తూర్పున కోడి కేక!
● రూ.కోట్లకు పడగలెత్తిన పందేలు
● యథేచ్ఛగా గుండాట, పేకాటలు
● గ్రామాల్లో భారీగా నిర్వహణ
● ఫ్లడ్‌లైట్ల వెలుగులో స్టేడియంలు
● కోటీశ్వరులైన కూటమి నేతలు
● జిల్లా వ్యాప్తంగా చేతులు మారిన రూ.150 కోట్లు
● హైకోర్టు ఆదేశాలు బేఖాతరు
● నియంత్రణ మరచి
సహకరించిన పోలీసులు
సాక్షి, రాజమహేంద్రవరం: సంక్రాంతి పండగ పేరు చెప్పి సంప్రదాయం ముసుగులో కోడి పందేలతో పాటు జూదాలు యథేచ్ఛగా జరిగాయి. మూడు రోజుల పాటు వీటిని నిరాటంకంగా నిర్వహించారు. ఇందుకోసం కొన్ని చోట్ల సినిమా సెట్టింగులను తలపించే వేదికలను తయారు చేసి ఫ్లడ్‌లైట్ల వెలుగులో రేయింబవళ్లు నిర్వహించారు. జూదగాళ్లను ఆకట్టుకునేందుకు బరుల వద్ద అన్ని సౌకర్యాలను కల్పించారు. మాంసాహారం విచ్చలవిడిగా విక్రయించగా, బెల్టుషాపుల ద్వారా మద్యం ఏరులై పారింది. పందాల్లో డిజిటల్ పేమెంట్లు సైతం అనుమతించడంతో జూదగాళ్లు మరింత రెచ్చిపోయారు. పేకాట, గుండాట, కోతాట, రంగుబాల్స్ జూదం అడ్డూ అదుపులేకుండా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో దాదాపుగా ప్రత్యేకంగా బరులు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల వీఐపీ, సాధారణ పాసులు జారీ చేసిన సందర్భాలు సైతం లేకపోలేదు. జిల్లాలో సుమారుగా 300కు పైగా చిన్నా, పెద్ద బరులు, పేకాట, కోతాట, గుండాట కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఒక్కో బరిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రోజుకు 40 నుంచి 45 వరకు పందేలు సాగినట్లు సమాచారం. వీటిలో మూడు రోజులుగా పందేలు, ఇతర జూద క్రీడల ద్వారా సుమారు రూ.150 కోట్లకు పైగా చేతులు మారినట్లు అంచనా వేస్తున్నారు. ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ నుంచే కాకుండా విదేశాల నుంచి సైతం కోడి పందాలు చూసేందుకు ప్రజలు తరలి వచ్చారు.
కోర్టు ఆదేశాలు బేఖాతరు
కోడి పందేలు నిషేధిస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సైతం బేఖాతరు చేశారు. మరో వైపు కోడి పందేలపై ఉక్కుపాదం మోపుతామని ఊకదంపుడు ఉపన్యాసాలు, హడావుడిగా బరులు ధ్వసం చేసిన పోలీసులు మూడు రోజుల పాటు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి నేతల అడుగులకు మడుగులొత్తినట్లు తెలిసింది. కూటమి నేతల అండదండలు ఉన్న వారికే బరులు ఏర్పాటు చేసే అవకాశం కల్పించారు. ప్రతి రోజూ ఒక్కో బరి నిర్వాహకుడి నుంచి మూడు ఆధార్‌కార్డులు, కత్తులు, కోళ్లు తమకు సమర్పించేలా ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు తెలిసింది. చివరి రోజు తాము పట్టుకున్నట్లు చూపేందుకు ఇలాంటి చర్యలకు దిగినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
30కి పైగా బరులు..
గోపాలపురం నియోజకవర్గంలో కోడిపందేల జోరు మూడు రోజుల పాటు కొనసాగింది. బరుల వద్ద జూదాలు యథేచ్ఛగా నిర్వహించారు. గుండాటలు బహిరంగంగానే జరిగాయి. ఒక్కొక్కరి వద్ద 10 నుంచి 15 గుండాట బోర్డులు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో 30 పైగా బరులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఎక్కువగా జోడి పందేలు నిర్వహించారు. జోడి పందెం రూ.లక్ష వరకు జరిగింది.
