18న సీఎం చంద్రబాబు పర్యటన | - | Sakshi
Sakshi News home page

18న సీఎం చంద్రబాబు పర్యటన

Apr 12 2026 3:48 AM | Updated on Apr 12 2026 3:48 AM

నిడదవోలు: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మూడో శనివారం నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర’లో భాగంగా ఈ నెల 18న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిడదవోలు పర్యటనకు రానున్నారని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ వెల్లడించారు. ఈ మేరకు ఆయన స్థానిక ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రజావేదిక కోసం పటిక ఫ్యాక్టరీ వద్ద స్థలాన్ని ప్రతిపాదించారు. హెలీప్యాడ్‌ కోసం పంగిడి రోడ్డులోని బ్రాహ్మణగూడెం ప్రాంతాలను పరిశీలించామన్నారు.

‘జయలక్ష్మి’ బాధితుల దీక్షల విరమణ

కాకినాడ రూరల్‌: సర్పవరం జంక్షన్‌లోని జయలక్ష్మి సొసైటీ మెయిన్‌ బ్రాంచ్‌ ఎదుట ఆ సభ్యుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిప్పల సూర్య శంకరం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం విరమించారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ నెల ఒకటో తేదీన ప్రారంభించిన దీక్షలకు అధికారులు స్పందించారు. జిల్లా సహకార అఽధికారి బి.శ్రీనివాసరెడ్డి తీసుకుంటున్న చర్యలను సొసైటీ అధ్యక్షుడు గంగిరెడ్డి త్రినాథరావుకు ఈ నెల 9న లేఖ ద్వారా వివరించి దీక్షలు విరమించాలని కోరారు. అప్పటి వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం సిట్‌ దర్యాప్తుతో పాటు సీఐడీతో విచారణ చేయించిన విషయం తెలిసిందే. వయసు మీద పడి చాలా మంది డిపాజిటర్లు చనిపోతుండడంతో తక్షణ న్యాయం కోరుతూ సభ్యులు రిలే దీక్షలు చేపట్టారు. శనివారం దీక్షలో కూర్చున్న పైడికొండల హనుమంతరావు, దేవికుమారిలతో సొసైటీ అధ్యక్షుడు త్రినాథరావు చర్చలు జరిపి ఒప్పించడంతో మధ్యాహ్నం దీక్షను విరమించారు. చైర్మన్‌ త్రినాథరావు మాట్లాడుతూ సొసైటీ బాధితులకు సాయం చేయాలని, ముందుగా రూ.200 కోట్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ఎంపీలకు, కలెక్టర్‌, తదితరులకు వినతి పత్రాలు ఇచ్చామని వివరించారు. చట్ట పరమైన చర్యలు తీసుకుంటున్నామని డీసీఓ తెలియజేయడంతో పాటు ఎండలో దీక్షలు వద్దని అభ్యర్థించిన మేరకు దీక్ష విరమింపజేశామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement