ఫ సత్యదేవుని దర్శించిన 40 వేల మంది
ఫ స్వామివారి ఆదాయం రూ.40 లక్షలు
అన్నవరం: ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరంలోని వీర వేంకట సత్యనారాయణస్వామివారి ఆలయానికి శనివారం వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. రత్నగిరిపై, రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్దసంఖ్యలో వివాహాలు జరిగాయి. ఈ నేపథ్యంలో నవదంపతులు, వారి బంధువులు సత్యదేవుని దర్శనానికి తరలి వచ్చారు. అలాగే శనివారం రాత్రి, ఆదివారం తెల్లవారుజామున కూడా వివాహాలు ఉండడంతో, వాటికి హాజరయ్యేందుకు శనివారం మధ్యా హ్నం నుంచి పెళ్లి బృందాలు విచ్చేశాయి. వీరికి సాధారణ భక్తులు తోడవడంతో ఉదయం నుంచి రాత్రి వరకు కూడా రత్నగిరిపై రద్దీ కొనసాగింది. సుమారు 40 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి విచ్చేయడంతో క్యూలైన్లు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం నిండిపోయాయి. సత్యదేవుని దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట సమయం పట్టింది. సత్యదేవుని దర్శించిన భక్తులు సప్తగోకులంలో శ్రీకృష్ణుడు, గోవులకు ప్రదక్షిణచేశారు. సర్క్యులర్ మండపం వద్ద సుమారు ఐదు వేల మంది భక్తులకు పులిహోర, దద్దోజనం పంచిపెట్టారు. భక్తులు సత్యదేవుని వ్రతాలు రెండు వేలు ఆచరించారు. శనివారం దేవస్థానానికి రూ. 40 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు.