మూడు రోజుల పాటు నియోజకవర్గంలో రూ.20 కోట్ల వరకు చేతులు మారినట్లు సమాచారం. నల్లజర్ల మండలం ప్రకాశరావుపాలెం, గోపాలపురం మండలం వేళ్ల చింతలగూడెం, గుడ్డ్డిగూడెం, గోపాలపురంలో భారీ ఎత్తున పందాలు నిర్వహించారు. డెల్టాకు దీటుగా బరి ఏర్పాటు చేశారు. చివరి రోజు పందేలు ఊపందుకున్నాయి. జోడి పందాలు రూ.10 లక్షలకు నిర్వహించారు.
భారీ స్థాయిలో 35 బరులు
రాజానగరం నియోజకవర్గంలో భారీ స్థాయిలో 35 బరులు ఏర్పాటు చేశారు. చినకొండేపూడి, రఘుదేవపురం, కోటి, మధురపూడి, రాజవరం గ్రామాల్లో భారీ స్థాయిలో పందేలు, జూదాలు నిర్వహించారు. మిర్తిపాడులో టీడీపీ నేతల ఆధ్వర్యంలో భారీ బరి నిర్వహించారు. నందరాడ, దోసకాయలపల్లి, పుణ్యక్షేత్రంలలో భారీ స్థాయిలో బరులు ఏర్పాటు చేశారు. ఎకరా విస్తీర్ణంలో అన్ని వసతులతో జూదాలు నిర్వహించారు. గుండాట కేంద్రాలు ఏకంగా 15 ఏర్పాటు చేశారు. ఒక్క బరిలోనే ఒక రోజులో సుమారు రూ.5 కోట్లకు పైగా చేతులు మారినట్లు తెలిసింది. మూడు రోజుల పాటు జరిగిన పందేలు, జూడ క్రీడల్లో రూ.15 నుంచి రూ.22 కోట్లకు పైగా నగదు చేతులు మారినట్లు తెలిసింది.
‘అనపర్తి’లో 15 బరులు
అనపర్తి, మహేంద్రవాడ, దుప్పలపూడి, బిక్కవోలు, బలభద్రపురం, కొమరిపాలెం, పందలపాక, తొస్సిపూడి, ఏపీ త్రయం, పెదపూడి, జి.మామిడాడ, గండ్రేడు, వడిశలేరు, దొడ్డిగుంట, రంగంపేట, సింగంపల్లి, ఈలకొలను, పెదరాయవరం తదితర గ్రామాల్లో 15 బరులు ఏర్పాటు చేశారు. కోడి పందేలు, గుండాట, షూట్‌బాల్, పేకాట, జూదాలు యథేచ్ఛగా నిర్వహించారు. మూడు రోజుల పాటు జరిగిన జూడ క్రీడలు, పందేల్లో రూ.10 కోట్లకు పైగా నగదు చేతులు మారినట్లు తెలిసింది.
‘కూటమి’గా రూ.కోట్ల వ్యాపారం
మండపేట నియోజకవర్గం పరిధిలోని గొల్లపుంతలలో మూడు, ఏడిద, ఇప్పనపాడు, కేశవరం, ద్వారపూడిలలో ఒక్కొక్క బరి చొప్పున కోడి పందేలు నిర్వహించారు. బరుల నిర్వహణలో టీడీపీ, జనసేన నేతలు కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా మూడు రోజుల వ్యవధిలో రూ.కోట్లలో చేతులు మారినట్లు తెలిసింది.
బరుల వద్ద మినీబార్‌లు
బరుల వద్ద మూడు రోజుల పాటు మద్యం ఏరులై పారింది. బరుల నిర్వాహకులు మినీ బార్‌లు ఏర్పాటు చేశారు. కావలసిన మద్యం అందుబాటులో ఉంచారు. కొన్ని ప్రాంతాల్లో మద్యం వ్యాపారులే అన్ని సదుపాయాలూ కల్పించారు. అధిక ధరలకు విక్రయించి రూ.లక్షలు దండుకున్నారు.
కూటమి నేతలకు కాసుల వర్షం
అధికార అండతో కూటమి నేతలు రెచ్చిపోయారు. పోటీపోటీగా ఇరు పార్టీల నేతలు బరులు ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు కోడి పందేలు, జూద క్రీడలను ప్రోత్సహించారు.
