కపిలేశ్వరపురం: రాష్ట్రంలో ప్రజలందరూ తెలుగు సంవత్సరాది ఉగాది కోసం ఎదురు చూస్తున్నారు. వీరితో పాటూ నిరుద్యోగ యువత కూడా ఈ పండగపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. విద్యాశాఖమంత్రి చినబాబు (లోకేష్) ఉగాదికి జాబ్ క్యాలెండర్‌ను ప్రకటిస్తామని చెప్పడమే దీనికి కారణం. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 99 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేసి తమ చిన్ని ఆశను చినబాబు తీర్చాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు. అయితే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా, లేదా, ఒకవేళ ప్రకటించినా ఎన్ని ఉద్యోగాలకు ఇస్తారు అన్న ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. ఎందుకంటే సూపర్ సిక్స్ పథకాలంటూ ఎన్నికల సమయంలో విపరీతంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని పూర్తిస్థాయిలో అమలు చేయలేక చేతులెత్తేసింది. అరకొరగా ప్రజలకు అందించి సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకుంటోంది. వాటి లో యువతకు ఉపాధి, నిరుద్యోగ భృతి ఊసే మరిచిపోయింది.
కూటమి గొప్పలు
చంద్రబాబు ప్రభుత్వంలో 20 నెలలుగా యువతను దగా చేస్తూ వస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కూటమి అధికారంలోకి రాగానే యువతకు చక్కటి భవిష్యత్తు ఇస్తామంటూ కూటమి నేతలు గొప్పలు చెప్పారు. సూపర్ సిక్స్‌లో భాగంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్న లోకేష్.. విద్యాశాఖామంత్రి అయినా కూడా 20 నెలలుగా ఆ విషయం మర్చిపోయారు. ఉద్యోగాలు వచ్చేలోపు ప్రతి నెలా రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. దానికీ అతీగతీ లేకపోగా, ఇప్పుడు ఉగాదికి జాబ్ క్యాలెండర్ అంటూ ఊరించారు. అనేక సార్లు ఇలాంటి ప్రకటనలు చేసి వెనుతిరిగిన కూటమి నేతలపై యువతకు ఆశలు సన్నగిల్లాయి. ఒకవేళ జాబ్ క్యాలెండర్ ఇచ్చినా ఎన్ని ఉద్యోగాలకు ఇస్తారోనని యువత ఎదురు చూస్తున్నారు.
ఎదురు చూపులు
జిల్లాలో విస్తారంగా విద్యా సంస్థలున్నాయి. ఏటా జూనియర్ కళాశాలల నుంచి సుమారుగా 3 వేల మంది, డిగ్రీ కళాశాలల నుంచి 8 వేల మంది, బీటెక్, ఎంటెక్, డిప్లొమా కోర్సుల్లో 2 వేల మంది ఉత్తీర్ణులవుతున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇస్తామన్న ఉద్యోగాల కోసం సుమారు జిల్లాలో దాదాపు ఐదు లక్షల మంది ఎదురు చూస్తున్నట్టు విద్యార్థి సంఘాల అంచనా. ఇక ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉమ్మడి జిల్లాలో ఇంజినీరింగ్ కళాశాలలకు సుమారు రూ.వెయ్యి కోట్లకు పైనే ఉన్నట్టు తెలుస్తోంది. వీటిని విడుదల చేయాలంటూ ఈ నెల 12న రాజానగరంలోని గోదావరి గ్లోబర్ యూనివర్సిటీ (జీజీయూ) మెయిన్ గేటు వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన తెలిపారు. ఫిబ్రవరి 2న అమలాపురంలో కలెక్టరేట్ వద్ద ఆర్‌ఎస్‌యూ సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేసిన విషయం తెలిసిందే.
విచ్చలవిడిగా మద్యం విక్రయాలు
చంద్రబాబు ప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు చూపకపోగా, మద్యం విక్రయాలను విపరీతంగా ప్రోత్సహిస్తోంది. జిల్లాలో 154 మద్యం షాపులు, 19 బార్లు ద్వారా విచ్చలవిడిగా మద్యం విక్రయాలు సాగుతున్నాయి. వాటిలో అత్యధిక షాపులు జనావాసాల్లోనూ, ఆలయాలు, విద్యాల యాలు, ప్రభుత్వ కార్యాలయాలు సమీపంలో నిర్వహిస్తున్నారు. జిల్లాలో 2025లో మాదక ద్రవ్యాల కేసులు 52 నమోదయ్యాయి. 2024 ఏడాది డిసెంబర్ 31న ధవళేశ్వరం హైవే సమీపంలో 21 కిలోల గంజాయిని పట్టుకోగా అందులో ధవళేశ్వరం టిడ్కో గృహాలు, మండపేట, నిడదవోలు, రాజమహేంద్రవరం ప్రాంతాలకు చెందిన యవత ఉన్నారు. ప్రభుత్వం నుంచి ఉపాధి అవకాశాలు లేకపోవడంతో చాలా మంది ప్రైవేటు వ్యక్తులు, సంస్థల చేతుల్లో మోసపోతున్నారు. రాజమహేంద్రవరం కేంద్రంగా ఓ ప్రైవేటు సంస్థ ఉద్యోగాల ఆశ చూపి ఏడాది కాలంలో రూ.75 లక్షలు కాజేసింది. ఈ మేరకు అందిన ఫిర్యాదుపై పోలీసులు 8 మందిపై కేసు నమోదు చేశారు.
జగన్ ప్రభుత్వంలో మెరుగు
గత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగుల నియామకం ఉద్యమంలా సాగింది. ఆర్టీసీ సంస్థను ప్రభుత్వపరం చేసి సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులను చేసింది. అలాగే జిల్లాలో 512 సచివాలయాల పరిధిలో 9,117 మంది వలంటీర్లుకు గౌరవ వేతనం పేరుతో ఉపాధి కల్పించింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం హయాంలో ఉపాధ్యాయ, పోలీస్ కానిస్టేబుల్ నియామకాల నోటిఫికేషన్లు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం జారీ చేసినవే.
ఫ జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తారా!
ఫ ఎదురు చూస్తున్న యువత
ఫ ఉగాదికి ఇస్తామని
చినబాబు ప్రకటన
ఫ ఏమవుతుందోనని
నిరుద్యోగ ఆందోళన
ఫ ఇప్పటి వరకూ ఆ హామీ
నెరవేర్చని చంద్రబాబు ప్రభుత్వం
యువతను దగా
చేస్తున్న చంద్రబాబు
2024 సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలపై యువత ఆశలు పెట్టుకుంది. కానీ అధికారం చేపట్టిన 20 నెలలుగా యువతను ప్రభుత్వం దగా చేస్తోంది. ఉగాదికి జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమానికి సిద్ధమవుతాం.
– సింహాద్రి కిరణ్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పీడీఎస్‌యూ, రాజమహేంద్రవరం


