ఫ చంద్రబాబు తీరుతో నేతన్నల కష్టాలు
ఫ గుదిబండలా ఆప్కో, ఇతర బకాయిలు
ఫ అమలుకాని రూ.25 వేల ఆర్థిక సాయం
ఫ మగ్గం నుంచి ఉద్యమంలోకి..
ఫ కాకినాడలో ఈ నెల 13 నుంచి దీక్షలు
కపిలేశ్వరపురం: నూలు నుంచి దారం తీసి దుస్తులు నేసే చేనేత కార్మికులను చంద్రబాబు పాలనలో కష్టాలు చుట్టుముట్టాయి. ఆప్కో, ఇతర సంస్థల నుంచి బకాయిల పేరుకుపోవడంతో వారికి ఉపాధి కరువవుతోంది. తద్వారా బతకడానికి ఆధారం లేకుండా పోతోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేనేత రంగానికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చి, నేత కార్మికుల సంక్షేమానికి కృషి చేశారు. కానీ చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రంగాన్ని పూర్తిగా విస్మరించింది. చేనేత రంగానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు నెరవేర్చకపోవడంతో నేత కార్మికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తమ సమస్యలను ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో సోమవారం నుంచి కాకినాడలో రిలే దీక్షలు చేయనున్నారు.
సంఘాలపై నిర్లక్ష్యం
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 22 నెలలు అవుతోంది. చేనేత స్టాళ్ల పేరుతో ప్రజాప్రతినిధులు, అధికారులు హడావుడి చేయడం తప్ప చేనేత సంఘాల పటిష్టతకు ఇప్పటి వరకూ చేసిందేమీ లేదు. నేతన్నకు పనే లేకుండా చేసిన చంద్రబాబు ప్రభుత్వం రూ.200 ఉచిత విద్యుత్ కల్పిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.203 కోట్ల ఆప్కో, ప్రభుత్వ బకాయిలు సంగతేమిటన్నప్పుడు మాత్రం మాట్లాడడం లేదు. ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ నిర్లక్ష్య ధోరణికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని చేనేత సంఘాలు తీవ్రంగా నష్టపోతున్నాయి.
కూటమి హామీలు గాలికి..
2024 ఎన్నికల ప్రచార సమయంలో కూటమి నేతలు మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో చేసిన సాయానికి మించి చేనేత కార్మికులకు అందిస్తామని, చేనేత రంగాన్ని పరిరక్షిస్తామంటూ హామీలు ఇచ్చారు. తీరా చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో ప్రధాన హామీలను అమలు చేసిన పాపానపోలేదు. చేనేత సంఘాల బకాయిలు చెల్లించలేదు, కార్మి క కుటుంబాలకు ఆర్థిక సాయం చేయలేదు. నేతన్న నేస్తం కింద జగన్ ప్రభుత్వం రూ.24 వేలు ఇచ్చిందని, తాము అధికారంలోకి వస్తే రూ.25 వేల సాయమందిస్తామన్న హామీని సైతం గాలికి వదిలేశారు. అలాగే చేనేత ఉత్పత్తుల విక్రయాలకు మార్గాలను అన్వేషించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు.
ఉద్యమబాట
ప్రభుత్వ తీరుతో విసిగిపోయిన చేనేత కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమబాట పడుతున్నారు. ఏపీ చేనేత సహకార సంఘాల జేఏసీ, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం నుంచి ఉమ్మడి జిల్లాలోని నేత కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. కాగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేనేత రంగాన్ని విస్మరించడంతో ఏపీ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 16 భాగస్వామ్య సంఘాలతో కలిసి చేనేత గర్జన పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరి 22న చలో మంగళగిరి పేరుతో నిరసన ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. ఆ సందర్భంగా నేతన్నలు చేసిన డిమాండ్లను సైతం ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు.
మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం అంగరలోని గణపతి చేనేత పారిశ్రామికుల సహకార సంఘానికి ఆప్కో, ప్రభుత్వం నుంచి వివిధ పథకాల ద్వారా రూ.3.85 కోట్ల బకాయిలు జమ కావాల్సి ఉంది. వాటిని చెల్లించాలంటూ 2025 సెప్టెంబర్, అక్టోబర్‌లలో 14 రోజుల పాటు ఆ సంఘ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఆ సందర్భంగా అంగర, పడమర ఖండ్రిక గ్రామాల్లో భారీ ర్యాలీలు చేస్తూ తమ గోడును ప్రజలకు చెప్పుకున్నారు. అక్టోబర్ 11న జిల్లాకు చెందిన కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వయంగా వచ్చి అక్టోబర్ ననెలాఖరు నాటికి బకాయిలు చెల్లిస్తామంటూ హామీ ఇచ్చి దీక్షలను విరమింపజేశారు. ఇప్పటికి ఐదున్నర నెలలు గడుస్తున్నా పాక్షిక చెల్లింపులు తప్ప హామీని నెరవేర్చలేదు.
● సంఘాల నిర్వహణ కష్టం
ఆప్కో, ప్రభుత్వం నుంచి చేనేత సంఘాలకు జమ చేయాల్సిన వివిధ రకాల బకాయిలను దీర్ఘకాలంగా చెల్లించడం లేదు. ఆ బకాయిలు గుదిబండలా మారడంతో సంఘాల నిర్వహణ కష్టంగా మారింది. నేత కార్మికులకు ఉపాధి చూపలేని స్థితి నెలకొంది.
– పప్పు దుర్గా రమేష్, చైర్మన్, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్, కాకినాడ
చేనేత పరిశ్రమ వివరాలు
జిల్లా చేనేత మగ్గాలు కార్మికులు
సంఘాలు
తూర్పు 16 1,510 3,890
గోదావరి
కాకినాడ 18 2,809 4,430
కోనసీమ 16 4,570 8,010
మొత్తం 50 8,889 16,330
హామీ ఇచ్చి.. ఆచరణలో మరచి..
జగన్ పాలనలో స్వర్ణయుగం
వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో 2019–24 మధ్య మాజీ ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో చేనేత రంగానికి కొత్త ఊపిరి వచ్చింది. చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేల చొప్పున నేతన్న నేస్తం పేరుతో ఆర్థిక సాయాన్ని నేరుగా నేతన్న బ్యాంకు ఖాతాకు జమ చేశారు. కరోనా మహమ్మారి సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు కూడా ఈ సాయాన్ని కొనసాగించారు. ఒక విడత ఆర్థిక సాయాన్ని షెడ్యూల్‌కు ముందే ఖాతాలకు జమ చేశారు. జగన్ హయాంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 4,408, తూర్పుగోదావరిలో 916, కాకినాడ జిల్లాలో 2,776 కుటుంబాలు నేతన్న నేస్తం సాయాన్ని పొందేవి.


