అప్పులిచ్చి మోసపోయిన వ్యక్తి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అప్పులిచ్చి మోసపోయిన వ్యక్తి ఆత్మహత్య

Apr 11 2026 8:16 AM | Updated on Apr 11 2026 8:16 AM

పెట్రోల్‌ పోసుకుని బలవన్మరణం

ఎమ్మెల్యే అనుచరుడి అండతో నయవంచనే కారణం

తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఘటన

ధవళేశ్వరం: తన వద్ద అప్పులు తీసుకున్న వారు తనను మోసం చేశారని, ఎమ్మెల్యే అనుచరుడి అండతోనే తనకు అన్యాయం జరిగిందంటూ ఓ వ్యక్తి తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో ఈ ఘటన వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం..

ధవళేశ్వరంలోని వెలుగుబంటి గార్డెన్స్‌ రైల్వేట్రాక్‌ పక్కన గురువారం మధ్యాహ్నం ఒక వ్యక్తి నిప్పంటించుకుని చనిపోయినట్లు వీఆర్‌ఓ సూర్యకుమారి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి వెళ్లి చూడగా అప్పటికే అతడు పూర్తిగా కాలిపోయి మృతిచెందాడు. ఘటనా స్థలం వద్ద పెట్రోల్‌ తెచ్చేందుకు ఉపయోగించిన కవర్లు, ఒక బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని వస్తువులు పరిశీలించగా మృతుడు అల్లూరి జిల్లా అడ్డతీగలకు చెందిన గోగినేని జయకిషన్‌ (55)గా వారు గుర్తించారు.

ఎమ్మెల్యే అనుచరుడి అండతోనే..

అయితే, అప్పుల బాధ తాళలేక బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు ఆత్మహత్యకు ముందు జయకిషన్‌ సోషల్‌ మీడియాలో వీడియో పోస్టుచేశాడు. తనను నమ్మించి అప్పులు తీసుకున్న వారు మోసం చేశారని, తనకు న్యాయం చేయాలని మంత్రి లోకేశ్‌ను కోరుతూ వీడియోను విడుదల చేశాడు. స్థానిక ఎమ్మెల్యే అనుచరుడి అండతోనే తనకు అన్యాయం జరిగిందని ఆ వీడియోలో పేర్కొన్నాడు.

అడ్డతీగలలో ఆత్మహత్య చేసుకుంటే కేసు నీరుగారుస్తారన్న భయంతో ఇక్కడికొచ్చి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు అందులో వివరించాడు. జయకిషన్‌ మృతదేహాన్ని రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు 15 ఏళ్లుగా జయకిషన్‌కు దూరంగా ఉంటున్నారు. సమాచారం ఇచ్చినప్పటికీ వారెవరూ రాకపోవడంతో పోస్టుమార్టం పూర్తికాలేదు. ధవళేశ్వరం సీఐ టి.గణేష్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement