనుము, కొర్రలు, సామలు, బొబ్బర్లు, కందులు, సజ్జలు, నువ్వులు ఇలా 30 రకాల ధాన్యాలతో సాగు చేసి భూమికి సారం పెంచనున్నారు. దీనివల్ల పశువులకు మేత కూడా సమకూరే అవకాశం ఉంటుంది.
రైతులకు అదనపు ఆదాయం
నవధాన్యాల పంటల సాగుతో రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. ఉదాహరణకు ఒక రైతు ఎకరం పొలంలో నవ్వులు సాగు చేస్తే దిగుబడి 250 నుంచి 300 కిలోలు వస్తాయి. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం కిలో రూ.250 చొప్పున 250 కిలోలకు రూ.62,500 ఉంది. ఖర్చులు, పెట్టుబడి పోను ఎకరానికి రూ.25 వేలు మిగులుతుంది. అదే మినుము సాగు చేస్తే ఎకరానికి దిగుబడి 400 నుండి 700 కిలోలు వస్తుంది. మార్కెట్ ధర ప్రకారం క్వింటా రూ.6 వేల చొప్పున 5 క్వింటాళ్లకు రూ.30 వేల ఆదాయం వస్తుంది. పెసలు ఎకరానికి దిగుబడి 500 నుండి 600 కిలోలు వస్తుంది. మార్కెట్టు రేటు ప్రకారం క్వింటాకి రూ.8 వేలు చొప్పున రూ.40 వేలు వస్తుంది. ఇందులో ఖర్చులు సగానికి సగం పోగా సగం సొమ్ము రైతులకు మిగులు తుంది. అంతే కాకుండా ఈ పంటల వలన ఎకరానికి పచ్చిరొట్ట రూపేణా 10 టన్నులు ఎరువు లభ్యం అవుతుంది.
సాగుతో లాభాలిలా..
జీవ వైవిధ్యం పెంపు.
బహుళ పంటలతో
365 రోజుల పాటు సాగు.
నేలలో సేంద్రియ కర్బనాల శాతం వృద్ధి.
భూమిలో సూక్ష్మజీవులు వృద్ధి చెంది
ప్రధాన పంటకు ఉపయుక్తం కావడం.
కలుపు ఉండదు. నేల కోతకు గురి కాదు.
నేల గుల్లబారి, వానపాముల వృద్ధి.
నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుదల.
రైతులకు అదనపు ఆదాయం.
రసాయన ఎరువులు,
మందుల అవసరం ఉండదు.
దిగుబడులు పెరగడం
జిల్లాలో విస్తీర్ణం ఇలా
గత సార్వాలో 40 వేల ఎకరాలలో సాగు
రైతులు 36 వేలు
ప్రస్తుత లక్ష్యం 54 వేల ఎకరాలు
రైతులు 45 వేలు
నవధాన్యాల సాగుకు పక్కా ప్రణాళిక
మూడో పంటగా వేసేందుకు సమాయత్తం
జిల్లాలో 54 వేల ఎకరాల్లో పంపిణీకి పది వేల కిట్లు సిద్ధం
309 గ్రామాల్లో రైతులకు అవగాహన
రైతులకు అదనపు ఆదాయం
జిల్లాలో నవధాన్యాల సాగు విస్తీర్ణం 54 వేల ఎకరాలకు పెంచాలనే లక్ష్యంతో ప్రణాళిక రూపొందించాం. ఇందుకు జిల్లాలో 309 గ్రామాలు ఎంపిక చేశాం. ఈ సాగు వల్ల రైతులకు అదనపు ఆదాయంతో పాటు పంట భూములకు ఎరువు లభ్యమై భూసారం పెరుగుతుంది.
– తాతారావు, ప్రాజెక్టు మేనేజర్,
జిల్లా సేంద్రియ వ్యవసాయ శాఖ


