ఫ భక్తులతో కిక్కిరిసిన కోనసీమ తిరుపతి
ఫ స్వామివారికి ప్రత్యేక పూజలు
ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి శనివారం అశేష భక్తజనం తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారితో తెల్లవారుజాము నుంచి ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. ముందుగా గౌతమీ గోదావరిలో స్నానాలు ఆచరించి, క్యూలో నిలబడి స్వామిని దర్శించుకుఏన్నారు. నూతన వధూవరులు పెళ్లి దుస్తుల్లో మాఢ వీధులలో ఏడు ప్రదక్షిణలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు. కాగా.. ఆలయంలో వేకువ జామునే సుప్రభాత సేవ, తొలి హారతి, నిరాజనం, ఐశ్వర్య లక్ష్మీ హోమం, బాలభోగం వంటి కార్యక్రమాలను ఆలయ అర్చకులు, వేద పండితులు ఘనంగా నిర్వహించారు. దేవస్థానం తరఫున భక్తులకు అన్న ప్రసాదం పంపిణీ చేశారు. వేసవి నేపథ్యంలో చల్లని మజ్జిగ అందజేశారు. ఆలయ ఈవో, దేవదాయశాఖ ఉప కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు, ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. శనివారం ఒక్కరోజే దేవస్థానానికి రూ.71,26,678 ఆదాయం సమకూరింది.


