అన్నవరం: రత్నగిరి సత్యదేవుని సన్నిధిన అనివేటి మండపంలో ‘శ్రీ పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించడానికి దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం 8.30 గంటలకు నూతన పంచాంగాలను స్వామివారి సన్నిధిలో ఉంచి అర్చకులు పూజలు చేస్తారు. తొమ్మిది గంటలకు దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి, పంచాంగ రచయిత తంగిరాల వేంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ పంచాంగ పఠనం నిర్వహిస్తారు. అనంతరం ఉగాది పచ్చడి, స్వామివారి ప్రసాదం, దేవస్థానం పంచాంగాలను భక్తులకు పంపిణీ చేస్తారని అధికారులు తెలిపారు. అమలాపురానికి చెందిన వేంపరాల సీతారామ అవధాని, విజయవాడకు చెందిన విశ్రాంత వేద పండితుడు సుందర రామ శ్రౌతిలను సన్మానించనున్నారు. ఉగాది పురస్కారం కింద రూ.ఐదు వేలు నగదు ఇస్తారు. ఆలయ ప్రాకారంలో ఉదయం 11 గంటలకు రథంపై, రాత్రి ఏడు గంటలకు అన్నవరం పుర వీధుల్లో వెండి గజవాహనంపై స్వామి, అమ్మవార్లను ఊరేగిస్తారు.
ఇక కియోస్క్ సేవలు
అంతరాలయ దర్శనం, వ్రతాలు, కల్యాణం, ప్రసాదం, కేశఖండన తదితర టిక్కెట్లను ప్రయాస లేకుండా త్వరితగతిన పొందేలా దేవస్థానంలో ‘కియోస్క్ సెల్ఫ్ సర్వీస్’ మెషీన్లను గురువారం ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కరూర్ వైశ్యా బ్యాంక్ వీటిని విరాళంగా సమర్పిస్తున్నట్లు తెలిపారు.