పోటాపోటీగా బరులు ఏర్పాటు చేశారు. ఒక్కో బరి నుంచి రూ.3 నుంచి రూ.10 లక్షల వరకు వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులతో జూదాలు నియంత్రిస్తామని ప్రగల్భాలు పలికిన అధికారులు వారి ద్వారానే వసూళ్లకు తెగబడినట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.9 కోట్లకు పైగా వసూళ్లకు ప్పాలడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని చోట్ల నేతలు బినామీలను నియమించి వ్యవహారం సాగించినట్లు తెలిసింది.
ప్రతి బరిలో మద్యం దుకాణం
నిడదవోలు నియోజకవర్గంలో 25 బరులు, పేకా ట, గుండాట తదితర జూదాలు నిర్వహించారు. కోడి పందేలు, గుండాట, మూడు ముక్కలాట వంటివి నిర్వహించారు. ప్రతి బరిలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడంతో మద్యం ఏరులై పారింది. పట్టణ శివారు సుబ్బరాజుపేట–సింగవరం బరిలో పెద్ద ఎత్తున పందేలు జరిగాయి. ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసి పందేలను తిలకించే ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. డి.ముప్పవరం, కోరుమామిడి, తాడిమళ్ల, కాటకోటేశ్వరం గ్రామాల్లో ఒక్కో పందెం రూ.లక్షల్లో పలికింది. ఖండవల్లి, పిట్టల వేమవరం, పెరవలి, అజ్జరం, ముక్కామ ల, అన్నవరప్పాడు గ్రామాల్లో పందేలు నువ్వా నే నా అన్న స్థాయిలో జరిగాయి. నియోజకవర్గంలో గత మూడు రోజుల్లో రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు తెలిసింది. స్టేషన్ మామూళ్లుగా బరుల స్థాయిని బట్టి రూ. 2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉండ్రాజవరంలో కోతాట భారీ స్థాయిలో నిర్వ హించారు. ఎంట్రీ టికెట్ రూ.2 వేలుగా పెట్టారు. కాయిన్స్ ఇచ్చి అధునాతన పద్ధతిలో ఆడించారు. పేకాటలకు సకల సౌకర్యాలు కల్పించారు.
కడియం–వీరవరం రోడ్డులో క్యాసినో
రాజమండ్రి రూరల్ నియోజకవర్గ వ్యాప్తంగా కోడి పందేలు, జూదాలు విచ్చలవిడిగా జరిగాయి. కూటమి నేతలు అడ్డగోలుగా బరులు ఏర్పాటు చేశారు. మండలానికి ఒకటి చొప్పున పెద్దబరి, గ్రామాల్లో చిన్నబరులు ఏర్పాటు చేశారు. 100 ఫీట్ రోడ్డులో భారీ స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. కడియం మండలం కడియం–వీరవరం రోడ్డులోని ఓ ఫంక్షన్ హాల్లో కేసినో నిర్వహించారు. పది బరుల్లో మూడు రోజుల పాటు జరిగిన పందేలు, గుండాట తదితర జూడ క్రీడల్లో రూ.15 నుంచి రూ.20 కోట్ల లావాదేవీలు జరిగినట్లు తెలిసింది.
చేతులు మారిన రూ.20 కోట్లు!
కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడిలో 8 చోట్ల, కొవ్వూరులో 7 చోట్ల కోడిపందేలు, పేకాట, గుండాట నిర్వహించారు. మద్యం ఏరులై పారింది. మలకపల్లి, కొవ్వూరు తదితర గ్రామాల్లో నిర్వహించిన కోడి పందాల్లో రూ.కోట్లలో చేతులు మారినట్లు తెలిసింది. ఒక్కో బరి నుంచి రూ.3 లక్షల వరకు కూటమి నేతలు, పోలీసులు వసూలు చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన కోడి పందాలు, గుండాట, కోతాట, పేకాట వంటి జూదాల్లో నియోజకవర్గ వ్యాప్తంగా రూ.15 నుంచి రూ.20 కోట్ల వరకు నగదు చేతులు మారినట్లు సమాచారం.
తూర్పున కోడి కేక!
తూర్పున కోడి కేక!
తూర్పున కోడి కేక!
తూర్పున కోడి కేక!
తూర్పున కోడి కేక!


